Share News

Amsterdam Civic Sense: నెదర్‌ల్యాండ్స్‌లో పరిస్థితిపై భారతీయుడి వీడియో.. నెట్టింట భారీ చర్చ

ABN , Publish Date - Nov 30 , 2025 | 10:19 PM

ఆమ్‌స్టర్‌డ్యామ్ నగర వీధుల్లో చెత్తాచెదారం ఉన్నా జనాలు మాత్రం కేవలం భారతీయులకే పౌర స్పృహ లేనట్టు మాట్లాడుతుంటారంటూ ఓ వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలతో పోలిక ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

Amsterdam Civic Sense: నెదర్‌ల్యాండ్స్‌లో పరిస్థితిపై భారతీయుడి వీడియో.. నెట్టింట భారీ చర్చ
Amsterdam streets garbage

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోని వీధులు చెత్తాచెదారంతో ఉండటంపై నిత్యం నెట్టింట ఏదోక వీడియో వైరల్ అవుతుంటుంది. భారతీయలకు బాధ్యత లేకపోవడమే ఈ దుస్థితికి కారణమనేది నిత్యం వినిపించేమాట. విదేశాల్లోని వారిని పౌర స్పృహ గురించి నేర్చుకోవాలని కూడా కొందరు సలహాలు ఇస్తుంటారు. అయితే, విదేశాల్లోని రోడ్లు కూడా ఇలాగే చెత్తాచెదారంతో ఉంటాయని అంటూ ఓ భారతీయుడు నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది (Amsterdam Central Streets Viral Video).

రాహుల్ మహాజన్ అనే వ్యక్తి ఆమ్‌స్టర్‌డ్యామ్ నగర వీధుల్లోని పరిస్థితిని చూపిస్తూ ఓ వీడియో షేర్ చేశారు. అక్కడి వీధుల్లో కూడా చెత్తాచెదారం ఉండటంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఇది ఆమ్‌స్టర్‌డ్యా్మ్‌ సెంట్రల్‌ ప్రాంతంలోని ఓ వీధి. ఇక్కడ చూడండి.. వీధంతా ఎలా చెత్తా చెదారంతో నిండిపోయిందో! కానీ, జనాలు మాత్రం భారతీయులకు పౌర స్పృహ లేదని నిందిస్తుంటారు’ అని కామెంట్ చేశారు (Civic Sense).


ఈ వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆమ్‌స్టర్‌డ్యామ్‌ వీధుల్లో చెత్తచెదారం ఉందని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం విదేశీయులతో పోలిక ఎందుకని ప్రశ్నించారు. ‘ఏదో చిన్న సమస్య చూపించి నిందిస్తే ఎలా? అక్కడ బాలేదని అనిపిస్తే ఇండియాకు తిరిగొచ్చేయ్’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘వాళ్ల వీధులు అపరిశుభ్రంగా ఉన్నాయని మనమూ అలాగే ఉంటామా?’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. కేవలం ఆమ్‌స్టర్‌డ్యామ్ సెంట్రల్ ప్రాంతం మాత్రమే చూపించి నగరం మొత్తం అలాగే ఉంటుందన్నట్టు పోస్టు పెడితే ఎలా అని మరొక వ్యక్తి ప్రశ్నించారు.

జీవన నాణ్యత సూచిలో ఆమ్‌స్టర్‌డ్యామ్ నగరం గతేడాది ప్రపంచంలో 6వ గొప్ప నగరంగా నిలిచింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 8 ర్యాంకుల మేర ఎగబాకింది.


ఇవీ చదవండి:

కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని.. ఆటో డ్రైవర్‌గా.. తాను ఎవరికీ బానిసను కానంటూ..

వామ్మో.. ఇంజనీరింగ్ జాబ్ మానేసిన మహిళ.. త్వరలో డాక్టర్‌గా కొత్త జర్నీ

Read Latest and Viral News

Updated Date - Dec 01 , 2025 | 11:23 AM