DDF Millennium Millionaire: 15 ఏళ్లుగా అలుపెరుగని ప్రయత్నం.. ఒక్క రాత్రిలో లైఫ్ ఛేంజ్
ABN , Publish Date - Nov 27 , 2025 | 08:26 AM
ఓర్పుతో ఉంటే ఎంతటి అదృష్టాన్నైనా సొంతం చేసుకోవచ్చని ఓ చెన్నై వాసి నిరూపించారు. దాదాపు 15 ఏళ్లుగా లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన తాజాగా డీడీఎఫ్ లాటరీలో దాదాపు రూ.9 కోట్లు సొంతం చేసుకున్నారు. ఈ లాటరీలో మరో ఇద్దరు భారతీయులకు కూడా లక్ కలిసొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పదిహేనేళ్లుగా లాటరీ కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తికి చివరకు అదృష్టం కలిసొచ్చింది. లాటరీలో దాదాపు రూ.9 కోట్లు దక్కాయి. చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సెల్వరాజ్ విజయానంత్ ఇటీవలి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో రూ.8,92,15,900 గెలుచుకున్నారు. 1346 నెంబర్ ఉన్న టిక్కెట్ కొనుగోలు చేసిన ఆయనపై కనకవర్షం కురిసింది (DDF Millennium Millionaire Draw Winners).
దాదాపు 15 ఏళ్లుగా సెల్వరాజ్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఎప్పటికైనా లాటరీ గెలవాలన్న పట్టుదలతో క్రమం తప్పకుండా ప్రయత్నించారు. ఆయన ఓపికకు అదృష్టం తలవంచింది. ‘లాటరీలో గెలవాలనేది నా కల. ఎట్టకేలకు అది నెరవేరింది. ఇందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను’ అని విజయానంత్ వ్యాఖ్యానించారు. డీడీఎఫ్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. భారతీయులు అనేక మంది డీడీఎఫ్ లాటరీలో పాల్గొంటూ ఉంటారు. దీంతో ఒక మిలియన్ డాలర్ల మేర గెలుచుకున్న 266 వ్యక్తిగా విజయానంత్ నిలిచారు.
ఇదిలా ఉంటే, దుబాయ్‌లో ఉంటున్న మరో భారతీయుడు అతుల్ దినకర్ రావు కూడా మిలీనియమ్ మిలియనీర్ సిరీస్‌లో రూ.8 కోట్లు గెలుపొందారు. 2242 టిక్కెట్ నెంబర్‌తో ఆయనకు ఈ అదృష్టం కలిసొచ్చింది. డీడీఎఫ్ అధికారుల చేతుల మీదుగా ఆయన లాటరీ చెక్కును అందుక్కున్నారు. ‘ఇంత మొత్తాన్ని గెలుచుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. లాటరీ నిర్వాహకులకు ధన్యవాదాలు. డీడీఎఫ్‌పై నాకు ఎంతో నమ్మకం. ఈ గెలుపు తరువాత విశ్వాసం మరింత పెరిగింది’ అని అన్నారు.
ఇక రస్ అల్ ఖైమాలో నివసించే జయదేవన్.. ఫైనెస్ట్ సర్‌ప్రైజ్ కేటగిరీలో బీఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్‌ఆర్ బైక్‌ను గెలుచుకున్నారు. 0629 టిక్కెట్ నెంబర్‌తో ఆయనను ఈ అదృష్టం వరించింది. ఓ సిగరెట్ తయారీ కంపెనీలో దేవన్ స్టోర్ కీపర్‌గా పని చేస్తున్నారు. లాటరీలో గెలవడాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్
గూగుల్ నానో బనానా ప్రో సామర్థ్యం చూస్తే మతిపోవాల్సిందే..