Airline Passenger Loud Reels: విమానంలో అంకుల్ చేసిన పని.. నెట్టింట వైరల్
ABN , Publish Date - Jan 16 , 2026 | 06:26 PM
పెద్ద శబ్దంతో తోటి ప్రయాణికుడు రీల్స్ చూడటాన్ని ఆక్షేపిస్తూ మరో ప్రయాణికుడు నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ఇలాంటి వారికి బుద్ధి చెప్పే యాప్‌ను తాను డిజైన్ చేశానంటూ ఓ నెటిజన్ చెప్పడంతో ఈ ఉదంతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: నలుగురి మధ్య ఉన్నామన్న స్పృహ కొందరికి అస్సలు ఉండదు. తమను అడిగేవారే లేరన్నట్టు ప్రవర్తిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి వారికి బుద్ధి చెప్పే మార్గం మరొకటి ఉందంటూ ఓ నెటిజన్ చెప్పుకొచ్చారు. అతడి ఐడియా కూడా జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది (Playing Loud Reels in Airplane Viral Incident).
మధ్యవయసు దాటిన ఓ ప్రయాణికుడి ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆనంద్ శంకర్ అనే వ్యక్తి ఈ పోస్టు పెట్టారు. విమానంలో తన పక్కనున్న ఓ అంకుల్ పెద్ద శబ్దంతో రీల్స్ చూస్తూ తనకు ఇబ్బంది కలిగించాడని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో తాను సాధారణంగా అవతలి వారికి సౌండ్ తగ్గించమని చెబుతుంటానని అతడు తెలిపారు. ఈసారి మాత్రం ఆ అంకుల్ అలా ఎంత సేపు పెద్ద శబ్దంతో రీల్స్ చూస్తారో చూద్దామని అనుకున్నట్టు చెప్పారు. ఆ ప్రయాణికుడి ఫొటోతో సహా ఈ ఉదంతాన్ని షేర్ చేశారు.
దీనిపై పంకజ్ అనే నెటిజన్ స్పందించారు. ఇలాంటి వారు మాటలతో చెబితే వినరని అన్నారు. వీరిని దారిలోకి తెచ్చేందుకు తానో యాప్ రూపొందించినట్టు తెలిపారు. చుట్టుపక్కల వినబడే శబ్దాలను ఈ యాప్ రికార్డు చేసి మళ్లీ రీప్లే చేస్తుందని వివరించారు. దీన్ని తాను ట్రై చేస్తే అద్భుత ఫలితాలు వచ్చాయని చెప్పారు. తనకే ఆశ్చర్యం వేసిందని కూడా కామెంట్ చేశారు.
ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ యాప్ ఐడియా అద్భుతమని అన్నారు. క్రియేటివిటీ అంటే ఇదీ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి యాప్‌ను డిజైన్ చేసినందుకు నోబెల్ శాంతి బహుమతిని ఆ వ్యక్తికి ఇవ్వాలని కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

ఇవీ చదవండి:
ట్యాక్సీలో గంట ప్రయాణం.. ఏకంగా రూ.30 వేల బిల్లు.. మహిళకు షాక్
అద్భుతం.. 27వ అంతస్తు నుంచి చూస్తే.... నెట్టింట వైరల్‌గా మారిన వీడియో