Share News

Akasa Air Sweet Gesture: విమానంలో ప్రయాణికుడి గాఢ నిద్ర.. సిబ్బంది ఊహించని సర్‌ప్రైజ్

ABN , Publish Date - Jan 12 , 2026 | 09:07 PM

మీల్స్ సర్వ్ చేసే సమయంలో నిద్రలోకి జారుకున్న ఓ ప్రయాణికుడితో ఆకాశ ఎయిర్ సిబ్బంది వ్యవహరించిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి అనేక మంది సంస్థపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Akasa Air Sweet Gesture: విమానంలో ప్రయాణికుడి గాఢ నిద్ర.. సిబ్బంది ఊహించని సర్‌ప్రైజ్
Akasa Air Sweet Gesture Goes Viral

ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణికుల ఫిర్యాదులు ఈ మధ్యకాలంలో తెగ అధికం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్ సంస్థ సిబ్బంది ఒక ప్యాసెంజర్‌ విషయంలో సహృదయతతో సున్నితంగా వ్యవహరించిన తీరు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సంస్థ తీరును చూసి ఆశ్చర్యపోయిన ఆ ప్యాసెంజర్ స్వయంగా ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి అనుభవాన్ని తానెప్పుడూ చూడలేదని కూడా కామెంట్ చేశారు (Akasa Air Sweet Gesture Goes Viral).

కుష్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ పోస్టును పెట్టారు. ఇటీవల తాను ఆకాశ ఎయిర్‌ విమానంలో ప్రయాణించినట్టు చెప్పారు. బిజీ షెడ్యూల్ కారణంగా బాగా అలసిపోయిన తాను ఆ రోజు విమానంలో గాఢ నిద్రలోకి జారుకున్నట్టు చెప్పారు. విమానంలో మీల్స్ అందించే సమయంలోనూ తాను నిద్రలోనే ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలో విమాన సిబ్బంది తన నిద్రకు ఏ మాత్రం భంగం కలిగించకుండా వ్యవహరించారని అన్నారు. మెళకువ వచ్చాక తనకు కనిపించేలా ఓ చిట్టీని ముందు సీటుకు తగిలించి వెళ్లారని చెప్పారు. ‘మేము మీల్స్ సర్వ్ చేసినప్పుడు మీరు నిద్రలో ఉన్నారు.. కాబట్టి.. మీరు లేచాక మాకు కబురు చేస్తే మీల్స్ ఇస్తాము’ అని చిట్టీ మీద రాసుందని చెప్పారు. తన నిద్రకు భంగం కలగకుండా వారు జాగ్రత్త పడ్డ తీరు ఆశ్చర్యం కలిగించిందని వివరించారు. ఆకాశ ఎయిర్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు.


ఈ పోస్టుపై ఆకాశ ఎయిర్ కూడా స్పందించింది. సిబ్బంది శ్రమను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపింది. ప్రయాణికులకు వారి జర్నీ ఓ మధురస్మృతిగా మిగిలిపోయేందుకు తాము నిరంతరం శ్రమిస్తామని పోస్టు పెట్టింది. ఇక నెటిజన్లు కూడా ఆకాశ్ ఎయిర్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. సంస్థ నిర్వహణ అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో కూడా ఇలాంటి ఆతిథ్యం ఈ మధ్యకాలంలో కానరాకుండా పోయిందని కామెంట్ చేశారు.


ఇవీ చదవండి:

మొఘలుల వైభవానికి చిహ్నం నెమలి సింహాసనం! దీని చరిత్ర తెలిస్తే..

మహీంద్రా థార్ కారు నడుపుతూ సంచలన కామెంట్.. వెల్లువెత్తుతున్న ఆగ్రహం

Updated Date - Jan 12 , 2026 | 09:48 PM