హామీల అమలుకే నిధులు లేవు.. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడివి?: టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:33 PM
మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు స్పష్టం చేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 22: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు స్పష్టం చేశారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చి వేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మూసీ పునరుజ్జీవం - వాస్తవాలు అంశంపై టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు అధ్యక్షతన చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకే నిధులు లేవంటున్నారని.. మరి మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
మూసీ నది ప్రక్షాళన అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతల వైఖరి తెలియజేశారన్నారు. గతంలో తాము గండిపేట నీళ్లు తాగుతున్నామని గొప్పగా చెప్పుకునే వాళ్లమని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా పెరుగుతోందని తెలిపారు. రాను రాను మంచినీరు కలుషితమవుతున్నాయని చెప్పారు. అన్ని నాలాలు పొంగుతుంటాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం మూసీ నది నీరు చూస్తే.. ఇవేనా మనం తాగిందని అనుకుంటామన్నారు. వికారాబాద్‌లో మొదలైన ముసీ నది.. గండిపేట, నల్గొండ ద్వారా కృష్ణా నదిలో కలుస్తుందని చెప్పారు. ఈ నది వల్ల నల్గొండ, హైద్రాబాద్‌లలో ప్రవహించే ప్రాంతాల్లో పంటలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే డెవలప్‌మెంట్ లేదని గుర్తు చేశారు. 60 ఏళ్ల పాటు పాలించినప్పుడు మూసి నదిని ఎందుకు ప్రక్షాళన చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు నిప్పులు చెరిగారు.
మూసీ సుందరీకరణ విధానానికి బీజేపీ వ్యతిరేకం: వెదిరె శ్రీరాం
మూసీ నది మన అందరిదని.. దాని వెంట జీవించే ప్రజల జీవనాధారంతోపాటు వారి భవిష్యత్తుతో ముడిపడి ఉందని మహారాష్ట్ర ప్రభుత్వ నీటి సలహాదారు వెదిరె శ్రీరాం వివరించారు. మూసీ సుందరీకరణకు బీజేపీ సపోర్ట్ చేస్తుందని తెలిపారు. కానీ మూసీ సుందరీకరణ చేసే విధానాన్ని మాత్రం బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. మూసీ ప్లానింగ్ సరిగా లేదని.. ప్లానింగ్ సరిగా లేకపోతే బాధాకరంగా మిగిలి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం చాలా గొప్పదని.. చాలా జీవనదులున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూసీలో చేపలు జీవించినపుడు.. మనుషులు ఈత కొట్టినపుడు.. మూసీ నదిని సుందరీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
అన్ని డిపార్ట్‌మెంట్స్ వారితో కలిసి పని చేస్తేనే మూసీ ప్రక్షాళన విజయవంతం అవుతుందని వెదిరె శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళన జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రూ.160 కోట్ల డీపీఆర్‌తో ఏం చేస్తున్నారో తెలియడం లేదని సందేహం వ్యక్తం చేశారు. తాము తయారు చేసిన మూసీ మొదటి డీపీఆర్ ఇవ్వమంటే తమ అధ్యక్షుడు అనుమతితో ఉచితంగానే ఇచ్చేస్తామని పేర్కొన్నారు. మూసీ మిడిల్ పాయింట్ నుండి రెండు వైపులా 100 మీటర్ల మేర బఫర్ జోన్ అంటున్నారని తెలిపారు. మూసీకి రెండు వైపులా గోడ నిర్మించడం సరికాదన్నారు.
ప్రొటెక్టెడ్ జోన్‌లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని వెదిరె శ్రీరామ పేర్కొన్నారు. వార్నింగ్, రెగ్యులేటరీ జోన్ నిర్మాణాలు ఉండవచ్చని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాలను మూసీ డీపీఆర్‌కు ఎట్లా అమలు చేస్తారన్నది మాత్రం డీపీఆర్‌లో లేదన్నారు. మూసీ వద్ద 55 కిలోమీటర్ల పార్క్ అవసరమా? అని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులు.. ప్రొటెక్టెడ్ జోన్‌లో లేరన్నారు. వార్నింగ్ జోన్లో వారిని ఖాళీ చేయించాల్సిన అవసరం లేదని చెప్పారు. మూసీ డీపీఆర్‌లో స్పష్టత లేదన్నారు.
స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ లేనిదే ఇలాంటి ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్లవన్నారని వెదిరె శ్రీరామ్ తెలిపారు. వాటర్ క్వాలిటీతోనే ఏదైనా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. డీపీఆర్‌లో కీ పెర్ఫార్మెన్స్ ఏమిటనేది లేదని చెప్పారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో 5 కిలోమీటర్లకు 4,200 మీటింగ్స్ పెట్టారని.. మరి మూసీ ప్రక్షాళనకు ఎన్ని మీటింగ్స్ పెట్టారంటూ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. సబర్మతికి రూ.1,100 కోట్లు ఖర్చు అయితే రూ.1,500 కోట్లు రెవిన్యూ వస్తుందంటూ వెదిరె శ్రీరాము గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లు పెడతాం: కేటీఆర్
For More TG News And Telugu News