Share News

లక్‌ కోసం... క్యూ కడుతున్నారు!

ABN , Publish Date - Jun 07 , 2026 | 08:36 AM

ఇండియాలో వీసా కోసం ఏకంగా ఓ గుడే (చిల్కూరి బాలాజీ) ఉందని ఇటీవల అమెరికన్లు కూడా మాట్లాడుకోవడం చూశాం.

లక్‌ కోసం... క్యూ కడుతున్నారు!
Lifestyle

ఇండియాలో వీసా కోసం ఏకంగా ఓ గుడే (చిల్కూరి బాలాజీ) ఉందని ఇటీవల అమెరికన్లు కూడా మాట్లాడుకోవడం చూశాం. అయితే ప్రస్తుతం ప్రపంచమంతా నమ్మకం చుట్టూనే తిరుగుతోంది. అక్కడికి వెళితే ఉద్యోగం వస్తుందని, ఇక్కడికి వెళితే వ్యాపారం పెరుగుతుందని, ఆ గుడిలో మొక్కుకుంటే ప్రేమ ఫలిస్తుందని... ఇలా ఎన్నో ఎన్నెన్నో నమ్మకాల ప్రాంతాలు, ప్రాంగణాలున్నాయి. వాటిలో కొన్ని...

జంటగా మారాలని...

ప్రేమ ఫలించాలని ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తుంటారు ప్రేమికులు. తైవాన్‌లో యువత ప్రేమ కోసం ‘లాంగ్‌షాన్‌ ఆలయం’ చుట్టూ తిరుగుతున్నారు. ఇదో 300 ఏళ్ల పురాతన ఆలయం. వందకు పైగా దేవతా మూర్తులకు ఇక్కడ ప్రార్థనలు జరుగుతుంటాయి. అయితే ఇందులో ప్రసిద్ధ చెందిన దేవతా మూర్తి ‘యూ లావో’. చైనీయులు ఇతడిని పెళ్లిసంబంధాల దేవుడిగా పిలుస్తారు. ఎర్ర దారంతో ప్రార్థన చేస్తే త్వరలో జంటగా మారతారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవుడితో పాటు ఆరోగ్య, కెరీర్‌ దేవుళ్ల ఆలయాలూ ఇక్కడ ఉండడం విశేషం.


మహిమాన్విత పర్వతం

book3.1.jpgదక్షిణ కొరియాలో ఈ మధ్య ఓ ట్రెండ్‌ మొదలైంది. 20,30 ఏళ్ల వయసులో ఉన్న యువత అంతా తమ సోషల్‌ మీడియాల్లో ‘గ్వానాక్‌’ స్టోరీలు పెడుతున్నారు. రాజధాని సియోల్‌ సమీపంలో ఓ సుందరమైన పర్వతం గ్వానాక్‌. ‘ఈ మధ్యనే గ్వానాక్‌ అధిరోహించి వచ్చా... రెండు ట్యూటరింగ్‌ ఉద్యోగాలు వచ్చాయి. అంతా ఆ కొండ మహిమే అని చెప్పలేను. కానీ అక్కడికి వెళ్లి వచ్చాక జీవితం మారింది.’ అని స్టోరీ పెట్టాడు ఇరవై మూడేళ్ల కిమ్‌. ‘గ్వానాక్‌ పర్వతాన్ని మూడుసార్లు అధిరోహిస్తే అదృష్టం మీ తలుపు తడుతుందనే టీవీ కార్యక్రమాన్ని చూసి మా అమ్మ మమ్మల్నందరినీ అక్కడికి తీసుకువెళ్లింది. కొండెక్కుతూ దారంతా మా కష్టాల గురించే మాట్లాడుకున్నాం. ఏదో మాయ జరిగినట్టుగానే చాలా సమస్యలు తొలిగిపోయాయి’ అని ఓ డిగ్రీ విద్యార్థి అంటున్నాడు. పరీక్షలు బాగా రాశామనీ చెప్పేవాళ్లూ ఉన్నారు. అక్కడి సోషల్‌ మీడియాలో గ్వానాక్‌ను ఎక్కడం వల్ల కలిగిన మార్పుల గురించి రీల్స్‌ పెడుతున్న వాళ్లే ఎక్కువ. ‘ఏ సమయంలో అధిరోహించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?’ లాంటి స్టోరీలు చేస్తున్నవాళ్లూ పెరిగిపోయారు.


శాంతి చేకూరాలని...

book3.2.jpgఎన్నో బౌద్ధ ఆలయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బ్యాంకాక్‌. ఈ ఆలయాల్లో శయనించే భంగిమలో ఉన్న అతి పొడవాటి బౌద్ధ విగ్రహం ఉన్న ‘వాట్‌ ఫో’ అదృష్టాన్ని అందించే ఆలయంగా థాయి వాసులు నమ్ముతారు. బుద్ధుడి విగ్రహం వెనక 108 కంచు పాత్రలు ఉంటాయి. తమ జీవితంలో వేదన తొలగిపోవాలని కోరుకునేవారు బుద్ధుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఒక్కో పాత్రలో ఒక్కో నాణెం వేస్తూ వెళతారు. ఇలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని, శాంతి చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. ఇలాంటి కోరికలతో ఈ గుడికి వచ్చే వాళ్లు ఎక్కువే.


ఆ రాయి ఎత్తితే...

book3.3.jpgజపాన్‌ తీరంలో ప్రసిద్ధి చెందిన నగరం ఒసాకా. ఇక్కడి ‘సుమియోషి తైషా గ్రాండ్‌ ఆలయం’ గురించి జపనీయులు కథలు కథలుగా చెబుతారు. సుమారు రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రతీ జనవరిలో ఇరవై లక్షల మంది సందర్శిస్తారు. కొత్త ఏడాదిలో మొదటి ఆలయ సందర్శనం అంటే సుమియోషి కే అనేవాళ్లే చాలా మంది. ఉద్యోగ విజయం, ప్రయాణ సఫలం, జీవితం సుభిక్షంగా ఉండాలని... ఇలా రకరకాల కోరికలతో ఈ గుడికి వెళ్లేవాళ్లెందరో. అయితే ఇక్కడ ‘ఓమో కారు’ రాళ్లని ఎత్తడం అనే విచిత్రమైన ఆచారం ఉంది. ఓమో కారు అంటే భారీ అని అర్థం. కోరికను మనసులో తలచుకుంటూ భక్తులు ఈ రాయిని ఎత్తుతారు. ఆ సమయంలో అది చాలా తేలికగా అనిపిస్తే కోరిక ఫలించినట్టేనని భక్తులు నమ్ముతారు.


అందరూ చల్లగా ఉండాలి

book3,3.jpgటోక్యోలోని ‘కంద మత్సురి’ అదృష్టాన్ని అందించే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ సముదాయంలో చెడును తరిమి కొట్టే ఆరాధనలు నిత్యం జరుగుతుంటాయి. అందుకే ఆయా కోరికలతో వెళ్లే భక్తులు ఎందరో. ఇక్కడ ప్రతీ రెండేళ్లకు ఓసారి కంద మత్సురి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ భక్తులు ఊరేగింపుగా ఊరంతా సాగడం విశేషం.


ఆ నీళ్లు చాలు

book3.4.jpgప్రపంచంలో అతి పెద్ద దేవాలయం ఆంగ్‌కార్‌వాట్‌. కాంబోడియాలోని ఈ ఆలయం 200 కన్నా ఎక్కువ ఫుట్‌బాల్‌ మైదానాలంత పెద్దగా ఉంటుంది. ఈ ఆలయ విశ్వాసాలను స్థానిక ఖ్మేర్‌ జాతీయులు ఎంతో గొప్పగా చెబుతారు. ముఖ్యంగా అక్కడ ‘స్రౌచ్‌ ట్యూక్‌’ (జల దీవెనలు) ప్రసిద్ధి. ప్రధాన ఆలయాల దగ్గర బౌద్ధ గురువులు తామర రసం కలిపిన నీటిని భక్తులపై చల్లుతారు. ఈ జలం ఎంతో మహిమాన్వితమైందిగా భక్తులు నమ్ముతారు. దురదృష్టాన్ని, నెగెటివిటీని పారదోలే మహిమ ఈ జలానికి ఉందని పేర్కొంటారు. అలాగే ఆంగ్‌కార్‌లో ఓ రాత్రి నిద్రిస్తే అదృష్టం వరిస్తుందని స్థానికులే కాదు, విదేశీ యాత్రికులు కూడా విశ్వసిస్తారు. ఆంగ్‌కార్‌ ఆలయంలోనే ఉన్న క్షీరసాగర మధనం గ్యాలరీ దగ్గర చాలామంది కూర్చుని ధ్యానం చేసుకుంటుంటారు. ఈ ధ్యానం వల్ల వల్ల కష్టాలు తొలగిపోవడమే కాకుండా, మంచి ఆరోగ్యం చేకూరుతుందనేది అక్కడి ప్రజల విశ్వాసం.


ఏది కోరుకుంటే అదే...

book3.5.jpgహాంకాంగ్‌లో ‘లాటరీ’ ఆలయంగా ‘వాంగ్‌ తాయ్‌ సిన్‌’ పేరు తెచ్చుకుంది. ఈ తావో ఆలయం అక్కడి ప్రముఖ టూరిస్ట్‌ ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం ‘కావ్‌ చిమ్‌ (లాటరీ కవిత్వం)’ అనే విశ్వాసానికి ప్రసిద్ధి. ఇక్కడ ‘మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది’ అని భక్తులు నమ్ముతారు. ఆలయం పరిసరాల్లో అనేక అంకెలు రాసిన పుల్లలు ఉన్న పొడవాటి వెదురు బుట్ట ఉంటుంది. ఆ బుట్ట లోంచి ఒక పుల్ల పడేవరకు భక్తులు ఊపుతారు. ఆ పుల్లను తీసుకుని పక్కనే ఉన్న పండితుల దగ్గరకి వెళ్లి, ఆ అంకె ప్రకారం తమ భవిష్యత్తును తెలుసుకుంటారు. కానుకలు సమర్పిస్తూ పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తారు. ఇలాంటి లాటరీ ఆలయాలు హాంకాంగ్‌లో మరి కొన్ని ఉన్నాయి. అయితే వాటిల్లో వాంగ్‌ తాయ్‌ సిన్‌ ఎంతో ప్రసిద్ధి చెందింది.


ఈ వార్తలు కూడా చదవండి:

తేడా రావొద్దు! పార్టీకి నష్టం చేస్తే కఠినంగా ఉంటా

సీఎం రేవంత్‌వి దేశద్రోహ వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 09:18 AM