Elon Musk: మహిళకు నిర్వచనం అదే.. మస్క్ పోస్టు మరోసారి వివాదాస్పదం
ABN , Publish Date - Dec 13 , 2025 | 09:46 PM
గర్భసంచీ ఉన్నవారే మహిళలు అంటూ ఎలాన్ మస్క్ తాజాగా పెట్టిన పోస్టు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కొందరు మస్క్‌కు మద్దతు పలకగా మరికొందరు విభేదించారు. మస్క్ నిర్వచనం జీవశాస్త్ర కోణంలో కూడా తప్పేనని కొందరు తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తాజాగా కొత్త కాంట్రవర్సీకి తెరతీశారు. తన దృష్టిలో మహిళలు అంటే ఎవరో చెబుతూ ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది. జీవశాస్త్రం ప్రకారమే మహిళను నిర్వచించాలని అన్నారు. ‘మీకు గర్భసంచీ ఉంటే మీరు మహిళలు లేకపోతే కాదు’ అంటూ తేల్చి చెప్పారు (Elon Musk on Definition Of Women).
ఈ పోస్టు పెట్టిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. భారీ చర్చకు దారి తీసింది. మస్క్ మద్దతుదారులు ఈ వాదనతో ఏకీభవించారు. స్త్రీపురుషుల నిర్వచనానికి శరీర నిర్మాణంలో తేడాలు, జీవశాస్త్రమే ప్రాతిపదిక కావాలని తేల్చి చెప్పారు.
మరికొందరు మాత్రం ఎలాన్ అభిప్రాయంతో తీవ్రంగా విభేదించారు. జీవశాస్త్రం ప్రకారం చూసినా ఈ నిర్వచనం తప్పని తేల్చి చెప్పారు. మేయర్-రోకిటాన్‌స్కీ-కుస్టర్ హౌసర్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో పుట్టే మహిళల్లో గర్భసంచీ ఉండకపోవడం, లేదా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడం జరుగుతుందన్న విషయాన్ని పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ కొడుకు గతంలో ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గతంలోనే స్పందించిన మస్క్ తన తనయుడు మానసిక రుగ్మత బారిన పడ్డాడని అన్నారు. తాజాగా గవర్నర్ న్యూసామ్ ట్రాన్స్ జెండర్ హక్కులపై మాట్లాడుతూ జనాలకు తమకు నచ్చినట్టు ఉండే హక్కు ఉందని అన్నారు. ట్రాన్స్‌జెండర్‌లకు అనుకూలమైన చట్టాలను తాను అనేకం చేశానని కూడా చెప్పారు. దీంతో, ఈ అంశాలపై మస్క్ మరోసారి స్పందిస్తూ స్త్రీపురుషులు ఎవరనేది జీవశాస్త్రం నిర్ణయించాలని, అభిప్రాయాలు, ఆలోచనలు కాదని తేల్చి చెప్పారు. అమెరికాలో ట్రంప్‌నకు మద్దతు ఇస్తున్న అనేక మంది సంప్రదాయ వాదులు ట్రాన్స్ జెండర్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..
ఈ మహిళ ఏ టూత్ పేస్టు వాడుతోందో గానీ.. వైరల్ వీడియో.. షాకింగ్ సీన్స్