RPF Rescues Passenger: తృటిలో తప్పిన ముప్పు! చంటిపిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలెక్కబోతుంటే..
ABN , Publish Date - Jan 19 , 2026 | 10:39 AM
కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపడ్డ ప్రయాణికుడిని ఆర్‌పీఎఫ్ సిబ్బంది కాపాడారు. వారి అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌లో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది.
ఇంటర్నెట్ డెస్క్: కదలుతున్న రైల్లోకి ఎక్కే ప్రయత్నం చేయొద్దని రైల్వే శాఖ ఎంతగా చెబుతున్నా జనాల్లో మాత్రం ఆశించిన మార్పు రావడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా చంటిబిడ్డను ఎత్తుకుని కదిలే రైలు ఎక్కబోయి చిక్కుల్లో పడ్డాడు. అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్ సిబ్బంది వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది(Prayagraj Railway station Passenger Rescue).
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. 15018 నంబర్ గల కాశీ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతున్న సమయంలో ఓ వ్యక్తి తన చంటి బిడ్డతో సహా రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఎలాగైనా రైలు ఎక్కాలన్న తొందరలో ఆ వ్యక్తి తన బిడ్డను చేజేతులా రిస్క్‌లోకి నెడుతున్న విషయాన్నీ గమనించుకోలేదు. పరుగుపరుగున వెళ్లి రైలు మెట్లపై కాలుపెట్టాక పట్టు తప్పి కిందకుజారాడు. బోగీ డోర్ పక్కన ఉన్న రాడ్ పట్టుకుని వేలాడుతూ నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అతడి చేతిలోని బిడ్డను రైల్లోని మరో ప్యాసింజర్ పట్టుకున్నాడు. అప్పటికే ఇదంతా గమనిస్తున్న ఆర్‌పీఎఫ్ సిబ్బంది సెకెన్ల వ్యవధిలో స్పందించి ఆ వ్యక్తిని కాపాడారు.
ఆ వ్యక్తికి, అతడి బిడ్డకు ఎలాంటి గాయాలూ కాలేదని ఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. తన బిడ్డతో కలిసి అతడు మరో రైల్లో వెళ్లిపోయాడని చెప్పారు. అప్రమత్తంగా వ్యవహరించి ముప్పును తప్పించిన ఆర్‌పీఎఫ్ సిబ్బందిని రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసించారు. కదులుతున్న రైళ్లల్లోకి ఎక్కే ప్రయత్నం చేయొద్దని ప్రయాణికులను ఈ సందర్భంగా మరోమారు హెచ్చరించారు. రైలు ఆగి ఉన్న సమయంలోనే ఎక్కాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇక వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. చిన్నారులతో ప్రయాణించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని అనేక మంది హెచ్చరించారు.
ఇదీ చదవండి:
అర్ధరాత్రి మహిళకు షాకింగ్ అనుభవం! ఛాతిపై ఏదో ఉన్నట్టు అనిపించి చూస్తే..
గడ్డకట్టి ఉన్న సరస్సుపైకి టూరిస్టులు! ఇంతలో భారీ ప్రమాదం