Medical Code Violation: నర్సు దారుణం.. ఆసుపత్రికి బాయ్‌ఫ్రెండ్‌ను పిలిపించుకుని..
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:24 PM
చైనాలో ఓ నర్సు తన బాయ్‌ఫ్రెండ్‌ను ఆసుపత్రికి పిలిపించుకుని తన విధుల్లో కొన్ని అతడితో చేయించిన వైనం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఘటనపై సీరియస్ అయిన వైద్య శాఖ అధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వైద్య వృత్తి ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పొరపాట్లు కూడా భారీ అనర్థాలకు దారి తీసే అవకాశం ఎక్కువ. ఇంతటి కీలక వృత్తిలో ఉన్న ఓ నర్సు తన బాధ్యత మరిచి ఆసుపత్రిలో అరాచకానికి తెరలేపింది. ఆమె చేసిన పని ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది (Nurse Medical Code Violation).
చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ నర్సు చేయకూడని పని చేసింది. రాత్రి షిఫ్టుల్లో పని చేసేటప్పుడు తన బాయ్‌ఫ్రెండ్‌ను ఆసుపత్రికి రప్పించి అతడితో ఆసుపత్రిలో పనులు చేయించేది. రోగుల వ్యక్తిగత గోప్యతను ఏమాత్రం పట్టించుకోకుండా బాయ్‌ఫ్రెండ్‌తో వారి రిపోర్టులను రాయించేది. మెడికల్ కార్యకలాపాల్లో కూడా అతడి సాయం తీసుకునేది. ఇది చాలదన్నట్టు తన బాయ్‌ఫ్రెండ్‌తో పనులు చేయించుకుంటున్న వైనాన్ని కూడా నెట్టింట షేర్ చేసింది.
తన బాయ్‌ఫ్రెండ్ ఎంతో మంచివాడని, ఉద్యోగ విధుల్లో చేదోడువాదోడుగా ఉంటాడని ఏవేవో చెప్పుకొచ్చింది. ఆమె షేర్ చేసిన వీడియోల్లో బాయ్‌ఫ్రెండ్ నర్సింగ్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించాడు. కంప్యూటర్‌లో రోగుల డేటాను ఎంటర్ చేయడం వంటివి చేశాడు. రోగులకు మందులను కూడా సిద్ధం చేశాడు. సాలైన్ బాటిల్స్‌పై మందుల పేర్లు రాయడం వంటివి చేశాడు. సుశిక్షితులైన సిబ్బంది మాత్రమే చేయాల్సిన పనులను అతడు చేయడాన్ని వీడియోలో చూసిన జనాలు విమర్శలకు దిగారు.
ఈ విషయం వెలుగులోకి వచ్చాక ఆసుపత్రి యాజమాన్యం కూడా స్పందించింది. ఇది వాస్తవమేనని చెప్పింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పింది. అప్పటికే ఆ నర్సుపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. ఈ విషయాన్ని స్థానిక మున్సిపల్ హెల్త్ కమిషన్ ధ్రువీకరించింది. అయితే, ఆ నర్సు పేరు వివరాలను మాత్రం బహిరంగపరచలేదు.
ఇవీ చదవండి:
హనుమాన్ విగ్రహం చుట్టూ శునకం ప్రదక్షిణలు! 36 గంటల పాటు..
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన యువకుడు! ట్రాన్స్‌జెండర్ చేసిన పనికి..