Share News

Aakriti Goel: వామ్మో.. ఇంజనీరింగ్ జాబ్ మానేసిన మహిళ.. త్వరలో డాక్టర్‌గా కొత్త జర్నీ

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:11 PM

ఇంజనీర్‌గా విజయవంతమైన కెరీర్‌ సొంతం చేసుకున్న ఓ మహిళ ఆ తరువాత వైద్య వృత్తివైపు మళ్లారు. ఈ ఆసక్తికర జర్నీ వెనుక విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Aakriti Goel: వామ్మో.. ఇంజనీరింగ్ జాబ్ మానేసిన మహిళ.. త్వరలో డాక్టర్‌గా కొత్త జర్నీ
Aakriti Goel

ఇంటర్నెట్ డెస్క్: ఎవరైనా డాక్టర్ అవ్వాలని అనుకుంటారు.. లేదా ఇంజనీర్‌గా రాణించాలని భావిస్తారు. కానీ ఇంజనీర్‌గా సక్సెస్ ఫుల్ కెరీర్‌‌ను సొంతం చేసుకున్నాక డాక్టర్ వృత్తి వైపు మళ్లడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. తెలివితేటలతో పాటు కొండంత ధైర్యం కూడా ఉండాలి. అయితే, ఓ మహిళ సరిగ్గా ఇలాగే తన జీవితాన్ని ఎవ్వరూ ఊహించలేని మలుపు తిప్పుకున్నారు! ఇలా కొత్త మార్గంలో పయనిస్తున్న ఆమె పేరు ఆకృతి గోయల్. వచ్చే ఏడాది ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేయనున్నారు. మరి ఆమె స్టోరీ ఏమిటో? ఇంజనీరింగ్‌ను వదిలిపెట్టి వైద్యవృత్తి వైపు మళ్లడానికి కారణమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Aakriti Goel Engineer Becomes Doctor).

ఆకృతి ఇంజనీరింగ్ చదివారు. 2015లో టెకీగా వృత్తి జీవితంలో కాలు పెట్టారు. కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్నారు. తీవ్రమైన పోటీ ఉండే కార్పొరేట్ ప్రపంచంలో కళ్లు చెదిరే జీతంతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. పలు ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. అయితే, జాబ్‌లో ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడింది. పైపెచ్చు, అధిక శాలరీ, కెరీర్‌లో విజయాలేవీ కూడా ఆమె కోరుకున్న మానసిక సంతృప్తిని ఇవ్వలేదు. ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో ‘ఇక చాలు’ అని మనసు పోరుపెట్టింది. అదే ఆమెకు మేలుకొలుపుగా మారింది.

2020లో ఆమె ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కొత్త మార్గం అన్వేషణలో భాగంగా తన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశారు. శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడేందుకు కొంతకాలం పూర్తిగా రెస్టు తీసుకున్నారు. ఈ క్రమంలో తన మనసు నిజంగా కోరుకుంటున్నదేంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తదుపరి ఏం చేయాలనే అంశంపై లోతుగా ఆలోచించారు. యోగా ఇన్‌స్ట్రక్టర్, లాయర్, హెచ్ఆర్ కన్సల్టెంట్ లాంటి వృత్తులు చేపడదామా? అని ఆలోచించారు. అవేవీ తనకు తగినవి కావని చివరగా నిర్ధారణకు వచ్చారు.

ఓ రోజు కెరీర్ కౌన్సెలింగ్‌కు హాజరైన సమయంలో ఆమె మనసులో ఓ వింత ఆలోచన! డాక్టర్ అయితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మదిలో మెదలగానే ఆమెకు భళ్లున నవ్వొచ్చింది. వాస్తవానికి డాక్టర్ అవ్వాలనేది ఆమె చిన్ననాటి కల. పలు కారణాలతో ఆ విషయాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. దాదాపు 30 ఏళ్ల వయసులో డాక్టర్ అవ్వడం సాధ్యమేనా అనే సందేహం కూడా కలిగింది. ఈ విషయంపై నెట్టింట సెర్చ్ చేయగా సుప్రీం కోర్టు తీర్పు ఒకటి ఆమె కంటపడింది. మెడికల్ ఎంట్రన్స్ టెస్టు రాసేందుకు గరిష్ఠ వయోపరిమితి లేదనేది దాని సారాంశం. దీంతో ఆమె మనసులోని కొన్ని సందేహాలు తొలగిపోయాయి. మరో ప్రయాణం ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టైంది.


సంశయిస్తూనే ఆకృతి ముందడుగు వేశారు. ఆన్‌లైన్‌లో బయాలజీ సబ్జెక్టు కోచింగ్ క్లాసులకు హాజరయ్యారు. పాఠాలు ఒంటబడుతున్నట్టే అని అనిపించడంతో ఆమె మొదట్లో ఒకింత ఆశ్చర్యపోయారు. ఏదో పాత హాబీని మళ్లీ ప్రారంభిస్తున్నట్టు అనిపించింది. చదివే కొద్దీ ఉత్సాహం పెరిగింది. కానీ మనసులో అనుమానం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. అసలు తనలో నిజాయితీ ఎంత ఉందో తెలుసుకునేందుకు ఆమె తనకు తానే పరీక్ష పెట్టుకున్నారు. రోజుకు 10 గంటల చొప్పున 13 రోజుల పాటు ఏకధాటిగా మనసు పెట్టి చదవగలిగితే.. తనలో డాక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉన్నట్టే అని భావించారు. ఆశ్చర్యకరంగా ఆమె అన్ని రోజులూ పట్టుబట్టి చదవగలిగారు. అనుకున్నట్టుగా చదువుపై మనసు లగ్నం కావడంతో ఆమె సందేహాలన్నీ తొలగిపోయాయి. తన నిర్ణయం సబబేనన్న నమ్మకం కుదిరింది.

మనసులో విశ్వాసం స్థిరపడటంతో ఆమె కోచింగ్‌కు హాజరవడం ప్రారంభించారు. దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ క్లాస్‌రూమ్‌లో కాలుపెట్టారు. మొదట్లో తడబాటు తప్పలేదు. క్లాసులో ఉపాధ్యాయులు చెప్పేది అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించేది. అయితే, ఉద్యోగ జీవితం ఇచ్చిన అనుభవం వెన్నుదన్నుగా ముందడుగు వేశారు. చిన్న చిన్న సందేహాలను కూడా మొహమాట పడకుండా అడిగి నివృత్తి చేసుకున్నారు. ఆమె పరిచయస్తులకు ఇదంతా వింతగా తోచింది. ఇది వృథా ప్రయాస అని విమర్శించారు. ఆమెను వెనక్కులాగే ప్రయత్నం చేశారు. కుటుంబసభ్యుల్లో కూడా సందేహాలు ఉన్నా ఆమెకు అండగా నిలిచారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో, నిరుత్సాహాన్ని పక్కనపెట్టి ఆమె చదువులో నిమగ్నమయ్యారు. ఏడాది పాటు కఠోర శ్రమతో పరీక్షకు సన్నద్ధమయ్యారు. దాదాపు 100 మాక్ టెస్టులు రాశారు. చివరకు యూజీ నీట్ పరీక్షకు హాజరయ్యారు.

అది పరీక్ష ఫలితాలు విడుదలైన రోజు. చేతులు వణుకుతుండగా ఆమె రిజల్ట్స్‌ను చెక్ చేసుకున్నారు. అంతే.. ఒక్కసారిగా పట్టలేనంత ఆనందం ఆకృతిని ముంచెత్తింది. ఆమెకు జాతీయ స్థాయిలో 1,118 ర్యాంకు వచ్చింది. ఇక డాక్టర్ కల సాకారమైనట్టే. ఈ విషయం కుటుంబసభ్యులకు చెప్పగానే వారు కూడా స్టన్ అయిపోయారు. సీన్ కట్ చేస్తే.. మరో ఏడాదిలో ఆమె ఎంబీబీఎస్ పూర్తవుతుంది. ఆమె నెక్స్ట్ టార్గెట్ ఎండీ చేయడమే!


ఇవీ చదవండి:

15 ఏళ్లుగా అలుపెరుగని ప్రయత్నం.. ఒక్క రాత్రిలో లైఫ్ ఛేంజ్

అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు.. హెచ్-1బీ వీసాదారుడి కామెంట్

Read Latest and Viral News

Updated Date - Nov 27 , 2025 | 12:55 PM