Share News

కరివేపాకు కథ వేరు

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:43 PM

చిటపటమంటూ, వంటగదంతా పరిమళించే కరివేపాకుని అవసరం తీరాక ఏరివేస్తుంటారు దయలేని తెలుగువారు. కరివేపాకు లేనిదే తాలింపు లేదు.

కరివేపాకు కథ వేరు

చిటపటమంటూ, వంటగదంతా పరిమళించే కరివేపాకుని అవసరం తీరాక ఏరివేస్తుంటారు దయలేని తెలుగువారు. కరివేపాకు లేనిదే తాలింపు లేదు. తాలింపు లేని కూర, పప్పు, పులుసు, పచ్చడి, చిత్రాన్నం లేవు. కులమత భేదాలెరుగని ఒకే ఒక్క పరిమళ ద్రవ్యం కరివేపాకు. వంటకానికి రుచిని మాత్రమే కాదు, జీర్ణానికి అనుకూల తను, శరీరానికి స్థిరత్వాన్ని అందిస్తుంది.

అమ్మవారిని కాపురానికి పంపేటప్పుడు సారెసత్తుల్లో కరివేపాకులు లేవని వేంకటేశ్వర స్వామివారు అలిగారని ఓ పుక్కిటి కథ ఉంది. కరివేపాకు తెలుగువారి వంటింట్లో ఎంత కీలకమో చెప్పడానికి ఇది పెద్ద సాక్ష్యం!

కరివేపాకు కారంగా, చేదుగా, వగరుగా ఉండి, పైత్యాన్ని, కఫాన్ని, అజీర్తిని, విష దోషాల్ని హరిస్తాయి. అమీబియాసిస్‌, కలరా, డయేరియా వంటి వ్యాధులకు కరివేపాకు ఔషధమే! ఊపిరితిత్తుల్ని, కాలేయాన్ని శుభ్రపరచి, రక్తదోషాలను పోగొట్టి, రక్తవృద్ధినిస్తాయి. ఆహారంలో విషలక్షణాలను హరించి యాంటీ ఆక్సిడెంట్‌ ఔషధంగా పనిచేస్తాయి.


కరివేపాకు తాలింపు ద్రవ్యం మాత్రమేకాదు, పూర్తిస్థాయి ఆకుకూర కూడా! విటమిన్‌ ఎ, బి, సి, ఇ లతో పాటు ఐరన్‌ బాగా ఉంది. కొత్తి మీర, పుదీనాలతో పోలిస్తే ఇందులో తేమ తక్కువ, ఖనిజాలు ఎక్కువ. సుమారు 6శాతం ప్రొటీన్లు, 6శాతం ఫైబర్‌, 16శాతం పిండిపదార్థాలతో కేవలం 27 క్యాలరీల శక్తినే అందిస్తుంది. స్థూల కాయం, షుగర్‌ ఉన్నవాళ్లు కరివేపాకును ఒక ఆకుకూరగా తినగలగాలి!

ఇందులో 1.04శాతం నూనె పదార్థాలున్నా, వేడిచేయగానే ఆ నూనె ఆవిరైపోతుంది. అందుకే, ఈ ఆకులకు మన వంటకాలలో అతిథి పాత్ర కాదు, ఏకంగా నాయిక పాత్రే ఇవ్వగలిగితే, 365 రోజులు దొరికే ఒక కొత్త ఆకుకూరను మనం సంపాదించుకున్నట్టే!


  • కరివేప ములగాకుల కారప్పొడి: కరివేపాకులు, ములగాకులు, చింత చిగురు వీటిని నీడన ఆరబెట్టి, భాండీలో వేగించిమినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ విడివిడిగా వేగించి దంచిన కారప్పొడిని వేడి అన్నంలో మొదటి ముద్దగా తింటే అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ఈ పొడిని మజ్జిగలో కలిపి తాగితే గొప్ప ప్రోబయాటిక్‌ ఔషధంగా పనిచేస్తుంది. వేసవికాలంలో వడదెబ్బ కొట్టదు.

  • కరివేపాకు పచ్చడి: కరివేపాకులు, మిన ప్పప్పు, మిరియాలు లేదా ఎండు మిరప కాయలను నేతితో వేగించి మెత్తగా దంచి నిమ్మరసం కలుపుతారు. దీన్నే కరివేపాకు కారం అనికూడా పిలుస్తారు. ఎసిడిటీ, వికారం, వాంతులు అరుచి తగ్గుతాయి. దగ్గు, జలుబు, ఆయాసం వంటి సమస్యలు విడవనివారికి కూడా ఇది మేలు చేస్తుంది.


  • కరివేపాకు రైస్‌: పుదీనారైస్‌, జీరారైస్‌ లాగానే కరివేపరైస్‌ జంక్‌ ఫుడ్స్‌ బారినుంచి బైటపడటానికి సహకరిస్తుంది.

  • ఆకుకూరలతో పాటుగా: ఆకుకూరలతో పాటు గుప్పెడు కరివేపాకుల్ని కూడా తీసుకుని అన్నీ కలిపి తరిగి కూర, పప్పు, పచ్చడి పులు సుకూర వగైరా చేసుకుంటే అదనపు రుచి, పరిమళాలతో ఆరోగ్యదాయకంగా ఉంటుంది.

  • కరివేపాకు చారు: కరివేపాకుల్ని మిక్సీపట్టి ఆ పొడి, చారుపొడి కలిపి రసం కాచుకుని నేతి తాలింపు పెట్టుకుంటే అద్భుతమైన ఔషధమే! పులుసు, సాంబారు కూడా ఇలా చేసుకోవచ్చు. కాగిన తరువాత పసరు వాసన ఉండదు.


  • ఎక్కువ కరివేపాకులతో తాలింపు: శాకాహారమైనా మాంసాహారమైనా కరివేపాకు నాలుగు రెబ్బలతో సరిపెట్టకుండా గుప్పెడు ఆకుల్ని మూడు నాలుగు ముక్కలయ్యేలా తరిగి తాలింపులో వేగిస్తే కరివేపాకుల ప్రయో జనం అందుతుంది. ఆకుల్ని ముక్కలు చేసి తాలింపులో వెయ్యాలన్నదే ముఖ్య సూచన.

  • కరివేపాకు నూనె: కరివేపాకుపొడిని 8 రెట్లు నీళ్లు పోసి నాలుగు వంతులు మిగిలేలా చిక్కని కషాయం కాచి, వడగట్టి, ఆ కషాయానికి సమానంగా కొబ్బరినూనె కలిపి మరిగించి నీరంతా ఆవిరై నూనె మాత్రమే మిగిలేలా కాచిన ‘కరివేప నూనె’తో తలకు మర్దన చేస్తే కేశమూలాలు బలపడతాయి. వెంట్రుకలు రాలటం తగ్గి, కేశసంపద వృద్ధి పొందుతుంది. తలలో వేడి తగ్గి వెంట్రుకలు ముందస్తుగా తెల్లబడటం ఆగుతుంది.

  • కరివేపాకుల పెరుగు: నానబెట్టిన మెంతుల్ని కరివేపాకుల్ని మిక్సీపట్టి పెరుగు కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.

కరివేపాకులు కేవలం పోపు ఆకులు కాదు, పోషకాల హామీ పత్రాలు!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


book9.2.jpgదహీ కబాబ్‌

కావలసిన పదార్థాలు: వడకట్టిన పెరుగు - రెండు కప్పులు, పనీర్‌ తురుము - కప్పు, శనగపిండి - పావు కప్పు, ఉల్లి ముక్కలు - పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు -రెండు స్పూన్లు, గరం మసాలా - స్పూను, కారం - స్పూను, పసుపు - స్పూను, జీలకర్ర పొడి - స్పూను, బ్రెడ్‌ పొడి - అర కప్పు, ఉప్పు, కొత్తిమీర - తగినంత.

తయారుచేసే విధానం: గిన్నెలో వడకట్టిన పెరుగు, పనీర్‌, ఉల్లి, శనగపిండి, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీల కర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి, కబాబ్‌లుగా వత్తుకోవాలి. ఒక్కో కబాబ్‌ని బ్రెడ్‌పొడిలో అద్ది, బటర్‌ పేపర్‌ పరచిన బేకింగ్‌ ట్రేలో ఉంచి, ఒవెన్‌లో పెడితే సరి.


అటుకుల ఊతప్పం

కావలసిన పదార్థాలు: అటుకులు - అర కప్పు, రవ్వ - కప్పు, పెరుగు - అర కప్పు, ఉల్లి- పావు కప్పు, బీన్స్‌- ఐదు, క్యారెట్‌ తురుము - రెండు స్పూన్లు, కొత్తిమీర - రెండు స్పూన్లు, నూనె, నీళ్లు, ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం: ఓ గిన్నెలో అటుకుల్ని ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరవాత నీళ్లను వడగట్టి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఓ పెద్ద గిన్నెలోకి అటుకుల పేస్టు, రవ్వ, పెరుగు, అర కప్పు నీళ్లు, అర స్పూను ఉప్పు వేసి అన్నీ బాగా కలిపి, ఇరవై నిమిషాలు పక్కనపెట్టాలి. ఆ తరవాత కూరగాయల ముక్కలన్నింటినీ ఈ మిశ్రమంలో కలపాలి. చిన్న చిన్న దోశలుగా పెనం మీద వేస్తే అటుకుల ఊతప్పం సిద్ధం.


ఈ వార్తలు కూడా చదవండి:

మరో 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ

ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Mar 22 , 2026 | 12:43 PM