China Employee Fired: తరచూ బాత్రూమ్‌కు వెళ్లే ఉద్యోగికి ఊస్టింగ్! కోర్టులో కేసు వేస్తే..
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:51 PM
పైల్స్ కారణంగా తరచూ బాత్రూమ్‌కు వెళ్లే ఓ ఉద్యోగి తన జాబ్ పోగొట్టుకున్నాడు. సంస్థ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో ఊరట దక్కింది. సంస్థ నుంచి కొంత పరిహారం అందింది.
ఇంటర్నెట్ డెస్క్: పైల్స్‌తో సతమతం అవుతూ తరచూ బాత్రూమ్‌కు వెళ్లే ఉద్యోగి చివరకు ఉద్యోగం పోగొట్టుకున్న ఘటన చైనాలో (China) వెలుగు చూసింది. నిత్యం గంటల కొద్దీ బాత్రూమ్‌లో గడుపుతున్నందుకు ఉద్యోగిని కంపెనీ తొలగించింది. అయితే, కోర్టు జోక్యంతో ఇరు వర్గాల మధ్యా రాజీకుదిరింది. సంస్థ చివరకు మాజీ ఉద్యోగికి కొంత పరిహారాన్ని కూడా చెల్లించింది (Frequent Bathroom breaks Lead to Job Loss).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, జింయాగ్సూ ప్రావిన్స్‌కు చెందిన లీ ఓ సంస్థలో ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. 2010లో చేరిన అతడు ఆ తరువాత 2014లో పదోన్నతి కూడా పొందాడు. అయితే, అతడికి హెమరాయిడ్స్ (పైల్స్) ఉండటంతో తరచూ బాత్రూమ్‌కు వెళ్లి వచ్చేవాడు. గతేడాది ఏప్రిల్, మే నెలల్లో 14 సార్లు ఇలా బాత్రూమ్‌కు వెళ్లి వచ్చాడు. ప్రతిసారీ గంటకు పైగానే బ్రేక్ తీసుకునేవాడు. ఒకానొక సందర్భంలో ఏకంగా నాలుగు గంటల పాటు బాత్రూమ్‌లోనే ఉండిపోయాడు. ఈ విషయాలపై దృష్టి సారించిన కంపెనీ అతడిని విధుల నుంచి తొలగించింది. అతడి తీరు వల్ల పనికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పింది. అతడికి హెమరాయిడ్స్ ఉన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
ఈ క్రమంలో లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఆసుపత్రి రికార్డులను కోర్టు ముందుంచాడు. తనకు సర్జరీ కూడా జరిగిందని అన్నాడు. తనను అన్యాయంగా తొలగించారని వాదించే ప్రయత్నం చేశాడు. మరోవైపు, సదరు సంస్థ కోర్టుకు తమ కార్యాలయంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని అందించింది. లీ బాత్రూమ్‌లో గంటలకు గంటలు ఉండిపోవడంతో పనికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పింది.
కార్మిక యూనియన్లకు సమాచారం అందించాకే లీని తొలగించినట్టు స్పష్టం చేసింది. లీతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం, ఉద్యోగి వల్ల కంపెనీ కార్యకలాపాలకు నెల వ్యవధిలో రెండు రోజులకు మించి ఆటంకాలు ఏర్పడితే తొలగించే హక్కు తమకు ఉందని పేర్కొంది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు చివరకు ఇద్దరి మధ్య రాజీకుదిర్చింది. ఈ నేపథ్యంలో సంస్థ లీకి 45 వేల డాలర్ల పరిహారం చెల్లించింది.
ఇవీ చదవండి:
మహిళకు నిర్వచనం అదే.. మస్క్ పోస్టు మరోసారి వివాదాస్పదం
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..