Parathas Trigger Fire Alarm: యూకేలో ఎన్నారై యువతికి షాక్! పరాఠాలపై మనసు పోవడంతో..
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:19 PM
యూకేలో పరాఠాలు వండి ‘చేతులు కాల్చుకున్న’ ఓ యువతి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. విదేశాల్లో భారతీయులకు ఈ ఉదంతం ఓ హెచ్చరిక లాంటిదని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో ఉండే ఎన్నారైలకు అప్పుడప్పుడూ భారతీయ వంటకాలపై మనసు పోతుంది. ఇది సహజమే! యూకేలో ఉంటున్న ఓ యువతికి కూడా సరిగ్గా ఇలాగే అనిపించింది. దీంతో, తనే స్వయంగా నచ్చిన వంటకాన్ని చేసుకుని తిందామని ఆమె రంగంలోకి దిగారు. కానీ ఇంతలోనే పరిస్థితి ఊహించని మలుపు తిరగడంతో ఆమెకు దిమ్మతిరిగినంత పనైంది. ఆ అనుభవానికి షాక్ తిన్న యువతి.. ఇప్పట్లో భారతీయ వంటకాలు వండేదే లేదని కూడా తీర్మానించుకున్నారు. అసలేం జరిగిందో వివరంగా చెబుతూ ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Parathas Trigger Fire Alarm In UK Viral Video).
తనకు ఇటీవల పరాఠాలపై మనసు పోవడంతో స్వయంగా వండుకునేందుకు సిద్ధమైనట్టు ఆమె చెప్పారు. అయితే, పరాఠాలు పెనంపై కాలుస్తున్న సమయంలో ఎక్కువగా పొగ రావడంతో ఇంట్లోని ఫైర్ యాక్సిడెంట్ అలారమ్ మోగింది. సమీపంలోని అగ్నిమాపక కేంద్రం కూడా అలర్ట్ అయ్యింది. దీంతో, వారు సైరెన్ మోగించుకుంటూ యువతి ఇంటి వద్దకు వచ్చేశారు. చివరకు వారే ఇంట్లోని అలారమ్‌ను ఆపారు. చూస్తుండగానే పరిస్థితి ఇలా ఊహించని మలుపు తిరగడంతో యువతికి దిమ్మ తిరిగినంత పనైంది.
రాత్రి వేళ.. అదీ భీకరంగా చలిగాలులు, మంచు కురుస్తున్న సమయంలో ఇలా అనవసర రాద్ధాంతం జరగడంతో తనకు పరువు పోయినట్టు అనిపించిందని ఆమె చెప్పారు. బ్రిటన్‌లో చాలా కాలంగా ఉంటున్నా ఇలా ఎన్నడూ ఫీల్ కాలేదని వాపోయారు. ఇంత రచ్చ జరిగినప్పటికీ కాస్త రుచికరమైన పరాఠా తిన్నందుకు చివర్లో కొంత ఊరట దక్కిందని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పట్లో భారతీయ వంటకాలను ఇంట్లో వండనని కూడా తీర్మానించుకున్నట్టు ఆమె తెలిపారు.
ఇక ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఎన్నారైలు ఆమెకు మద్దతుగా నిలిచారు. తామూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని అన్నారు. అక్కడి ఫైర్ సెన్సార్లు చిన్నపాటి పొగకు కూడా స్పందిస్తాయి కాబట్టి ఇలాంటివి జరుగుతాయని అన్నారు. పొగను పసిగట్టే సెన్సార్లను కవర్ చేసుకున్నాక భారతీయ వంటకాలు వండవచ్చని కొందరు సూచించారు. విదేశాల్లో ఉంటున్న వారికి ఇదో హెచ్చరిక అని కొందరు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!
ఇవీ చదవండి:
సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్.. అద్దె రూ.8 లక్షలైనా ఒకే అంటున్న మహిళ
లగ్జరీ హోటల్‌లో షాకింగ్ ఘటన.. దంపతులు బాత్రూమ్‌లో ఉండగా..