‘విండో క్లీనింగ్’ వరల్డ్ కప్
ABN , Publish Date - Aug 16 , 2026 | 01:39 PM
ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ వరల్డ్ కప్ గురించి విన్నాం. కానీ ‘విండో క్లీనింగ్’ వరల్డ్ కప్ గురించి ఎప్పుడైనా విన్నారా? కిటికీలు తుడిచే వాళ్ల కోసం ఒక వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారంటే ఆశ్చర్యమే.
ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ వరల్డ్ కప్ గురించి విన్నాం. కానీ ‘విండో క్లీనింగ్’ వరల్డ్ కప్ గురించి ఎప్పుడైనా విన్నారా? కిటికీలు తుడిచే వాళ్ల కోసం ఒక వరల్డ్ కప్ నిర్వహిస్తున్నారంటే ఆశ్చర్యమే. ఇంతకీ ఈ పోటీ ఎక్కడ జరుగుతుంది?...
చిన్న పనైనా ఇష్టంతో, నైపుణ్యంతో చేస్తే అది కూడా గుర్తింపును తెచ్చిపెడుతుంది. అందుకు చక్కని ఉదాహరణ ‘విండో క్లీనింగ్’ పోటీలు. వేల మంది జనం... స్టేజీ మీద వరుసగా అద్దాల కిటికీలు... పోటీదారులను ఉత్సాహపరుస్తూ కేకలు వేస్తున్న ప్రజలు... వెరసి క్రికెట్, ఫుట్‌బాల్ పోటీలకు ఇదేమీ తక్కువ కాదన్నట్టుగా సందడి. లండన్‌లో జరిగే ‘విండో క్లీనింగ్’ వరల్డ్‌కప్ పోటీల్లో కనిపించే దృశ్యమిది. ఈ పోటీల్లో పాల్గొనడానికి జపాన్, అమెరికా, జర్మనీ, ఇటలీ, చెక్ రిపబ్లిక్... వంటి దేశాల నుంచి పోటీదారులు వెళ్తుంటారు.
విజేత ఎంపిక ఇలా...
పోటీలో పాల్గొనే గాజు యోధులు బకెట్, గుడ్డ, స్క్వీజ్, క్లీనింగ్ ద్రావణం పట్టుకుని సిద్ధంగా ఉంటారు. రెఫరీ విజిల్ ఊదగానే వాళ్లంతా మెరుపు వేగంతో కిటికీలను శుభ్రం చేయడం మొదలెడతారు. అదొక పనిలా కాకుండా, శుభ్రం చేయడం కూడా ఒక కళ అనిపించేలా పోటీలు సాగుతాయి. అద్దం మీద ఒక్క గీత కూడా లేకుండా శుభ్రం చేసిన యోధున్ని ఆ రౌండ్ విజేతగా జడ్జీలు ప్రకటిస్తారు. అలా ప్రిలిమినరీ రౌండ్స్‌లో విజేతలుగా నిలిచినవారు ఫైనల్ రౌండ్‌లో తలపడతారు.
ఈ రౌండ్ అత్యంత కఠినమైనది. ప్రతిభ కనబర్చినవారే విజేతగా నిలుస్తారు. ఫైనల్‌లో మూడు కిటికీలను ఎంత వేగంగా, ఎంత బాగా శుభ్రం చేస్తారో వారే విజేత. ముగ్గురు న్యాయనిర్ణేతలు ప్రతీ చిన్న గీత, చుక్క, మరకను కూడా గమనిస్తారు. ఇప్పటిదాకా క్లీనింగ్‌లో దిగ్గజం అంటే... 71 ఏళ్ల టెర్రీ బరోస్. ఆయన 2009 పోటీలలో 45 అంగుళాల వెడల్పు, 45 అంగుళాల పొడవున్న 3 కిటికీలను కేవలం 9.14 సెకన్లలో శుభ్రం చేసి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. వరల్డ్‌కప్ విజేతకు నగదు బహుమతి అందిస్తారు. ఈ బహుమతి కన్నా ప్రపంచ ఛాంపియన్‌గా పేరు పొందడాన్ని గౌరవంగా భావిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News