Google Trends 777: గూగుల్ ట్రెండ్స్‌లో ‘777’ హల్‌చల్.. అసలు స్టోరీ ఏంటంటే..
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:03 PM
ప్రస్తుతం గూగుల్‌లో 777 సంఖ్య ట్రెండింగ్‌లో ఉంది. మరి ఈ సంఖ్య ప్రత్యేకత ఏమిటో అకస్మాత్తుగా ఎందుకు నెటిజన్ల ఆసక్తి దీనిపై పెరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్నది ఏదో తెలిపే ఫీచర్ గూగుల్ ట్రెండ్స్. నిత్యం ఏదోక అంశం జనాలను ఆకర్షిస్తూ ట్రెండింగ్ లిస్టులో టాప్‌లోకి చేరుకుంటుంది. ప్రస్తుతం 777 సంఖ్య కూడా జనాలను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ నెంబర్‌పై గూగుల్‌లో జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా విమానయాన ప్రయాణికుల ఆసక్తి కారణంగా ఈ నెంబర్ టాప్‌లోకి దూసుకెళ్లింది (Google Trends 777).
777 నెంబర్ వెనుక స్టోరీ ఇదీ
విమాన ప్రయాణాల్లో ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ తరగతుల్లో జర్నీలు ఎంత అద్భుతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టిక్కెట్ల ధరలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ సెలబ్రిటీలు లెక్క చేయరు. దీంతో, అనేక విమానయాన సంస్థలు ఈ విలాసవంతమైన జర్నీలను ప్రముఖులకు అందిస్తున్నాయి. డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటంతో సంస్థలు ఈ సర్వీసులను మరింత విస్తరిస్తుంటాయి కూడా. ఇక ఎయిర్ ఫ్రాన్స్ కూడా లా ప్రీమియర్ పేరిట లగ్జరీ విమాన సర్వీసులను అందిస్తోంది. స్వర్గాన్ని తలపించే వసతులు ఉన్న బోయింగ్ 777-300ఈఆర్ విమానాల్లో ఈ ప్రీమియం సర్వీసును అందిస్తోంది. సుదూర ప్రయాణాల్లో ఇది అందుబాటులో ఉంది (Air France La Première service).
అయితే, ప్రయాణికుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సంస్థ తాజాగా లగ్జరీ సేవలను మరింత విస్తరించింది. అట్లాంటా, బోస్టన్, హ్యూస్టన్, టెల్ అవీవ్ వంటి చోట్లకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. దీంతో, సహజంగానే విమానయాన ప్యాసెంజర్లలో ఆసక్తి రెట్టింపైంది. బోయింగ్ 777 విమానంలోని తాజా ఫీచర్లు ఏంటో తెలుసుకునేందుకు జనాలు ఉత్సుకత ప్రదర్శిస్తుండటంతో ఈ సంఖ్య ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఏవియేషన్ రంగ నిపుణుల ప్రకారం, ఎయిర్ ఫ్రాన్స్ తన ప్రీమియం సర్వీసులను ఈమారు 40 శాతం మేర పెంచేందుకు సిద్ధమైంది. దీన్నిబట్టి, ఈ సర్వీసుకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జులై 20లోపు అట్లాంటా( అమెరికా) నుంచి ఇజ్రాయెల్ వరకూ ఒక్కో గమ్యస్థానానికీ ఎయిర్ ఫ్రాన్స్ ప్రీమియం సేవలు క్రమంగా ప్రారంభం కానున్నాయి.
ఇవీ చదవండి:
నాకూ ఇంటికి వెళ్లాలని ఉంది.. ఇండిగో పైలట్ వీడియో నెట్టింట వైరల్
చైనా అభివృద్ధి చూసి అమెరికన్‌కు షాక్.. టెక్నాలజీ మరీ ఈ రేంజ్‌లోనా..