Life lesson: కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని.. ఆటో డ్రైవర్‌గా.. తాను ఎవరికీ బానిసను కానంటూ..
ABN , Publish Date - Nov 28 , 2025 | 03:48 PM
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని ఆటో డ్రైవర్‌గా మారిన ఓ వ్యక్తి చెప్పిన జీవితపాఠం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు జనాలు జై కొడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ఎదురీదడమే మనిషి కర్తవ్యం. ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టిన ఓ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కార్పొరేట్ కంపెనీలో జాబ్‌ను వదులుకుని చివరకు ఆటో డ్రైవర్‌గా మారిన ఈ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది (Corporate Job to becoming Autodriver - Lifelesson).
బెంగళూరులో కార్పొరేట్ సంస్థల్లో ఉన్నతోద్యోగం చేసిన ఆ వ్యక్తి చివరకు ఆటో డ్రైవర్‌గా మారాడు. ఈ విషయమై ఓ వీడియో చేసి నెట్టింట పంచుకున్నాడు. కార్పొరేట్ ప్రపంచంలో ఉండగా ఒకానొక దశలో తనకు జీవితంలో ముందుకు సాగడం కష్టమనిపించే స్థితి వచ్చిందని తెలిపాడు. కానీ జీవితాన్ని అలా చేజారిపోనీయకుండా కొనసాగించేందుకు నిర్ణయించినట్టు చెప్పాడు. భారీ సంస్థలో చేస్తున్న డెస్క్ జాబ్ వదులుకుని ఆటో డ్రైవర్‌గా జీవితంలో మరో ప్రయాణాన్ని మొదలెట్టానని అన్నాడు. తనలాగా లైఫ్‌లో పాతాళానికి చేరుకున్న వారి కోసమే ఈ వీడియో చేసినట్టు తెలిపాడు (Bengaluru Viral Video).
‘జీవితంలో మళ్లీ మొదటికి చేరుకున్న స్థితిలో ఆటో డ్రైవ్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. లైఫ్ ఇలా మళ్లీ మొదటికి వచ్చినందుకు నాకు ఎలాంటి భయం లేదు. ఒక దశలో నేను జీవితంపై ఆశలన్నీ వదులుకున్నాను. మళ్లీ కోలుకోలేనని అనుకున్నాను. కానీ లైఫ్‌లో ఓడిపోదలుచుకోలేదు. లైఫ్‌లో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాను. భయపడదలుచుకోలేదు. ధైర్యంగా ముందడుగు వేస్తే లైఫ్‌లో అన్నీ అవే కుదురుకుంటాయి. జస్ట్ జీవితాన్ని కొనసాగిస్తే చాలు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. డబ్బు అవసరమే కానీ అదే అతి ముఖ్యమైన అంశం కాదు. మీ జీవితానికి అర్థం ఏంటో తెలుసుకోండి. జీవితాన్ని చూసి భయపడొద్దు, తప్పించుకోవద్దు’ అంటూ వీడియోను ముగించాడు. ‘నేను ఆటో డ్రైవర్‌ను.. ఎవరికీ బానిసను కాదు’ అన్న క్యాప్షన్‌ను కూడా జత చేశాడు. అతడి లైఫ్‌లో ఎదురైన క్లిష్ట పరిస్థితి ఏమిటో వివరించనప్పటికీ ఈ వీడియోపై జనాలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు.
ఇవీ చదవండి:
వామ్మో.. ఇంజనీరింగ్ జాబ్ మానేసిన మహిళ.. త్వరలో డాక్టర్‌గా కొత్త జర్నీ
15 ఏళ్లుగా అలుపెరుగని ప్రయత్నం.. ఒక్క రాత్రిలో లైఫ్ ఛేంజ్