Spain Woman Fired: జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..
ABN , Publish Date - Dec 11 , 2025 | 07:33 PM
టైమ్ కంటే ముందే ఆఫీసుకు వచ్చిన ఓ యువతి చివరకు ఉద్యోగం పోగొట్టుకున్న ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. యువతికి చివరకు కోర్టులో కూడా చుక్కెదురే అయ్యింది. ఆమెను తొలగించడంలో తప్పులేదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఇంటర్నెట్ బెస్క్: ఆమె డ్యూటీ ఉదయం 7.30 గంటలకు మొదలవుతుంది. కానీ ఉదయం 6.45 గంటలకే ఆఫీసుకొచ్చి కూర్చునేది. ఇలా పలు మార్లు చేసినందుకు మేనేజ్‌మెంట్‌కు తిక్కరేగి యువతిని తీసేసింది. ఆమె కోర్టుకెక్కినా ఫలితం లేకపోయింది. సంస్థ నిర్ణయాన్ని కోర్టు కూడా సమర్థించడంతో యువతి మిన్నకుండిపోవాల్సి వచ్చింది. స్పెయిన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆ యువతి వయసు కేవలం 22 ఏళ్లు. జాబ్‌పై మక్కువతోనో అత్యుత్సాహమో తెలియదు కానీ తరచూ ఆఫీసుకు పనివేళల కంటే ముందే వచ్చేది. అలా దాదాపు ఏడాది పాటు ఆమె వ్యవహారం సాగింది. మేనేజ్‌మెంట్ తరచూ ఆమెను హెచ్చరిస్తూనే ఉంది. టైమ్‌కు మాత్రం వస్తే సరిపోతుందని పలుమార్లు చెప్పి చూసింది. అంతముందుగా వస్తే చేయాల్సిన పనులేవీ ఉండవని వివరించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె మాత్రం సంస్థ ఆదేశాలు ఖాతరు చేయలేదు. దీంతో, కంపెనీ ఆమెను తొలగించింది.
ఈ దెబ్బకు షాక్ తిన్న యువతి న్యాయపోరాటాన్ని ఎంచుకుంది. కోర్టులో కేసు వేసింది. కానీ అక్కడా ఆమె వాదనలు నిలవలేదు. పలుమార్లు హెచ్చరించినా యువతి వినలేదన్న సంస్థ వాదనతో కోర్టు ఏకీభవించింది. పలుమార్లు టైమ్ కంటే ముందే ఆమె సంస్థ యాప్‌లో లాగిన్ అయ్యేందుకు కూడా ప్రయత్నించినట్టు కంపెనీ మేనేజ్‌మెంట్ కోర్టుకు తెలిపింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు యువతి తొలగింపు సబబేనని తీర్పు వెలువరించింది. ఆమె త్వరగా ఆఫీసుకు వచ్చినందుకు ఉద్యోగంలోంచి తొలగించలేదని కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఆఫీసు నిబంధనలను పాటించనందుకే ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. సంస్థ యాజమాన్యం ఆదేశాలను బేఖాతరు చేయడం కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పును యువతి పైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
ఈ మహిళ ఏ టూత్ పేస్టు వాడుతోందో గానీ.. వైరల్ వీడియో.. షాకింగ్ సీన్స్
గూగుల్ ట్రెండ్స్‌లో ‘777’ హల్‌చల్.. అసలు స్టోరీ ఏంటంటే..