Peacock Throne History: మొఘలుల వైభవానికి చిహ్నం నెమలి సింహాసనం! దీని చరిత్ర తెలిస్తే..
ABN , Publish Date - Jan 12 , 2026 | 08:25 PM
మొఘల్ సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా నిలిచిన నెమలి సింహాసనం గొప్పతనం ఏంటో, అది భారత్ నుంచి ఎలా తరలిపోయిందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: మొఘల్ సామ్రాజ్య వైభవానికి చిహ్నం నెమలి సింహాసనం. మొఘల్ సామ్రాజ్య పతనానికి కూడా ఇదే సింహాసనం చిహ్నంగా నిలవడం విధి వైచిత్రి అని చరిత్రకారులు వ్యాఖ్యానిస్తుంటారు. యావత్ ప్రపంచాన్ని అబ్బుర పరిచిన ఈ సింహాసనం చరిత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం (Nadir Shan Invasion - Peacock Throne).
మొఘల్ చక్రవర్తి షాహ్ జహాన్ ఆదేశాలతో 1628లో ఈ సింహాసనాన్ని తయారు చేసేందుకు స్వర్ణకారులు రంగంలోకి దిగారు. ఏడేళ్లు శ్రమించి దీన్ని రూపొందించారు. ఇందుకోసం రూ.కోటి రూపాయలు ఖర్చయ్యాయని ఓ అంచనా. తాజ్‌మహల్‌ను నిర్మించేందుకు పెట్టిన ఖర్చు కంటే ఇది రెట్టింపు అని చరిత్రకారులు చెబుతారు. 1,150 కేజీల బంగారంతో, 230 కేజీల వివిధ రకాల మణులు, రత్నాలు పొదిగి ఈ సింహాసనాన్ని తయారు చేశారు. కోహినూర్ వజ్రం, టైముర్ రూబీని కూడా ఈ సింహాసనంలో పొదిగారు. ఢిల్లీలోని ఎర్రకోటలో మొఘల్ సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా ఈ సింహాసనం చాలా కాలం పాటు విలసిల్లింది.
నాదిర్ షా దండయాత్ర
ఇరాన్ పాలకుడు, అఫ్షరీద్ రాజవంశ వ్యవస్థాపకుడు నాదిర్ షా 1739లో మొఘల్ సామ్రాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. మొఘల్ సైన్యాన్ని ఓడించి ఢిల్లీని దోచుకున్నాడు. ఇదే మొఘల్ సామ్రాజ్య పతనానికి నాంది పలికింది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన నాదిర్ షా అంచలంచెలుగా ఎదుగుతూ ఒట్టోమన్‌లను కూడా ఓడించి తన పాలనను సుస్థిర పరుచుకున్నాడు. అనంతరం 1739లో భారత్‌పై దండయాత్ర చేశాడు. అప్పటి మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షాను కర్నాల్ యుద్ధంలో ఓడించి మొఘల్ సామ్రాజ్య రాజధాని ఢిల్లీని దోచుకున్నాడు. అప్పట్లో దాదాపు 70 కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకెళ్లాడని చరిత్రకారులు చెబుతారు. నాదిర్ షా దోచుకెళ్లిన సంపదలో నెమలి సింహాసనంతో పాటు ప్రపంచప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రాన్ని కూడా ఉంది.
మణులు, మాణిక్యాలతో మెరిసిపోయే నెమలి సింహాసనాన్ని నాదిర్ షా.. ఏనుగులు, ఒంటెల మీద పెట్టి ఇరాన్‌కు తరలించాడు. ఇక 1747లో నాదిర్ షాను ప్రత్యర్థులు అంతం చేశారు. ఆ తరువాత నెమలి సింహాసనాన్ని కరిగించి బంగారం, మణులు, మాణిక్యాలను ఇతరులు దోచుకెళ్లారని కొందరు చరిత్రకారులు చెబుతారు. నాదిర్ షా తరువాత ఇరాన్‌లో పాలన సాగించిన ఇతర రాజవంశాల పాలకులు నెమలి సింహాసనాన్ని పోలిన సింహాసాలను తయారు చేయించుకున్నారని కూడా అంటారు.
ఇవీ చదవండి:
మహీంద్రా థార్ కారు నడుపుతూ సంచలన కామెంట్.. నెట్టింట వెల్లువెత్తుతున్న ఆగ్రహం
ప్రధాని మోదీకి టీచర్ లేఖ! ఆయన రిప్లై చూశాక..