Uttar Pradesh: పాము కాటుకు గురైన వ్యక్తి చేసింది తెలిస్తే షాక్ అవుతారు..
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:58 PM
పాము అంటే ఎలాంటి వారికైనా వెన్నుల్లో వణుకుపుడుతుంది. నేరుగా పామును చూస్తే కొద్ది సేపు షాక్ కి గురికావడమే కాదు.. నోటి వెంట మాట కూడా బంద్ అవుతుంది. అలాంటిది ఒక వ్యక్తి పామును తన చలి కోటులో పెట్టుకొని రావడమే కాదు.. జనాలకు చూపించి హడలిపోయేలా చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాము ఒక విషపూరితమైన జీవి.. దాని పేరు వింటేనే ఎవరైనా గజగజ వణికిపోతారు. అలాంటిది ఒక వ్యక్తి పామును తన చలి కోటులో దాచుకొని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి హల్ చల్ చేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీపక్ (39) అనే ఈ-రిక్షా డ్రైవర్ సోమవారం పాము కాటుకు గురై, యాంటీ-వెనమ్ ఇంజక్షన్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ చికిత్స ఆలస్యం కావడంతో సహనం నశించింది. తనని పాము కరిచిందని ఆస్పత్రి సిబ్బందికి చెప్పగా.. ఏ పాము కరిచిందో గుర్తుందా? అని అడిగారు.
ఇదిగో ఈ పాము కరిచిందంటూ తన చలి కోటులో దాచి ఉంచిన 1.5 అడుగుల పామును బయటకు తీసి అందరికీ చూపిస్తూ అటూ ఇటూ తిప్పాడు. అంతే.. అక్కడ ఉన్న స్టాఫ్, చుట్టుపక్కల జనాలు భయంతో పరుగులు తీశారు. ఆస్పత్రి స్టాఫ్ వెంటనే ఆ పామును దూరంగా వదిలేసి రావాలని చెప్పారు. కానీ, దీపక్ మాత్రం తన చలి కోటులోనే దాచుకున్నాడు. దీంతో ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ అధికారులను చూసి దీపక్ తన బాధ చెప్పుకున్నాడు.
‘అర్ధగంట సేపటి నుంచి నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, నేను చచ్చినా ఎవరికీ పరవాలేదా?’ అని ప్రశ్నించాడు. వెంటనే ట్రీట్‌మెంట్ చేస్తాం.. ముందు ఆ పామును దూరంగా వదిలి రావాలని సూచించినట్లు చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. విషపూరితమైన జీవులను ఇలా వెంట పెట్టుకొని తిరగడం ప్రాణాలకు ప్రమాదమని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..