Share News

అన్నీ మామిడి పండ్లు కావు.. రంగు చూసి కొంటే విషం కొన్నట్టే

ABN , Publish Date - Apr 05 , 2026 | 05:52 AM

వేసవి వచ్చేసింది.. మామిడి పండ్ల సీజన్‌ మొదలైంది.. ట్రాఫిక్‌లో బిజీబిజీగా వాహనాన్ని నడుపుకుంటూ వెళుతూ.. రహదారి పక్కన నిగనిగలాడుతున్న మామిడి పండ్లను చూసి సడెన్‌ బ్రేకేశారా..?

అన్నీ మామిడి పండ్లు కావు.. రంగు చూసి కొంటే విషం కొన్నట్టే

  • మార్కెట్‌లోకి రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లు

  • ఇష్టారాజ్యంగా ఇథలిన్‌, నిషేధిత కాల్షియం కార్బైడ్‌ వినియోగం

  • రెండు, మూడు రోజుల్లోనే నిగనిగలాడే రంగులోకి..

  • శ్వాసకోశ, గ్యాస్ట్రిక్‌ సమస్యల ముప్పు ఉందంటున్న వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): వేసవి వచ్చేసింది.. మామిడి పండ్ల సీజన్‌ మొదలైంది.. ట్రాఫిక్‌లో బిజీబిజీగా వాహనాన్ని నడుపుకుంటూ వెళుతూ.. రహదారి పక్కన నిగనిగలాడుతున్న మామిడి పండ్లను చూసి సడెన్‌ బ్రేకేశారా..? ఏమున్నాయిరా పండ్లు.. తినేయాల్సిందేననుకుంటూ కొనేస్తున్నారా ? అలా కొనుగోలు చేసే ముందు కాస్త ఆగండి..!! ఎందుకంటే.. మనం కొనుగోలు చేసే పండ్లు సహజసిద్ధంగా పండినవా? రసాయనాలు వాడి వాటిని కంటికి ఇంపుగా తయారు చేశారా? అని తెలుసుకోవడం మంచిది అంటున్నారు వైద్యులు.. రసాయనాల వాడి మాగబెట్టిన పండ్ల వల్ల కడుపులో విషం చేరుతుంది. వాటిని తింటే దీర్ఘకాలంలో చర్మ, శ్వాసకోశ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు వచ్చే ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సీజన్‌ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌ల్లో, రహదారుల పక్కన ఎక్కడికక్కడ మామిడి పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే, కొందరు వ్యాపారులు కాసుల కోసం రసాయనాలు వాడి పండ్లను మాగబెట్టి కంటికి ఇంపుగా తయారు చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు.


ఇథలిన్‌, కాల్షియం కార్బైడ్‌ వంటి రసాయనాల వినియోగం

కొందరు వ్యాపారులు ఇథలిన్‌, నిషేధిత కాల్షియం కార్బైడ్‌తోపాటు మరికొన్ని ప్రమాదకర రసాయనాలను మోతాదుకు మించి వినియోగించి మామిడి పండ్లను మాగబెడుతున్నారు. ఇథలిన్‌ ప్యాకెట్లను మామిడికాయల మధ్య ఉంచి వేగంగా రంగుమారేలా చేస్తున్నారు. సాధారణంగా మామిడి కాయ 10-12 రోజుల్లో పండుగా మారుతుంది. అయితే, ఇథలిన్‌, కాల్షియం కార్బైడ్‌ వల్ల పచ్చికాయలు కూడా కేవలం 2, 3 రోజుల్లోనే పక్వానికి వచ్చి పసుపుపచ్చ రంగులోకి మారి.. కంటికి ఇంపుగా కనిపిస్తాయి. కొందరు వ్యాపారులు తమ స్వార్థం కోసం మోతాదుకు మించి ఆయా రసాయనాలను స్ర్పే చేయడం, పండ్ల మధ్య ఉంచడంతో అవి విషంతో నిండుతున్నాయి. పది కిలోల మామిడి కాయలుండే ఒక ట్రేలో కేవలం 2 ఇథలిన్‌ ప్యాకెట్లే ఉంచాలి. అదీ పండ్లకు తగలకుండా పెట్టాలి. కానీ, కొందరు వ్యాపారులు ఒక్కో ట్రేలో 7-8 ప్యాకెట్లను నేరుగా ఉంచుతున్నారు. ఆ ప్యాకెట్ల నుంచి వెలువడే హానికర గ్యాస్‌తో మామిడి కాయ రెండ్రోజుల్లోనే మగ్గుతోంది. ఇక, మామిడి పండ్లలో కాల్షియం కార్బైడ్‌ వినియోగంపై కొంతకాలంగా చర్చ జరుగుతుండటంతో కొందరు వ్యాపారులు ఇథలిన్‌ రీపనర్‌ (కాగితాన్ని)ను అధికంగా వినియోగిస్తున్నారు. ఈ కాగితాన్ని డబ్బాల్లో, అగ్గిపెట్టెల్లో ఉంచి మామిడి పండ్ల మధ్య పెడుతున్నారు. దీంతో 24 గంటల్లోనే పండ్లు పక్వానికి వచ్చేస్తున్నాయు. మార్కెట్‌లో అక్కడక్కడ పైకి ఫుడ్‌సేఫ్టీ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ఆమో దం పొందిన ఇథలీన్‌ రీపనర్‌ కవర్లు ఉన్నా.. లోపల కాల్షియం కార్బైడ్‌ను ఉంచుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు చేష్టలుడిగి చూస్తుండడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు.


అరెస్టులు చేసినా అదే తీరు..!

రసాయనాలను ఉపయోగించి పండ్లను కృత్రిమంగా మాగబెట్టి ప్రజారోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులపై పోలీసులు దాడులు చేస్తున్నా.. నిందితులను అరెస్టులు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌, చాదర్‌ఘాట్‌, భవానీనగర్‌, హబీబ్‌నగర్‌ ప్రాం తాల్లో కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను విక్రయిస్తున్న ఐదుగురు హోల్‌సేల్‌ వ్యాపారులను గతేడాది పోలీసులు అరెస్టు చేసి.. వారి వద్ద కార్బైడ్‌, ఇథలిన్‌ రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇథలిన్‌తో పండ్లను మాగబెట్టి మొజంజాహీ మార్కెట్‌లో విక్రయించిన పలువురు వ్యాపారులు కూడా గతేడాది అరెస్టయ్యారు. ఇక, పురానాపూల్‌ చెందిన నికాబ్‌వాలా కునాల్‌ అనే పండ్ల వ్యాపారి డైమండ్‌ రైప్‌- ఇథలిన్‌ రీపనర్‌’ను రసాయనాలు వాడి మామిడి పండ్లను మగ్గపెడుతున్నాడనే సమాచారంలో పోలీసులు శుక్రవారం ఉదయం దాడి చేశారు. అతని గోదాములో నాలుగు డైమండ్‌ రైప్‌ - ఇథలిన్‌ రీపనర్‌ ప్యాకెట్లు, విడిగా ఉన్న 25 ఇథిలిన్‌ రీపనర్‌ సాచెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా అరెస్టులు, దాడులు జరుగుతున్నా వ్యాపారుల తీరు మారడం లేదు.


రసాయనాలు కలిసిన పండ్లను గుర్తించడం ఎలా ?

  • సహజంగా పండిన మామిడి పండు ఎప్పుడూ ఒకే రంగులో ఉండదు. అక్కడక్కడ ఆకుపచ్చగా, కొంత పసుపురంగులో ఉంటుంది. అదే, ఇథలిన్‌, కాల్షియం కార్బైడ్‌ను అధికంగా వినియోగించి మాగపెట్టిన పండ్లు పూర్తిగా పసుపు పచ్చగా నిగనిగలాడుతూ.. ఒకేరంగులో కనిపిస్తాయి

  • రసాయనాలను గుర్తించేందుకు.. మార్కెట్‌లో కొన్న మామిడి పండ్లను ఒక బకెట్‌ నీటిలో వేయాలి. ముందుగా ఆ పండ్లను బోరిక్‌ యాసిడ్‌ లేదా గిన్నెలు శుభ్రం చేసేందుకు ఉపయోగించే యాసిడ్‌తో రుద్దాలి. సహజంగా పండిన పండు బరువు వల్ల నీటిలో మునిగిపోతుంది. అదే రసాయనాలతో మాగబెట్టిన పండు అయితే నీటిపై తేలుతుంది.

  • సహజసిద్ధంగా పండిన మామిడి పండు నుంచి తీపిగా ఉండటంతోపాటు నోరంతా రుచి ఉంటుంది. రసాయనాలతో మాగబెట్టిన పండుకు వాసన ఉండదు. ఒకవేళ ఉన్నా ఘాటైన రసాయన వాసనలా అనిపిస్తోంది. ఆ పండు తిన్నప్పుడు పుల్లగా లేదా చప్పగా ఉంటుంది. నాలుకపై స్వల్పంగా మంట పుట్టడం లేదా గొంతులో ఇబ్బందిగా ఉంటుంది.


రసాయన పండ్లతో వచ్చే ఆరోగ్య సమస్యలు

రసాయనాలతో మాగపెట్టిన పండ్లను తినడంతో దగ్గు, గొంతునొప్పి, జలుబు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, గ్ర్యాస్ర్టిక్‌, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ధూమపానంతో కేన్సర్‌ రావడానికి 15-20 ఏళ్ల సమయం పడితే ఇథలిన్‌, కాల్షియం కార్బైడ్‌ను అధిక మోతాదులో వినియోగించి మాగబెట్టిన పండ్లను తింటే 5-6 ఏళ్లలోనే ఊపిరితిత్తుల కేన్సర్‌ వచ్చే అవకాశముందని డాక్టర్లు పేర్కొంటున్నారు.

జాగ్రత్తగా కొనుగోలు చేయాలి

రోడ్ల వెంట మామిడి పండ్లను కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. పసుపుపచ్చగా ఉందని తీసుకుంటే రోగాలపాలవుతారు. ఒకవేళ తీసుకున్న ఇంటికి వచ్చిన తర్వాత వాటిని బోరిక్‌ యాసిడ్‌తో కడిగితే.. అవి సహజసిద్ధమైనవా.. రసాయనాలతో మాగబెట్టినవా అనే సంగతి తెలిసిపోతుంది. ఇథలిన్‌, కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన పండ్లు తినడం వల్ల దీర్ఘకాలంలో చర్మ, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

- డాక్టర్‌ శ్రీకృష్ణ రాఘవేంద్ర బొడ్డు,

జనరల్‌ ఫిజీషియన్‌, కామినేని హాస్పిటల్‌

Updated Date - Apr 05 , 2026 | 08:38 AM