Share News

భోజన కుతూహలం మారేడు...

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:59 PM

మారేడు... సంస్కృతంలో ‘బిల్వం’ అని ప్రసిద్ధి. ఇది ఆధ్యాత్మిక, ఔషధ ప్రాధాన్యాలు కలిగిన ప్రాచీన ఆయుర్వేద వృక్షం. వేద కాలం నుంచే భారతీయ శాస్త్రాలలో దీనికి విశిష్ట స్థానం ఉంది. వేదాలు, పురాణాలు...

భోజన కుతూహలం మారేడు...

అమీబియాసిస్‌కు ఔషధం దీపనం గురు సంగ్రాహి స్నిగ్ధమ్‌ బైల్వంతు కోమలమ్‌తదేవ పక్వం విఙ్ఞేయం మధురానురసం గురు!

మారేడు... సంస్కృతంలో ‘బిల్వం’ అని ప్రసిద్ధి. ఇది ఆధ్యాత్మిక, ఔషధ ప్రాధాన్యాలు కలిగిన ప్రాచీన ఆయుర్వేద వృక్షం. వేద కాలం నుంచే భారతీయ శాస్త్రాలలో దీనికి విశిష్ట స్థానం ఉంది. వేదాలు, పురాణాలు, ఆయుర్వేద గ్రంథాలు, ఇతర సంప్రదాయ సాహిత్యాల్లో ‘బిల్వ’ గురించి విస్తృత చర్చలు జరిగాయి. దీన్ని ‘శివద్రుమం’ అని కూడా అంటారు. పరమశివునికి బిల్వ పత్రాలను సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. బిల్వదళంలోని మూడు ఆకులు త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు... మొదలైన అనేక తాత్త్విక భావాలకు ప్రతీకలు.

దోషాలను హరిస్తుంది...

గాలిని నీటిని, నేలని మన దేహాన్ని కూడా విషదోషాల బారి నుంచి కాపాడే శక్తి మారేడు చెట్టుకు ఉంది. ‘భోజన కుతూహలం’ గ్రంథంలో రఘునాథ సూరి... మారేడు కాయ, పండు గుణాలను వేర్వేరుగా వివరించాడు. పచ్చి మారేడు కాయ దీపనం అంటే జఠరాగ్నిని పెంపు చేస్తుంది. తిన్న తరువాత ఎక్కువసేపు పొట్టలో ఉండి ఆలస్యంగా జీర్ణం అవుతుంది. నీళ్ల విరేచనాలు, జిగురు విరేచనాలు, అతిసారం, కలరాలాంటి వ్యాధుల్లో ఇది తక్షణ ప్రయోజనం కలిగిస్తుంది. పేగులను మృదువు పరుస్తుంది. పచ్చిది కొద్దిగా చేదు, వగరు రుచులతో కూడి ఉంటుంది. మిగలపండిన మారేడులో చేదుతో పాటు తీపి కూడా ఉంటుంది. జీర్ణం అయ్యాక తీపి గుణాలను పొందుతుంది. మూడు దోషాలనూ హరిస్తుంది.

‘బిల్వాది గుటిక’ అనే ఆయుర్వేద ఔషధాన్ని పేగుల్లో వచ్చిన దోషాలపైన, కీటకాలు కుట్టినప్పుడు ఏర్పడిన లక్షణాలపైన, అలర్జీల పైన ముఖ్యంగా అమీబియాసిస్‌ వ్యాధిలో ఉపయోగిస్తారు. షుగరు వ్యాధి ఉన్నవారికి ఇది మంచి ఔషధం. ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యమున్న దశమూల ద్రవ్యాలలో (పది మూలికల సమూహం) మారేడు వేరు కూడా ఉంది.


పత్రాలతో చికిత్సలు...

ఆయుర్వేదంలో బిల్వపత్రాలును అనేక వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. ఆకులను ఎండించి దంచిన పొడిని భద్రపరచుకుంటే, రోజూ టీలాగా కాచుకుని తాగవచ్చు. పేగుల్లో వచ్చే అన్ని వ్యాధుల్లో ఇది ఉపయోగపడుతుంది. కడుపులో నొప్పి, వేడి, అసిడిటీలను తగ్గిస్తుంది. పాలు పొయ్యకుండా నీళ్లలో వేసి కాచిన కషాయం మాత్రమే తాగాలి. అమీబియాసిస్‌ వ్యాధితో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. ఈ ఆకుపొడిని తడిపి, నుడుటిపైన పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది. తలలో వేడి లాగేస్తుంది. కళ్లు ఎర్రబడటం, కండ్ల కలక తగ్గుతాయి.

పేగులకు రక్షణ కవచం...

మారేడు ఆకులు, కాయలు, పండుకు సంగ్రాహి అనే గుణం ఉంది. పేగులలోని నీటిని పీల్చుకునే స్వభావం ఇది. అందువలన విరేచనాలు, అతిసారం, అమీబియాసిస్‌ వ్యాధుల్లో బాగా పనిచేస్తుంది. కలరా నివారకం. ఇరిటబుల్‌ బవుల్‌ సిండ్రోమ్‌ లాంటి వ్యాధుల్లో పేగులు అతిగా స్పందించటాన్ని ఇవి ఆపుతాయి.

గంగరాజు అరుణాదేవి

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 05 , 2026 | 11:59 PM