రెచ్చిపోయిన మోడల్.. బట్టలు విప్పేసి రైల్వే అధికారులపై దాడి..
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:02 PM
రైల్వే అధికారులపై బ్లేడుతో దాడి చేసిన కేసులో మోడల్, వెబ్‌సిరీస్ నటి అంతరా బెనర్జీని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 12న ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో ఆమె విచక్షణారహితంగా ప్రవర్తించడంతో అదుపులోకి తీసుకున్నారు.
ముంబై: ఆరావళి ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే అధికారులపై బ్లేడుతో దాడికి పాల్పడిన కేసులో మోడల్, వెబ్‌సిరీస్ నటి అంతరా బెనర్జీ (31)ని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీ కోచ్‌లో సీటు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆమె రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ అధికారి సహా అంతరాకు గాయాలయ్యాయి. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నోటీసులు ఇచ్చి బెయిల్‌పై విడుదల చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంతరా బెనర్జీ షూటింగ్ నిమిత్తం సూరత్‌కు వెళ్లేందుకు ఈ నెల 12 రాత్రి 9:30 గంటలకు బోరివాలిలో ఆరావళి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. ఆమె వద్ద స్లీపర్-క్లాస్ టికెట్ ఉండగా.. రిజర్వ్‌డ్ ఏసీ కోచ్‌లోకి ప్రవేశించింది. ఆమె సీటులో కూర్చొని ఉండగా కాసేపటికి ఓ ప్రయాణికుడు వచ్చాడు. అది తాను రిజర్వ్ చేసిన సీటని, లేచి వెళ్లిపోవాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో సదరు ప్రయాణికుడు టికెట్ కలెక్టర్ హరికేష్ త్రిపాఠి, ఆర్‌పీఎఫ్‌కు సమాచారం అందించాడు. దీంతో కానిస్టేబుల్ రాజేశ్ కుమార్, ఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ యమినికాంత్ మిశ్రా వారి వద్దకు చేరుకున్నారు.
సీటును ఖాళీ చేయాలని వారిద్దరూ అంతరాను కోరారు. అయితే, అందుకు ఆమె నిరాకరిస్తూ అధికారులను దూషించింది. ఆ తర్వాత అంతరా తన బట్టలు విప్పేసి బ్లేడుతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో మిశ్రాతో పాటు అంతరాకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఏసీ కోచ్ తలుపులను మూసేశారు. దీంతో ఆమె తప్పించుకోవడానికి కోచ్ అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించింది. దాదాపు గంటపాటు ఆమె హంగామా చేయడంతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనంతరం అంతరాను దహను రైల్వే స్టేషన్‌లో అధికారులు దించేశారు.
మరుసటి రోజు ఉదయం అంతరాను బోరివాలి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ చేయాలని వారు కోరగా ఆమె నిరాకరించింది. తనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో అంతరాపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం నోటీసులు ఇచ్చి బెయిల్‌పై విడుదల చేశారు. కాగా, ఏసీ కోచ్ టికెట్ దొరక్కపోవడంతో అంతరా బెనర్జీ తీవ్ర మనోవేదనకు గురైందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అటల్‌జీ సేవలు స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
సీఎం హత్యకు రెడీ అంటూ ప్రకటించిన వ్యక్తి అరెస్ట్