Share News

Toofan Express: తుపాను లాంటి భారతీయ రైలు.. అయినా తెరమరుగు.. ఈ చరిత్ర తెలిస్తే..

ABN , Publish Date - Jan 14 , 2026 | 08:20 PM

ఒకప్పుడు అత్యంత వేగవంతమైనదిగా పేరు సంపాదించుకున్న ఓ భారతీయ రైలు ఆ తరువాత నత్తనడక రైలుగా అపప్రథ మూటగట్టుకుంది. చివరకు రైలు సర్వీసు కూడా నిలిచిపోయిది. మరి ఈ రైలు చరిత్ర ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Toofan Express: తుపాను లాంటి భారతీయ రైలు.. అయినా తెరమరుగు.. ఈ చరిత్ర తెలిస్తే..
Toofan Express

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో రైళ్ల చరిత్ర ఎంతో సుదీర్ఘమైనది. ముఖ్యంగా కొన్ని రైలు సర్వీసులు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందాయి. జనాలను అబ్బురపరిచాయి. అలాంటి ఓ ట్రైన్‌ తన వేగంతో యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రజలు ఈ రైలుకు తుపాన్ అని కూడా పేరు పెట్టుకున్నారు. చివరకు రైల్వే శాఖ కూడా ఇదే పేరును కొనసాగించింది. కానీ 2020 నుంచి ఈ రైలు సర్వీసు నిలిచిపోయింది. మరి ఈ రైలు చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందాం పదండి (Udyan Abha Toofan Express History)

ఉద్యాన్ అభా తుపాన్ ఎక్స్‌ప్రెస్.. 1930 జూన్ 1న ఈ రైలును ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ మధ్య ఈ రైలు ప్రవేశపెట్టారు. మొత్తం 1978 కిలోమీటర్ల జర్నీ. హౌరా నుంచి బయలుదేరి, తిరిగి రావడానికి దాదాపు 4 నాలుగు రోజులు పట్టేది. అప్పట్లో ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది. ఆ కాలంలో ఇంతటి వేగం అంటే మాటలు కాదు. దీంతో, జనాలు ఈ రైలును తుపాను అని పిలుచుకునే వారు. కాలక్రమంలో ఇదే పేరు స్థిరపడింది. మొదట్లో ఈ రైలు ఎక్కువ స్టేషన్‌లలో ఆగేది కాదు. దీంతో, గరిష్ఠ వేగంతో ప్రయాణించగలిగేది. కాలం గడిచే కొద్దీ స్టాపులు పెరిగాయి. వేగం తగ్గింది.


2020 నాటికి ఈ రైలు దాదాపు 110 స్టేషన్‌లల్లో ఆగాల్సి వచ్చేది. ఫలితంగా రైలు సగటు వేగం గంటకు 44 కిలోమీటర్లకు పడిపోయింది. అత్యంత నెమ్మదైన రైలుగా పేరు మూటగట్టుకుంది. ఇక 2020 నాటి కొవిడ్ సంక్షోభ కాలంలో పలు రైలు సర్వీసులు నిలిచిపోయాయి. వీటిల్లో ఈ రైలు కూడా ఉంది. సంక్షోభం సమసిపోయిన తరువాత రైళ్ల సేవలను పునరుద్ధరించినా ‘తుపాను’ మాత్రం మళ్లీ కనిపించలేదు. 2020 మే 19న తూర్పు రైల్వే డివిజన్ ఈ రైలు సర్వీసును నిలిపివేసింది. ఆ తరువాత 2022లో నూతన రైలు షెడ్యూల్ విడుదలైనా ఈ రైలుకు మాత్రం చోటు దక్కలేదు. దీంతో, ‘తుపాను’ నిలిచిపోయాయని ప్రజలు నిర్ధారించుకున్నారు.

గతేడాది కొందరు ప్యాసెంజర్లు, పార్లమెంటు సభ్యులు ఈ రైలు సర్వీసును పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను లేవనెత్తారు. ఈ విషయాన్ని ఎంపీలు పార్లమెంటులో కూడా ప్రస్తావించారు. కానీ రైల్వే శాఖ మాత్రం ఈ విషయంలో ఎలాంటి విస్పష్ట ప్రకటనా చేయలేదు.


ఇవీ చదవండి:

హనుమాన్ విగ్రహం చుట్టూ శునకం ప్రదక్షిణలు! 36 గంటల పాటు..

నర్సు దారుణం.. ఆసుపత్రికి బాయ్‌ఫ్రెండ్‌ను పిలిపించుకుని..

Updated Date - Jan 14 , 2026 | 08:38 PM