Job Hunt in India: కెనడా నుంచి తిరిగొచ్చాక.. 600 జాబ్స్‌కు అప్లై చేస్తే..
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:43 PM
కెనడా నుంచి తిరిగొచ్చాక ఉద్యోగ వేటలో నానా ఇక్కట్ల పాలవుతున్న ఓ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. సదరు వ్యక్తి ఇబ్బందులను విన్న నెటిజన్లు తమకు తెలిసిన సలహాలు, సూచనలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ప్రస్తుత పరిస్థితుల్లో జాబ్ వెతకడం ఎంత కష్టమో చెప్పే ఉదంతాలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఎన్ని జాబ్స్‌కు అప్లై చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా చాలా మందికి రిక్తహస్తాలే మిగులుతున్నాయి. కెనడా నుంచి తిరిగొచ్చిన ఓ ఎన్నారై సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదంటూ రెడిట్‌లో ఆ వ్యక్తి పంచుకున్న ఉదంతం ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
తాను మార్కెటింగ్ ప్రొఫెషనల్ అని సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు. రెండు నెలల క్రితం భారత్‌కు తిరిగొచ్చానని అన్నారు. ‘భారత్‌లో మార్కెటింగ్ లేదా కమ్యూనికేషన్స్ జాబ్ సంపాదించడం ఇంత కష్టమని అస్సలు అనుకోలేదు. ఇప్పటివరకూ సుమారు 600 జాబ్స్‌కు అప్లై చేశా. కానీ 4 ఇంటర్వ్యూలకు మాత్రమే పిలుపులు వచ్చాయి. ఇక్కడ శాలరీలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నాకంటూ ఓ నెట్‌వర్క్ కూడా నిర్మించుకోవడం కూడా కష్టంగా మారింది. కెనడాలో ఉండి ఉంటే 100 జాబ్స్‌కు అప్లై చేశాక కనీసం 15 ఇంటర్వ్యలకు పిలుపు వచ్చేది. నేను చాలా పెద్ద సంస్థల్లో పని చేశా. భారత్‌లో జాబ్‌కు అప్లై చేయడం ఇదే తొలిసారి. ఇంత కష్టం ఉంటుందని అస్సలు అనుకోలేదు’ అని తన ఆవేదన నెట్టింట వెళ్లబోసుకున్నాడు. ఈ పరిస్థితి ఎలా బయటపడాలంటూ నెటిజన్లను ప్రశ్నించారు.

ఇక ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జనాలు రకరకాల సలహాలు ఇచ్చారు. ముందుగా సదరు నెటిజన్‌ను తన కెనడా మనస్తత్వాన్ని వదిలించుకోవాలని అన్నారు. లేకపోతే అదే ప్రతిబంధకంగా మారుతుందని చెప్పారు. ‘కెనడా చదువులు, కెనడా అనుభవాలు ఇక్కడ అస్సలు పనికిరావని అన్నారు. పాతవన్నీ మర్చిపోయి సానుకూల దృక్పథంతో మళ్లీ మొదలెడితే త్వరలోనే అన్నీ కుదురుకుంటాయని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు అంతగా బాగాలేవని, కానీ ఓర్పుతో ముందుకెళితే ఇక్కడి పరిస్థితులు అర్థమై మెల్లగా అన్నీ సెట్ అవుతాయని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
తెల్లవారుజామున ఊహించని సీన్! దుబాయ్‌లో భారతీయ మహిళకు ఆశ్చర్యం
రూ.24.6 లక్షల బ్యాగును రోడ్డుపై వదిలెళ్లిపోయిన మహిళ! చివరకు..