IndiGo Pilot Video: నాకూ ఇంటికి వెళ్లాలని ఉంది.. ఇండిగో పైలట్ వీడియో నెట్టింట వైరల్
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:39 PM
ఫ్లైట్‌ల రద్దుతో ఇబ్బంది పడుతున్న ఇండిగో ప్రయాణికులకు సంస్థ పైలట్ ఒకరు క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రయాణికుల సమస్యలను తాము అర్థం చేసుకున్నామని, అయితే, గ్రౌండ్ స్టాఫ్‌తో కాస్త స్నేహపూర్వకంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన షేర్ చేసిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో ప్రయాణికులకు కష్టాలు ఇంకా తొలగిపోలేదు. సోమవారం కూడా ఫ్లైట్‌ల రద్దు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇండిగో పైలట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నాకూ ఇంటికి వెళ్లాలని ఉందంటూ ఆ పైలట్ పెట్టిన వీడియోను జనాలు ట్రెండింగ్‌లోకి తెచ్చారు (IndiGo Pilot Viral video).
ప్రదీప్ కృష్ణన్ అనే పైలట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రయాణికులకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, ఇండిగోకు చెందిన గ్రౌండ్ స్టాఫ్‌తో కాస్త శాంతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి కూడా చేశాడు (IndiGo disruptions).
‘ఐ యామ్ సారీ.. ఫ్లైట్ రద్దు కారణంగా ఏదైనా ముఖ్యమైన చోటుకు వెళ్లలేకపోతే ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. పైలట్‌లుగా మేము చేయగలిగినంతా చేస్తున్నాము. మాకూ ఇంటికి వెళ్లాలని ఉంటుంది’ అని ఆయన పోస్టు పెట్టారు.
‘గత కొన్ని రోజులుగా ఎంతో కలకలం రేగింది. ఈ పరిస్థితుల్లో చిక్కుకున్న వారిని చూస్తుంటే నా హృదయం ద్రవిస్తోంది. కోయంబత్తూర్‌కు వెళ్లాల్సిన మా విమానం కూడా ఆలస్యమయ్యింది. ఫ్లైట్‌ల రద్దు, ఆలస్యాలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది వీడియోలను నేనూ చూస్తున్నాను. అయితే, ప్రస్తుతం ఇక్కడున్న (విమానంలో) ప్యాసెంజర్లు ఎంతో సహనంతో ఉన్నారు. వారికి నా కృతజ్ఞతలు. వారు మాకు మద్దతుగా నిలిచారు’ అని పైలట్ అన్నారు. ఎయిర్‌పోర్టుల్లోని ఇండిగో సిబ్బంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. వారితో కాస్త సఖ్యతగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనేక మంది పైలట్ అభిప్రాయంతో ఏకీభవించారు.
ఇక సోమవారం కూడా పలు విమానాశ్రయాల్లో ఇండిగో ఫ్లైట్‌లు రద్దయ్యాయి. బెంగళూరు ఎయిర్‌పోర్టులో 65 అరైవల్స్, 62 డిపార్చర్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీలోనూ 134 విమానాలు, చెన్నైలో 77 విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇవీ చదవండి:
చైనా అభివృద్ధి చూసి అమెరికన్‌కు షాక్.. టెక్నాలజీ మరీ ఈ రేంజ్‌లోనా..
డిగ్రీ పట్టా లేకున్నా మా సంస్థలో జాబ్ ఇస్తాం.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఆఫర్