Bihar Wedding Clash: పెళ్లిలో వధూవరుల కుటుంబాల పరస్పర దాడులు! రసగుల్లాలు తక్కువయ్యాయని..
ABN , Publish Date - Dec 05 , 2025 | 08:03 AM
బిహార్‌లో వధూవరుల కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం చివరకు పెళ్లే క్యాన్సిల్ అయ్యేలా చేసింది. విందులో రసగుల్లాలు తక్కువైనందుకు ఇరు వర్గాలు ఇష్టారీతిన పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి వేడుకల్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు సహజం. అయితే, వీటిని ఆదిలోనే నియంత్రించకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. బిహార్‌లో సరిగ్గా ఇదే జరిగింది. వధూవరుల కుటుంబాల మధ్య మొదలైన ఓ వివాదం చివరకు కుర్చీలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. చివరకు పెళ్లే రద్దయిపోయింది. పెళ్లిలో ఇరు కుటుంబాలు ఇష్టారీతిన పరస్పరం దాడి చేసుకున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి (Bihar Wedding Clash).
బోధ్ గయలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో వధూవరుల కుటుంబాలు వివాహ వేడుకను ఏర్పాటు చేశాయి. అయితే, భోజనంలో రసగుల్లాలు తక్కువయ్యాయంటూ వధువు కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో, మొదలైన వివాదం చూస్తుండగానే ఊహించని మలుపు తిరిగింది. వధూవరులు మండపం వైపు వెళుతున్న సమయంలోనే ఈ గొడవ జరిగింది. ఇరు వర్గాలు ఇష్టారీతిన పరస్పరం దాడులు చేసుకున్నాయి. అక్కడి వారు ఒకరిపై మరొకరు ప్లేట్లు, కుర్చీలను విసురుకున్నారు. ఒకరినొకరు తోసుకున్నారు. ముష్టిఘాతాలు కురిపించారు. చివరకు వధువు కుటుంబం పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయింది.
ఇంత గొడవ జరిగినప్పటికీ తాము పెళ్లికి సిద్ధంగానే ఉన్నామని వరుడి తండ్రి మహేంద్ర తెలిపారు. కానీ వధువు కుటుంబం మాత్రం తెగదెంపులు చేసుకుని వెళ్లిపోయిందని ఆరోపించారు. వరకట్నం ఆరోపణలతో తమపై తప్పుడు కేసు పెట్టారని వరుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి కోసం బహుమతిగా తెచ్చిన నగలను కూడా వధువు కుటుంబం తీసుకెళ్లిపోయిందని ఆరోపించారు ఇక ఈ వీడియోను జనాలు తెగ వైరల్ చేస్తూ కామెంట్‌ల వరద పారించారు. పెళ్లంటే జోక్‌గా మారిందని కొందరు విచారం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
రూ.7 కోట్ల సంపద ఉన్న యువకుడి వింత నిర్ణయం.. నెట్టింట వైరల్
నెదర్‌ల్యాండ్స్‌లో పరిస్థితిపై భారతీయుడి వీడియో.. నెట్టింట భారీ చర్చ