China Tech Prowess: చైనా అభివృద్ధి చూసి అమెరికన్‌కు షాక్.. టెక్నాలజీ మరీ ఈ రేంజ్‌లోనా..
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:43 PM
చైనా ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ ఓ అమెరికన్ పెట్టిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దేశాభివృద్ధి కోసం నిధులు వెచ్చిస్తే ఫలితం ఇంత అద్భుతంగా ఉంటుందని పలువురు కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థికంగా, సాంకేతికంగా చైనా దూసుకుపోతోంది. అమెరికా, ఐరోపా దేశాలకు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో చైనాలో ఇటీవల పర్యటించిన ఓ అమెరికన్ అక్కడి అభివృద్ధిని, సాంకేతికతను చూసి షాకయిపోయాడు. అక్కడి విశేషాలను చెబుతూ అతడు పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (China Tech Prowess).
చైనాలో పార్కింగ్ నిబంధనలు ఎంత పక్కాగా ఉంటాయో చెబుతూ అతడు తన వీడియోను మొదలెట్టాడు. కారును పార్కింగ్ స్థలంలో నిలిపేందుకు అక్కడే రోడ్డుపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌తో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. కారు నిలిపి ఉంచే స్థలంలో నేలలోపల ఓ స్పీడు బ్రేకర్ ఉంటుందని వివరించారు. కారును పరిమితికి మించి ఎక్కువ సేపు నిలిపితే ఆ స్పీడు బ్రేకర్ పైకి తెరుచుకుని కారును ముందుకు కదలకుండా చేస్తుందని అన్నాడు. మళ్లీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాకే స్పీడ్ బ్రేకర్ క్లోజ్ అయ్యి కారును బయటకు తీయగలుగుతామని చెప్పాడు. చైనాలో స్కూటర్‌ల పార్కింగ్ కూడా ఉచితమని అన్నాడు.
రోడ్డు మీద దాదాపుగా అన్నీ విద్యుత్ వాహనాలే ఉండటంతో అసలు ట్రాఫిక్ చప్పుళ్లే ఉండవని అతడు తెలిపాడు. చాలా అరుదుగా మాత్రమే చైనాలో పెట్రోల్ బంక్‌లు కనిపిస్తున్నాయని అన్నాడు. తాను చైనాకు మూడు సార్లు వచ్చానని, కానీ ఇప్పటివరకూ కేవలం రెండు పెట్రోల్ బంకులు మాత్రమే కనిపించాయని చెప్పాడు.
చైనాలో దాదాపుగా అన్నీ డిజిటల్ చెల్లింపులేనని చెప్పాడు. నగదు వినియోగం బాగా తగ్గిపోయిందని అన్నాడు. దేశంలో ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్స్ కనిపిస్తాయని చెప్పాడు. సాంకేతికత బాగా అభివృద్ధి చెందడంతో చైనాలో దైనందిన జీవితం చాలా సులువైపోయిందని వివరించాడు. డిజిటల్ చెల్లింపుల విషయంలో అమెరికా సహా పాశ్చాత్య దేశాలు అన్నీ చైనా కంటే చాలా వెనుకబడి ఉన్నాయని అన్నారు. ఇక ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. దేశాభివృద్ధి కోసం నిధులను సక్రమంగా వినియోగిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు.
ఇవీ చదవండి:
డిగ్రీ పట్టా లేకున్నా మా సంస్థలో జాబ్ ఇస్తాం.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఆఫర్
పెళ్లిలో వధూవరుల కుటుంబాల పరస్పర దాడులు! రసగుల్లాలు తక్కువయ్యాయని..