మూగజీవిపై మమకారం.. రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలిని ఎలా కాపాడారో చూశారా? వీడియో వైరల్
ABN , Publish Date - Jul 02 , 2026 | 09:38 AM
రైలు ఇంజిన్‌లో నెమలి చిక్కుకుంది. దానిని స్థానికుల సహాయంతో రైల్వే పోలీసులు సురక్షితంగా కాపాడారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని షెగావ్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. రైలు ఇంజన్‌లో చిక్కుకుపోయిన నెమలిని స్థానికుల సహాయంతో రైల్వే పోలీసులు సురక్షితంగా రక్షించారు. దాంతో వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భూసావల్ - బద్నేరా మధ్య ఎంఈఎంయూ (MEMU) రైలు నడుస్తుంది. ఈ రైలు షెగావ్ రైల్వేస్టేషన్‌లో నిలిచింది. ఈ సందర్భంగా రైలు ఇంజిన్‌లో నెమలి చిక్కుకున్న విషయాన్నిస్టేషన్‌లోని ప్రయాణికులు గుర్తించారు. ఇదే విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేశారు. అప్పటికే అక్కడ ఉన్న స్థానికుల సహాయంతో నెమలిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
అయితే ఇంజిన్‌లో నుంచి నెమలిని బయటకు తీసేందుకు పోలీసులు తొలుత ప్రయత్నించారు. దీంతో భయపడిన ఆ నెమలి ఇంజిన్‌లో మరింత లోపలికి వెళ్లింది. ఈ నేపథ్యంలో స్థానికులతో పాటు రైల్వే పోలీసులు నెమలిని జాగ్రత్తగా బయటకు తీశారు. ఏ మాత్రం తొందర పడకుండా.. రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలిని వారంతా రక్షించారు. ఈ సమయంలో నెమలికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.
నెమలిని రక్షించే క్రమంలో వీరంతా సున్నితత్వాన్ని ప్రదర్శించారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మూగ జీవుల పట్ల మానవులు వ్యవహరించిన తీరు మరోసారి రుజువు అయిందని ఇంకో నెటిజన్ పేర్కొన్నారు. ప్రతి ప్రాణి విలువైనదేననే భావాన్ని మరికొందరు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జంతువుల పట్ల మానవత్వంతోపాటు కరుణను చూపిస్తాయని నెటిజన్లు వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!
చిన్నారిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. చూస్తే కన్నీళ్లు ఆగవు..