సముద్రం ఓ వైపు... పర్వతాలు మరోవైపు...
ABN , Publish Date - Mar 22 , 2026 | 01:17 PM
ప్రపంచంలోని అందమైన నగరాలలో సిడ్నీ (ఆస్ట్రేలియా) ఒకటి. అనేక సినిమాల్లో చూసిన ఈ నగర సందర్శన... కచ్చితంగా జీవితకాలపు జ్ఞాపకమే.
ప్రపంచంలోని అందమైన నగరాలలో సిడ్నీ (ఆస్ట్రేలియా) ఒకటి. అనేక సినిమాల్లో చూసిన ఈ నగర సందర్శన... కచ్చితంగా జీవితకాలపు జ్ఞాపకమే. సిడ్నీకి ఒక బ్రాండ్‌గా కనిపించే ఒపెరా హౌస్‌తో పాటు... బ్లూ మౌంటెన్స్, హార్బర్ బ్రిడ్జ్, సిడ్నీ టవర్ ఐ... చూసి తీరాల్సిందే. ఆ విశేషాలే ఇవి...
సిడ్నీ నగరాన్ని సందర్శించాలని మిత్రుడు వెంకటరెడ్డితో కలిసి ఇటీవల రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాను. హైదరాబాద్ నుంచి సింగపూర్, అక్కడి నుంచి మరుసటి రోజు సాయంత్రం 6.00 గంటలకు సిడ్నీ ‘కింగ్స్ ఫోర్డ్ స్మిత్ ఎయిర్‌పోర్ట్’లో దిగాం. ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినంగానే ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మీయుడు క్రాంతికుమార్ మాకు స్వాగతం పలికి, అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాడు.
ఆస్ట్రేలియాలో అతి పెద్ద నగరం సిడ్నీ. ఇది పసిఫిక్ మహాసముద్రంలో అంతర్భాగమైన టాస్మాన్ సముద్రం ఒడ్డున ఉంది. సిడ్నీ 1900 సంవత్సరం వరకు బ్రిటిష్ కాలనీకి, తరవాత ‘న్యూ సౌత్ వేల్స్’ రాష్ట్రానికి రాజధాని. నగర జనాభా 55 లక్షలు. సిడ్నీని హార్బర్ సిటీ, ఎమరాల్డ్ సిటీ అని కూడా పిలుస్తారు. స్థానికులు ఇంగ్లీషు, మాండరిన్, అరబిక్ భాషలు మాట్లాడుతారు. పర్యాటకుల సందడి ఎక్కువే కాబట్టి, అన్ని దేశాల ఫుడ్ అందించే రెస్టారెంట్లున్నాయి. ప్రధానంగా సీ ఫుడ్‌కు ప్రసిద్ధి.
మూడు శిఖరాలు... త్రీ సిస్టర్స్...
సముద్రపు ఒడ్డున అందమైన ఆకాశ హర్మ్యాలు, విశాలమైన రహదారులు, ఆకట్టుకునే వంతెనలు, పచ్చదనం, సుందరమైన బీచ్‌లు కలగలిసిన సిడ్నీ నగర సౌందర్యాన్ని వర్ణించడం కష్టమే. మొదటగా మేము ‘డార్లింగ్ హార్బర్’కు వెళ్ళాం. అక్కడి అక్వేరియంలో పెద్ద షార్క్ చేపలు, వివిధ రకాల సముద్రపు జంతువులను చూడటం ఆహ్లాదకరంగా బాగుంది. పక్కనే ఉన్న ‘వైల్డ్ లైఫ్ జూ’లో ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారులు, యూకలిప్టస్ ఆకులు తింటూ ఎప్పుడూ నిద్రావస్థలో ఉండే కోయాలతో పాటు ప్రపంచంలోనే పెద్దదైన మొసలిని చూసి థ్రిల్లయ్యాం. అక్కడికి సమీపంలోనే ఉన్న ‘మేడం టుస్సాడ్’ మైనపు బొమ్మల మ్యూజియంలో... మహాత్మాగాంధీ, సచిన్, కోహ్లీల బొమ్మలున్నాయి. వాటితో ఫొటోలు దిగాం.
మరుసటిరోజు ఉదయాన్నే బయలుదేరి నగరానికి పడమర వైపున్న... యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ‘బ్లూ మౌంటైన్స్’ పర్వత ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ నుంచి కనుచూపుమేరలో కనిపించే ఎత్తైన పర్వతాలు, లోయలు ప్రకృతి అందాలకు వన్నెలద్దినట్టు ఫీలయ్యాం. ముఖ్యంగా ‘త్రీ సిస్టర్స్’ అని పిలిచే మూడు శిఖరాలు కట్టిపడేశాయి. ఈ పర్వతాల్లో ఉన్న చెట్ల మధ్యలో నడక, సైక్లింగ్ కోసం బాటలు ఏర్పాటు చేశారు. పర్వతాలపై రైలు, రోప్‌వే లలో ప్రయాణం గగుర్పాటుకు గురిచేసింది.
‘కోట్ హాంగర్’లాంటి వంతెన...
అక్కడి నుంచి నగరంలోని హార్బర్ ప్రాంతానికి చేరుకున్నాం. ఇది సిడ్నీ నగరంలోనే అత్యంత ముఖ్య సందర్శనీయ ప్రాంతం అని చెప్పాలి. ఒకవైపు సిడ్నీ నగరానికి ప్రతీక అయిన ఒపెరా హౌస్, ఇంకోవైపు రాయల్ బొటానికల్ గార్డెన్, మరోవైపు హార్బర్ బ్రిడ్జ్ చూడటానికి రెండు కళ్ళు చాలవు. తెరచాపలాంటి నిర్మాణశైలితో ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఒపెరా హౌస్‌లో ప్రతీరోజూ భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 1932లో ప్రారంభించిన ‘సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్’ ప్రపంచంలోనే స్టీల్‌తో నిర్మాణమైన పెద్ద ఆర్చ్ వంతెన. దీనిని ‘కోట్ హాంగర్’ అని కూడా పిలుస్తారు. టిక్కెట్టు కొని వంతెన పైకి వెళ్లొచ్చు. రాత్రుల్లో వంతెనపై నుంచి ఒపెరా హౌస్, నగరాన్ని చూడటం ఓ అద్భుత అనుభవం. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా వంతెనపై పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తారు. ఆ కాంతులను వీక్షించడానికి వచ్చే విదేశీ సందర్శకుల కోసం 2027 డిసెంబర్ 31కి కూడా నగరంలోని హోటల్ గదులన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయంటే... ఆ వేడుక ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అక్కడి నుంచి సూర్యాస్తమయ సమయానికి ‘సిడ్నీ టవర్ ఐ’ని చేరుకున్నాం. 820 అడుగుల ఎత్తైన ఈ టవర్ నుంచి సిడ్నీ నగరాన్ని వీక్షించడం... ముఖ్యంగా సూర్యాస్తమయాన్ని చూడటం మధురానుభూతిని మిగిల్చింది.
కొండ అంచుల్లో వంపులు తిరిగిన వారధి...
తరువాత రోజు ఉదయాన్నే ‘హెలెన్స్ బెర్గ్’లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాం. ఆస్ట్రేలియాలో స్థిరపడిన హిందువులు ఎక్కువగా ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ‘సీ క్లిఫ్ బ్రిడ్జ్’ ప్రాంతానికి చేరుకున్నాం. ఇది పసిఫిక్ మహాసముద్రం, దాని ఒడ్డున ఉన్న కొండల అనుసంధానిస్తూ కట్టిన పొడవైన బ్రిడ్జ్. మధ్యలో వంపులు తిరిగిన వారధి. ఇలాంటి దృశ్యాలను అరుదుగా చూడగలం. ఈ బ్రిడ్జ్ పై సినిమా షూటింగులు జరుగుతుంటాయి. ప్రభాస్ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’లో దీన్ని చూడొచ్చని చెప్పారు.
అక్కడి నుంచి సిడ్నీ శివారులో ఉన్న ‘ఉలొంగాంగ్’ అనే చిన్న అందమైన రేవు పట్టణాన్ని చేరుకున్నాం. మూడువైపులా టాస్మాన్ సముద్రం మధ్యలో పచ్చటి కొండపై ‘ఫ్లాగ్ స్టాఫ్ లైట్ హౌస్’ ఉంది. దాని పై నుంచి సముద్రాన్ని చూస్తే అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. అక్కడికి సమీపంలో ఉన్న ‘నాన్ టెయిన్’ అనే బుద్దభగవానుడి మహా మందిరం చూడదగిన నిర్మాణం. విశాలమైన ప్రాంగణంలో పచ్చదనం మధ్యలో నిర్మించిన ఈ మందిరం ఆఽధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని పంచుతుంది. అందమైన మూడురకాల బుద్ధ విగ్రహాలతో విరాజిల్లే ఈ మందిరంలో బుద్ధిజం, యోగా, ధ్యానం, ప్రశాంతతలపై తరగతులు నిర్వహిస్తుంటారు.
లావాపై నిర్మించిన గ్రామం...
‘కియామా’ సిడ్నీ సమీపంలోని తీరప్రాంత గ్రామం. ఇది రెండు అగ్నిపర్వతాలు బద్ధలై వెలువడిన లావాపై నిర్మించిన గ్రామం. చెక్కతో నిర్మించిన అందమైన గృహాలు, చూడచక్కగా తీర్చిదిద్దిన రహదారులతో చాలా అందంగా ఉంది. ఇక్కడే సముద్ర తీరంలో అలల ఒత్తిడితో రాళ్ళ మధ్యలో నుంచి పెద్ద శబ్దంతో ఉవ్వెత్తున కెరటాలు ఎగిసి పడుతుంటాయి. దీనిని ‘కియామా బ్లోహోల్’ అంటారు. చూడటానికి అద్భుతంగా ఉంటుంది.
మరుసటి రోజు బీచ్‌లు చూడాలనుకున్నాం. సిడ్నీ హార్బర్ నుంచి ఫెర్రీలో అరగంట ప్రయాణించి అందమైన ‘మాన్లీ’ బీచ్ చేరుకున్నాం. తెల్లటి ఇసుక, పరిశుభ్రమైన నీటితో, పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఈతకు, సర్ఫింగ్ లాంటి జలక్రీడలకు మాన్లీ బీచ్ ప్రసిద్ధి. విదేశీయుల తాకిడి ఎక్కువ. అదేవిధంగా పనిలోపనిగా ‘బోండీ’ బీచ్, ‘క్రొనుల్ల’ బీచ్‌లను చూసేశాం. రూ. 15 వేలు చెల్లించి హెలికాప్టర్లో సిడ్నీ నగరాన్ని విహంగ వీక్షణం చేసే అవకాశం ఉంది.
ఉద్యోగాలు, వ్యాపారరిత్యా భారతీయులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలవారు అధిక సంఖ్యలో సిడ్నీలో స్థిరపడ్డారు. దేశ పౌరసత్వం కూడా త్వరగానే లభిస్తుంది. ‘లిటిల్ ఇండియా’ అనే పారమట్టా, వెంట్ వర్త్ విల్లా, స్కోఫీల్డ్ ప్రాంతాలలో మనవాళ్లు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ మధ్య అమెరికా ఆంక్షల వల్ల విద్యార్ధులు కూడా ఆస్ట్రేలియా బాట పడుతున్నారు. అందుకే అన్ని రకాల భారతీయ వంటకాలను అందించే అనేక హోటళ్లు... ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. వారం పాటు సిడ్నీ మొత్తం తిరిగి, జ్ఞాపకాలను నెమరేసుకుంటూ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నాం.
- జి.రామకృష్ణ, 94408 47518
ఈ వార్తలు కూడా చదవండి:
మరో 260 వందేభారత్ స్లీపర్ రైళ్ల తయారీ
ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష
Read Latest Telangana News and National News