Sridhar Vembu: డిగ్రీ పట్టా లేకున్నా మా సంస్థలో జాబ్ ఇస్తాం.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఆఫర్
ABN , Publish Date - Dec 05 , 2025 | 08:37 AM
తమ సంస్థలో ఉద్యోగం కోరే వారికి డిగ్రీ పట్టాలు ఉండాల్సిన అవసరం లేదంటూ జోహో అధిపతి శ్రీధర్ వెంబు చేసిన ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంతో, టాలెంట్ ఉన్న యువత అందరికీ అవకాశాలు మెరుగవుతాయని జనాలు కామెంట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇది ఏఐ జమానా. ఒకప్పటి ఉద్యోగాల తీరుతెన్నులకు ప్రస్తుత పరిస్థితి చాలా భిన్నం. తార్కిక ఆలోచనా ధోరణి, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే చాకచక్యం ఉన్న వారే ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకోగలరు. ఫలితంగా సంస్థలు అనుసరించే నియామక విధానాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. కేవలం డిగ్రీ పట్టాల ఆధారంగానే కాకుండా అభ్యర్థుల సామర్థ్యాలను సమగ్రంగా విశ్లేషించి సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జోహో కార్పొరేషన్ సంస్థ అధినేత శ్రీధర్ వెంబు (Sridhar Vembu) సంచలన ఆఫర్ ఇచ్చారు. సరైన నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు డిగ్రీ పట్టా లేకపోయినా జాబ్‌లోకి తీసుకుంటామని అన్నారు (Zoho No Degrees Hiring Policy).
తమ సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే వారికి తప్పనిసరిగా డిగ్రీ ఉండాలన్న నిబంధనను పక్కన పెట్టామని శ్రీధర్ వెంబు తెలిపారు. ప్రస్తుతం అభ్యర్థుల నైపుణ్యాలనే పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు.
‘ప్రస్తుతం అమెరికాలో స్మార్ట్ విద్యార్థులు కాలేజీ చదువుల వైపు మొగ్గు చూపట్లేదు. ఇలాంటి వారికి అవకాశాలు ఇచ్చేందుకు అమెరికన్ సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ఇది విద్యాసంస్కృతిలో పెను మార్పులను తీసుకొస్తుంది. యువతకు తమ కాళ్లపై తాము నిలబడగలిగే అవకాశం ఇవ్వడమే అసలైన సాధికారత. చదువులతో వచ్చే అప్పుల భారం వారిపై ఉండకూడదు. దీంతో, ప్రపంచంపై వారి దృక్కోణం మారుతుంది. సమాజంలో భారీ మార్పులు వస్తాయి’ అని అన్నారు. ఈ అంశంపై భారతీయ తల్లిదండ్రులు, స్కూలు విద్యార్థులు, కంపెనీలు దృష్టిపెట్టాలని సూచించారు.
‘మా సంస్థలో జాబ్‌కు ఎలాంటి డిగ్రీలు అవసరం లేదు. ఒకవేళ మేనేజర్ ఎవరైనా అభ్యర్థులకు కాలేజీ డిగ్రీ ఉండాలని ప్రకటిస్తే దాన్ని తొలగించాలని హెచ్ఆర్ చెబుతుంది’ అని శ్రీధర్ వెంబు అన్నారు.
ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కంపెనీలు ఇలా చేస్తే చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లోని యువతకు కూడా అవకాశాలు లభిస్తాయని అన్నారు. భారతీయ కంపెనీల్లో ఇలాంటి ధోరణ కనిపిస్తే ప్రశంసనీయమేనని అన్నారు.
ఇవీ చదవండి:
పెళ్లిలో వధూవరుల కుటుంబాల పరస్పర దాడులు! రసగుల్లాలు తక్కువయ్యాయని..
రూ.7 కోట్ల సంపద ఉన్న యువకుడి వింత నిర్ణయం.. నెట్టింట వైరల్