ఇరుకైన ఇల్లంటే ఇదే...
ABN , Publish Date - Apr 05 , 2026 | 09:27 AM
డబుల్ బెడ్‌రూమ్, త్రిబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కొనుగోలు చేయాలి. హాల్ విశాలంగా ఉండాలి. కిచెన్ పెద్దగా ఉండాలి. చాలామంది కోరుకునేది ఇదే.
డబుల్ బెడ్‌రూమ్, త్రిబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కొనుగోలు చేయాలి. హాల్ విశాలంగా ఉండాలి. కిచెన్ పెద్దగా ఉండాలి. చాలామంది కోరుకునేది ఇదే. నిజానికి అలాంటి ఇళ్లలో నివసిస్తే సంతోషంగా ఉంటారా? సంతోషం అనేది ఎన్ని గజాలు, ఎన్ని చదరపు మీటర్లు అనే ఇంటి సైజుపై ఆధారపడి ఉంటుందా? అంటే కానే కాదంటారు పెరూకు చెందిన ఫ్యాబియో మోరేనో. కేవలం రెండడుగుల వెడల్పుతో ఆయన కట్టుకున్న ఇంటిని చూస్తే ఆశ్చర్యపోతారెవరైనా. సొంత ఇంటి పట్ల ఫ్యాబియోకు ఉన్న ఆసక్తిని మెచ్చుకోకుండా ఉండలేరు.
నగరాల్లో గజం స్థలం లక్షల రూపాయలు పలుకుతోంది. నగరం నడిబొడ్డున కమర్షియల్ ప్రాంతాల్లో, సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొలువుదీరిన ప్రాంతాల్లో చెప్పనక్కర్లేదు. వంద గజాల స్థలం కొనాలన్నా కోటి రూపాయలకు పైనే వెచ్చించాల్సి ఉంటుంది. అందులో ఇల్లు కట్టుకోవాలంటే మరో కోటి కావాల్సిందే! ఇల్లు కోసం అంత ఆర్భాటం ఎందుకు? చిన్న స్థలమైనా సంతోషంగా జీవించడమే కదా కావాల్సింది అంటాడు ఫ్యాబియో మోరేనో. పెరూలో ఉన్న హ్యురల్ ప్రావిన్స్‌లోని అకాల్లమాలో తనకున్న కొద్దిపాటి స్థలంలోనే ఇల్లు నిర్మించుకుని, అందరి చేత ‘ఔరా’ అనిపించుకున్నాడు మోరేనో. ప్రస్తుతం ఆ ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన ఇల్లుగా గుర్తింపు పొందింది. ఆ నోటా ఈ నోటా ఈ వార్త ప్రచారం పొందడంతో ఆ విచిత్ర చిన్న ఇంటిని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
వసతులకు కొదువ లేదు...
కేవలం రెండడుగుల వెడల్పులో నిర్మించిన ఇంట్లో వసతులేముంటాయి అనుకుంటే మీరు ఇంటి బయట కాలేసినట్టే. ఇంట్లో సౌకర్యాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఫ్యాబియో. ఇండిపెండెంట్ హౌజ్‌లో ఉండే సదుపాయాలన్నీ సమకూర్చుకున్నాడు. స్థలం తక్కువగా ఉంది కాబట్టి, రెండంతస్తుల్లో డ్యూప్లెక్స్‌లాగా నిర్మించిన ఈ ఇల్లు విల్లాను తలపిస్తుంది. ఇందులో కిచెన్, బెడ్‌రూమ్, స్టడీరూమ్, వాష్‌రూమ్స్, డైనింగ్‌రూమ్, హాల్... ఇలా సకల సదుపాయాలు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంతేనా... షాండ్లియర్లు, టీవీ, ఫ్రిజ్, బుక్‌షెల్ఫ్‌లు, సోఫాసెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ ఇంటి నిర్మాణంలో సిమెంటు, ఇసుక ఉపయోగించలేదు. స్టీలు ఫ్రేములు, కలప సహాయంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇంటికి సంబంధించి వెంటిలేషన్ అద్భుతంగా ఉంటుంది.
ఈ ఇంట్లో అత్యంత ఇరుకుగా ఒకచోట 36 అంగుళాలు ఉంటే, మరోచోట వెడెల్పు 59 అంగుళాలు ఉంటుంది. ఇతర ఇళ్ల మధ్య ప్రత్యేకంగా కనిపించే ఈ ‘న్యారో హౌజ్’ పర్యాటక ప్రదేశంగానూ గుర్తింపు పొందింది. ‘వరల్డ్ న్యారోయెస్ట్ హౌజ్’గా ‘గిన్నిస్’ వరల్డ్ రికార్డుల్లో నమోదు చేయాలని ఫ్యాబియో అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. తొందర్లోనే రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉందని ఆశాభావం వక్తం చేస్తున్నాడు ఫ్యాబియో.
ఇప్పటిదాకా పోలండ్‌లోని వార్సాలో ఉన్న ‘కెరెట్ హౌజ్’ వరల్డ్ న్యారోయెస్ట్ హౌజ్‌గా గిన్నిస్ రికార్డుల్లో నమోదై ఉంది. దాని కన్నా ఇది మరింత ఇరుకుగా ఉండటంతో ప్రస్తుతానికి దీనినే ‘రికార్డు’ హౌజ్‌గా చెప్పుకుంటున్నారు. అయితే ఈ ఇంట్లో ఫ్యాబియో ఒంటరిగా ఉంటున్నాడా? లేక కుటుంబంతో ఉంటున్నాడా? అనేది తెలియలేదు. ఎవరైనా చూడాలని వచ్చినప్పుడు మాత్రం ఫ్యాబియో వారికి ఇల్లంతా చూపిస్తూ, దాని విశేషాలను ఆసక్తిగా చెబుతున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News