గ్రామసభలతో ప్రజా సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:13 AM
గ్రామ సభలతో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ శనివారం నిర్వహించారు.
భగత్‌నగర్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): గ్రామ సభలతో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చదనం పారిశుధ్యంపై గ్రామాల్లో దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వస్తే పరిష్కారమవుతాయని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పైపులైన్లకు మరమ్మతులు, నీటి ట్యాంకులను శుభ్రం చేయించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి తొలగించాలన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటూ వర్షపు నీటిని సంరక్షించాలన్నారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి గ్రామస్థుల సమస్యలు పరిష్కరించాలని కార్యదర్శిని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి ఆర్డీవో వెంకటరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈవో ఆనందం పాల్గొన్నారు.