Sela Lake Accident: గడ్డకట్టి ఉన్న సరస్సుపైకి టూరిస్టులు! ఇంతలో భారీ ప్రమాదం
ABN , Publish Date - Jan 17 , 2026 | 09:15 PM
అరుణాచల్‌ప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గడ్డకట్టిన సేలా సరస్సుపై నడిచిన ఇద్దరు కేరళ టూరిస్టులు మంచు విరగడంతో నీటిలో మునిగి దుర్మరణం చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: అరుణాచల్‌ప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రముఖ సేలా సరస్సులో ఇద్దరు టూరిస్టులు మునిగి దుర్మరణం చెందారు. మృతులను కేరళకు చెందిన బీనూ ప్రకాశ్ (26), మహావీర్‌గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కేరళకు చెందిన ఏడుగురు టూరిస్టుల బృందం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సేలా సరస్సు వద్దకు వచ్చింది. ఆ సమయంలో సరస్సు ఉపరితలం గడ్డకట్టి ఉంది. ఈ క్రమంలో ముగ్గురు పర్యాటకులు గడ్డకట్టిన సరస్సు ఉపరితలంపై నడిచారు. ఈ క్రమంలో మంచు విరగడంతో వారు ఒక్కసారిగా సరస్సులోకి జారిపోయారు. వీరిలో ఒకరు ఎలాగొలా తప్పించుకోగలిగినా మిగతా ఇద్దరూ సరస్సులోకి జారిపోయారు. ఒకరి మృతదేహం లభించగా మరొకరు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనకు సంబంధించి ఫుటేజీ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సరస్సులో పడ్డ వారిని కాపాడేందుకు కొందరు ప్రయత్నిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈ షాకింగ్ ఘటన చూస్తున్న చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున హాహాకారాలు చేశారు.
ఈ వీడియోపై జనాలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గడ్డకట్టిన సరస్సులపై నడక ప్రమాదకరమని అనేక మంది హెచ్చరించారు. మంచు ఎప్పుడైనా విరిగి మనుషులు నీట మునిగే ప్రమాదం అత్యధికమని అన్నారు. ఆ సమయంలో సరస్సు పూర్తిస్థాయిలో కూడా గడ్డకట్టిలేదని మరికొందరు అన్నారు. కనీసం నాలుగైదు అంగుళాల మందం ఉన్న మంచుపైనే నడక సాధ్యం అవుతుందని, అయినప్పటికీ బలహీనంగా ఉన్న కొన్ని చోట్ల మంచు విరిగి జనాలు నీట మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇవీ చదవండి:
అర్ధరాత్రి మహిళకు షాకింగ్ అనుభవం! ఛాతిపై ఏదో ఉన్నట్టు అనిపించి చూస్తే..
విమానంలో అంకుల్ చేసిన పని.. నెట్టింట వైరల్