Share News

ఘనంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. పతాకధారులుగా మను భాకర్, పవన్

ABN , Publish Date - Sep 19 , 2026 | 06:14 PM

జపాన్‌ వేదికగా 20వ ఆసియా క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జపాన్‌లోని పాలొమా మిజుహో స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత స్టార్ షూటర్ మను భాకర్, కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ భారత పతాకధారులుగా వ్యవహరించారు.

ఘనంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. పతాకధారులుగా మను భాకర్, పవన్
Manu Bhaker, Pawan Sehrawat

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా 20వ ఆసియా క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జపాన్‌లోని పాలొమా మిజుహో స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత స్టార్ షూటర్ మను భాకర్, కబడ్డీ ఆటగాడు పవన్ సెహ్రావత్ భారత పతాకధారులుగా వ్యవహరించారు. ఈ ఇద్దరి నేతృత్వంలో భారత అథ్లెట్ల బృందం పరేడ్‌లో పాల్గొంది.

Asia-Games-1.jpg


ఈసారి ఆసియా క్రీడల కోసం భారత్ 503 మంది క్రీడాకారులతో కూడిన భారీ బృందాన్ని బరిలోకి దించింది. మొత్తం 36 క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు పోటీపడనున్నారు. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత పురుషుల కబడ్డీ జట్టులో సభ్యుడైన పవన్ సెహ్రావత్.. మను భాకర్‌తో కలిసి భారత బృందానికి నాయకత్వం వహించాడు.

Asia-Games-2.jpg


చాలా గర్వంగా ఉంది: మను

భారత పతాకధారిగా ఎంపిక కావడంపై మను భాకర్ ఆనందం వ్యక్తం చేసింది. ‘ఈ విషయం తెలిసిన వెంటనే నా ప్రయాణం మొత్తం కళ్ల ముందు మెదిలింది. షూటింగ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఒకరోజు ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే ఇది నాకు ఎంతో భావోద్వేగంతో కూడిన అనుభూతి. నా దేశానికి పతాకధారిగా ఎంపిక కావడం గర్వంగా, గౌరవంగా, ఎంతో సంతోషంగా ఉంది. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని మను పేర్కొంది.


తజీందర్ స్థానంలో పవన్..

పురుషుల విభాగంలో తొలుత షాట్‌పుట్ స్టార్ తజీందర్‌ పాల్ సింగ్ తూర్‌ను పతాకధారిగా ఎంపిక చేశారు. అయితే సాంకేతిక కారణాల వల్ల అతడి స్థానంలో పవన్ సెహ్రావత్‌ను నియమించారు. మరోవైపు ఆసియా క్రీడల్లో పురుషుల కబడ్డీలో మరోసారి స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పవన్ బరిలోకి దిగనున్నాడు. గత ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో 107 పతకాలు సాధించింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. ఈసారి ఆ సంఖ్యను అధిగమించాలనే లక్ష్యంతో భారత క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.


ఇవి కూడా చదవండి:

వన్డేల్లో పంత్‌కు దాదాపు చోటు లేనట్లే: ఆకాశ్ చోప్రా

బహుశా ఇవే నా చివరి ఆసియా క్రీడలు: స్టార్ షట్లర్ ప్రణయ్

Updated Date - Sep 19 , 2026 | 06:14 PM