Share News

Switzerland Taxi Ride: ట్యాక్సీలో గంట ప్రయాణం.. ఏకంగా రూ.30 వేల బిల్లు.. మహిళకు షాక్

ABN , Publish Date - Jan 15 , 2026 | 08:31 PM

స్విట్జర్‌లాండ్‌లో గంట పాటు ట్యాక్సీలో ప్రయాణించిన ఓ అమెరికా మహిళకు ఊహించని షాక్ తగిలింది. బిల్లు చూసి దిమ్మెరపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Switzerland Taxi Ride: ట్యాక్సీలో గంట ప్రయాణం.. ఏకంగా రూ.30 వేల బిల్లు.. మహిళకు షాక్
Switzerland Taxi Fare

ఇంటర్నెట్ డెస్క్: విహారయాత్రలకు ఇతర దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అమెరికా, ఐరోపాల్లోని అనేక దేశాలకు భారతీయులు వెళుతున్నారు. కానీ, అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోతే మాత్రం ఖర్చు తడిసిమోపెడయ్యే అవకాశం ఉంది. ఓ అమెరికా మహిళకు సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Switzerland Taxi Ride - Viral Video).

అమెరికా ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ వ్యాఖ్యాత జీనా డార్లింగ్ ఇటీవల స్విట్జర్‌లాండ్‌కు వెళ్లారు. అయితే, అక్కడ ట్యాక్సీలో దాదాపు గంట పాటు ప్రయాణించిన ఆమె బిల్లు చూసి షాకయిపోయారు. గంట పాటు ప్రయాణానికి 338 డాలర్లు (సుమారు రూ.30 వేలు) చెల్లించాల్సి వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘చివరకు 338 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది. ఊబెర్, ట్రెయిన్స్ గురించి నాకు తెలుసుకానీ అప్పటికి నా వెంట లగేజీ చాలా ఉంది. త్వరగా మరో చోటకు వెళ్లాల్సి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ట్యాక్సీ ఎక్కాను. చివరకు ఇంత బిల్లు చెల్లించాల్సి వచ్చింది’ అని ఆమె పేర్కొంది.


ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. స్విట్జర్‌లాండ్‌లో ట్యాక్సీ రేట్‌లు అలాగే ఉంటాయని అనేక మంది కామెంట్ చేశారు. అక్కడి అధిక జీవన వ్యయాలే ఇందుకు కారణమని చెప్పారు.

అమెరికాలో వ్యవహరించినట్టు ఐరోపా దేశాల్లో కుదరదని అన్నారు. అక్కడ గంట పాటు క్యాబ్‌లో ప్రయాణించడం చాలా అసాధారణ విషయమని చెప్పారు. స్విట్జర్‌లాండ్‌లోని ప్రజారవాణా వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుందని, రైల్లో అయితే 20 డాలర్లకే గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు.

స్విట్జర్‌లాండ్‌లోని ప్రజారవాణా వ్యవస్థ ప్రపంచప్రఖ్యాతి గాంచిన విషయం తెలిసిందే. రైళ్లు, బస్సులు, ట్రామ్స్, బోటు సర్వీసులు పూర్తిస్థాయిలో అనుసంధానం కావడంతో అక్కడి వారు సొంత వాహనాలను కాస్త తక్కువగా వినియోగిస్తారు.


ఇవీ చదవండి:

అద్భుతం.. 27వ అంతస్తు నుంచి చూసే.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

హనుమాన్ విగ్రహం చుట్టూ శునకం ప్రదక్షిణలు! 36 గంటల పాటు..

Updated Date - Jan 15 , 2026 | 08:38 PM