Sheep in German Supermarket: గొర్రెల మంద ‘దాడి’.. సూపర్ మార్కెట్‌లోకి ఒక్కసారిగా 50 గొర్రెలు..
ABN , Publish Date - Jan 09 , 2026 | 08:11 PM
జర్మనీలో సుమారు 50 గొర్రెలు సూపర్ మార్కెట్‌లోకి చొచ్చుకెళ్లిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓ కస్టమర్‌ను అనుసరిస్తూ అవి సూపర్ మార్కెట్‌లోకి చొచ్చుకెళ్లాయని గొర్రెల కాపరి తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 గొర్రెలు ఒక్కసారిగా మీవైపు దూసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. జర్మనీలోని ఓ సూపర్ మార్కెట్ సిబ్బంది సరిగ్గా ఇలాంటి సీన్‌నే చూశారు. ఒక్కసారిగా గొర్రెల మంద షాపులోకి దూసుకురావడంతో ఏం చేయాలో అర్థంకాక అలా చూస్తుండిపోయారు. దాదాపు 20 నిమిషాల పాటు సూపర్ మార్కెట్‌లో కలియతిరిగిన గొర్రెలను అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచాయి. అక్కడి ర్యాక్‌లను పడదోశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (Sheep In German Super Market).
బవేరియా ప్రావిన్స్‌లోని పెన్నీ అనే సూపర్ మార్కెట్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 50 గొర్రెలు, మంద నుంచి తప్పించుకుని సమీపంలోని సూపర్ మార్కెట్‌లోకి చొచ్చుకెళ్లాయని గొర్రెల కాపరి తెలిపారు. చేతిలో బ్యాగు పట్టుకుని సూపర్ మార్కెట్‌లోకి ఓ కస్టమర్ వెళ్లడాన్ని చూసిన గొర్రెలు బ్యాగులో ఆహారం ఉండి ఉంటుందని భావించాయని అతడు చెప్పాడు. ఆ తరువాత కస్టమర్ వెనకాలే అవి సూపర్ మార్కెట్‌లోకి వెళ్లిపోయాయని వివరించాడు. అక్కడే దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయిన గొర్రెలు.. సిబ్బంది అదిలించినా బయటకు వెళ్లలేదట.
ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ జనాలను ఎంటర్‌టైన్ చేస్తోంది. గొర్రెల దాడి భలే ఉందని పలువురు సరదా కామెంట్స్ చేశారు. అక్కడికి వచ్చే ద్విపాద కస్టమర్ల కంటే గొర్రెలే మర్యాదగా నడుచుకున్నాయని మరో వ్యక్తి కామెంట్ చేశారు. వాటిని బయటకు తోలాక సూపర్ మార్కెట్‌ను శుభ్రపరిచేందుకు సిబ్బందికి నడుములు పడిపోయి ఉంటాయని మరొకరు కామెంట్ చేశారు. ఈ ఘటనపై సూపర్ మార్కెట్ ప్రతినిధి స్పందించారు. గొర్రెల్ని తోలేశాక షాపును బాగా శుభ్రపరిచామని చెప్పారు. గొర్రెల వల్ల తమకు అద్భుతమైన ప్రచారం లభించిందని, కాబట్టి వాటికి ఈ ఏడాదంతా ఉచితంగా మేతను సరఫరా చేస్తామని కూడా పేర్కొన్నారు. మరి నెట్టింట జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి
సీసీటీవీలో షాకింగ్ దృశ్యం! వృద్ధురాలు లిఫ్ట్‌లో ఉండగా..
రెస్టారెంట్‌లో దారుణం.. రోటీపై ఉమ్మేసి.. వైరల్ వీడియో