Dubai Viral Video: రూ.24.6 లక్షల బ్యాగును రోడ్డుపై వదిలెళ్లిపోయిన మహిళ! చివరకు..
ABN , Publish Date - Dec 14 , 2025 | 10:26 PM
దుబాయ్‌లో రోడ్డుపై ఖరీదైన బ్యాగును వదిలిపెట్టి వెళ్లిపోయిన ఓ మహిళ తిరిగొచ్చి చూశాక ఆశ్చర్యపోయారు. దుబాయ్‌లో భద్రత ఎంత అద్భుతమో చెప్పేందుకు ఆమె చేసిన ఈ ప్రయోగం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: వివిధ దేశాల్లో పర్యటించే వారు ప్రస్తుతం తమ అనుభవాలను సోషల్ మీడియా లేదా యూట్యూబ్‌లో పంచుకోవడం సాధారణమైపోయింది. ఈ క్రమంలో పర్యాటకులు ఆయా దేశాల్లో భద్రతా వ్యవస్థ, పౌర స్పృహ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు రకరకాల ప్రయోగాలు చేసి జనాలకు వివరిస్తుంటారు. తాజాగా దుబాయ్‌లో పర్యటించిన ఓ మహిళ సరిగ్గా ఇలాంటి ప్రయోగమే చేసి చూపించారు. ఆమె చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Dubai Luxury Bag Viral Video).
అలీషా హమీరానీ అనే మహిళ ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఆమె తన బర్కిన్ బ్యాగ్‌ను (సుమారు రూ.24.6 లక్షలు) గోల్డ్ సోక్ ప్రాంతంలో వదిలిపెట్టారు. తాను బోటులో బుర్ దుబాయ్‌కు వెళ్లి వస్తానని చెప్పారు. ఆ తరువాత కూడా అక్కడే బ్యాగు ఉంటే దుబాయ్ రేంజ్ ఏంటో జనాలకు అర్థం అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేశారు. తాను గతంలో కూడా ఇలాంటి ప్రయోగం చేస్తే తన భర్తకు షాక్ తగిలిందని సరదా కామెంట్స్ చేశారు. మళ్లీ తనను నమ్మి బహుమతి కొనిచ్చేందుకు భర్తకు ఏడాది సమయం పట్టిందని చెప్పారు.
ఇక బుర్ దుబాయ్‌కు వెళ్లి తిరిగొచ్చిన ఆమె తన బ్యాగ్ అక్కడే ఉండటం చూసేసరికి ఆశ్చర్యపోయారు. దీన్ని బట్టి దుబాయ్ ఎంత భద్రమై నగరమో ఇట్టే అర్థమైపోతోందని చెప్పారు. అయితే, కొంత సందేహిస్తూనే ఇలా చేశానని, ఒకవేళ బ్యాగ్‌ను ఏవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే ఏం జరిగేదో తనకే తెలియదని అన్నారు.
ఇక ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. దుబాయ్ నిజంగానే భద్రమైన ప్రాంతమని అనేక మంది కితాబునిచ్చారు. ఇలాంటివి ఇంకెక్కడా ట్రై చేయొద్దని మరికొందరు సూచించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
దుబాయ్‌లో కఠిన చట్టాలు, పటిష్ఠ పోలీసుల నిఘా, ప్రజాభద్రతపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటి కారణాల రీత్యా దుబాయ్‌లో నేరాలు తక్కువగా జరుగుతాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
తరచూ బాత్రూమ్‌కు వెళ్లే ఉద్యోగికి ఊస్టింగ్! కోర్టులో కేసు వేస్తే..
మహిళకు నిర్వచనం అదే.. మస్క్ పోస్టు మరోసారి వివాదాస్పదం