Share News

Sky Turns Pink: గులాబీ రంగులో ఆకాశం.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండరు!

ABN , Publish Date - Jan 10 , 2026 | 09:52 PM

హిమపాతం కారణంగా ఆకాశం గులాబీ రంగులోకి మారిన అద్భుత దృశ్యం బ్రిటన్‌లో తాజాగా ఆవిష్కృతమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Sky Turns Pink: గులాబీ రంగులో ఆకాశం.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండరు!
Birmingham Pink Sky

ఇంటర్నెట్ డెస్క్: అరోరా బోరియాలిస్ లేదా ఉత్తర వెలుగులు గురించి అందరికీ తెలిసిందే. ఉత్తర ధ్రువం వద్ద ఆకాశంలో కనిపించే ఈ వెలుగులు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అయితే, దానితో సరితూగే మరో అద్భుత దృశ్యం తాజాగా బ్రిటన్‌లో కనిపించింది. అక్కడి ఆకాశం అకస్మాత్తుగా గులాబీ రంగులోకి మారడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఫొటోలను తీసి నెట్టింట పంచుకున్నారు. బర్మింగ్‌హమ్‌లో ఈ అద్భుత దృశ్యం కనిపించింది (Sky Turns Pink In Birmingham).

ఇటీవలి గొరెట్టి తుఫాను బ్రిటన్‌ను వణికించింది. ప్రస్తుతం అది ఉత్తర వైపునకు తరలిపోయినా అనేక చోట్ల ఇంకా మంచుకురుస్తోంది. ఈ ఏడాది బ్రిటన్‌ను తాకిన తొలి తుపాను ఇదే. ఇది బర్మింగ్‌హమ్‌లో ఓ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. అక్కడి సెయింట్ ఆండ్రూ స్టేడియంలో గులాబీ రంగు ఎల్‌ఈడీ లైట్‌లను ఏర్పాటు చేశారు. గాల్లోని మంచు కారణంగా ఈ వెలుతురు ఆకాశమంతా పరుచుకుని గులాబీ రంగులో మారినట్టు కనిపించింది. మంచు, మేఘాలు గులాబీ కాంతిని భూమి వైపు పంపించే అద్దాల్లాగా పనిచేశాయని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఇక, గొరెట్టి తుఫాను కారణంగా సెంట్రల్ ఇంగ్లాండ్‌లో మంచు తెగ కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చివరకు వేల మంది కొన్ని గంటల పాటు చీకట్లో మగ్గాల్సి వచ్చింది. ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.


ఇక ఉత్తర ధ్రువపు ఆకాశంలో కనిపించే వింత కాంతులను అరోరా బోరియాలిస్ లేదా ఉత్తర వెలుగులు అని పిలుస్తారు. సూర్యుడి నుంచి విడుదలయ్యే విద్యుదావేశ కణాలు ఉత్తర ధ్రువంలోని ఆకాశంలో వాయువులతో ఢీకొని తమ శక్తిని కాంతి రూపంలో విడుదల చేశాయి. ఈ వెలుతురులు ఆకాశంలో తెరలు తెరలుగా కదులుతూ అద్భుత అనుభూతిని ఇస్తాయి. గాల్లోని ఆక్సిజన్ కారణంగా ఆకుపచ్చ, ఎరుపు, నైట్రోజన్ కారణంగా నీలి రంగు, వంకాయ రంగు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

మహీంద్రా కారు కింద ఇటుకలు పెట్టి.. టైర్ల చోరీ

యూకేలో ఎన్నారై యువతికి షాక్! పరాఠాలపై మనసు పోవడంతో..

Updated Date - Jan 10 , 2026 | 10:05 PM