భారత మహిళల తొలి టెస్టుకు 50 ఏళ్లు.. బీసీసీఐ స్పెషల్ పోస్ట్ చూశారా?
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:31 PM
సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే రోజు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వెస్టిండీస్‌తో భారత మహిళల జట్టు తన తొలి అధికారిక టెస్టు మ్యాచ్ ఆడింది.
ఇంటర్నెట్ డెస్క్: 1976, అక్టోబర్ 31.. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే రోజు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఓ కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వెస్టిండీస్‌తో భారత మహిళల జట్టు తన తొలి అధికారిక టెస్టు మ్యాచ్ ఆడింది. భారత మహిళల క్రికెట్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో దూసుకుపోతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ వంటి స్టార్ క్రికెటర్లు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. బీసీసీఐ కాంట్రాక్టులు, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ద్వారా భారీ ఆదాయం, ప్రకటనలతో నేటి క్రికెటర్లకు మంచి గుర్తింపు లభిస్తోంది. కానీ ఈ స్థాయికి మహిళల క్రికెట్ చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో త్యాగాలు ఉన్నాయి. తాజాగా ఆ మరుపురాని క్షణాలను గుర్తు చేసుకుంటూ బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ చేసింది. టీమిండియా మాజీ మహిళా కెప్టెన్లను సత్కరించింది.
తొలి టెస్టు మ్యాచ్‌లో 17 ఏళ్ల లెగ్ స్పిన్నర్ శుభాంగి కులకర్ణి అరంగేట్రంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదు వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ జట్టును 274 పరుగులకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించింది. భారత కెప్టెన్ శాంతా రంగస్వామి వెస్టిండీస్ పేసర్ ప్యాట్రిషియా విటేకర్ బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదింది. లాంగ్ ఆన్, మిడ్ వికెట్ మధ్య నుంచి బంతిని స్టాండ్స్‌లోకి పంపించింది. అధికారిక అంతర్జాతీయ క్రికెట్‌లో భారత మహిళా క్రికెటర్ కొట్టిన తొలి సిక్స్ ఇదే కావడం విశేషం. భారత్ 269/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి విజయం కోసం ప్రయత్నించినప్పటికీ.. చివరి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కావడంతో మూడు రోజుల టెస్టు డ్రాగా ముగిసింది.
లార్డ్స్ టెస్టు విజయం ఎంతో ప్రత్యేకం..
క్రికెట్‌కు పుట్టిల్లు లార్డ్స్ మైదానంలో ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. అందులోనూ టెస్టు క్రికెట్ ఆడటం గౌరవంగా భావిస్తారు. తొలి పురుషుల టెస్ట్ మ్యాచ్ జరిగిన 142 ఏళ్ల తరవాత... మహిళలు తొలిసారి టెస్ట్ మ్యాచ్(ఇంగ్లండ్-భారత్) ఆడారు. అంతేనా, మహిళల క్రికెట్‌కు ఆతిథ్యం ఇచ్చిన 50 ఏళ్ల తరవాత జరిగిందీ మ్యాచ్. ఇంగ్లండ్‌లో గతంలోనూ మహిళల టెస్టు మ్యాచ్‌లు జరిగినా, లార్డ్స్ వేదికగా జరగడం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్‌లో 270 పరుగుల తేడాతో భారత్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!