Share News

ఇన్‌ఫ్లుయెన్సర్‌‌తో ఆడుకున్న ఫాలోవర్లు.. స్వీట్ల కోసం అడ్రస్ పెడితే.. భారీగా ఆర్డర్లు!

ABN , Publish Date - Oct 14 , 2026 | 11:04 AM

దీపావళి స్వీట్ల కోసం తన ఇంటి అడ్రస్ పెట్టిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌‌తో ఫాలోవర్లు ఆడుకున్నారు. ఆయన ఇంటికి లక్షల రూపాయల విలువైన క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెట్టారు.

ఇన్‌ఫ్లుయెన్సర్‌‌తో ఆడుకున్న ఫాలోవర్లు.. స్వీట్ల కోసం అడ్రస్ పెడితే.. భారీగా ఆర్డర్లు!

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి కానుకగా తనకు స్వీట్లు పంపాలని కోరిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌‌ చిక్కులు కొనితెచ్చుకున్నారు. తన ఫాలోవర్ల నుంచి బహుమతులు ఆశించిన ఆయనకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. మదురైకు చెందిన వీరమణి అనే ఇన్‌ఫ్లుయెన్సర్‌కు గట్టిగానే ఫాలోవర్లు ఉన్నారు. తన మీద ఫాలోవర్లుకు అభిమానం పొంగిపోతోందని భావించిన ఆయన దీపావళికి స్వీట్లు పంపించాలని కోరారు. ఇందుకోసం తన ఇంటి అడ్రస్‌ను పిన్‌కోడ్‌తో సహా ఆయన బయటపెట్టేశారు. అలాగే మొబైల్ నంబర్‌నూ చెప్పేశారు. ఇంకేముంది అభిమానుల నుంచి వందల కొద్దీ స్వీటు బాక్సులు వస్తాయని ఫిక్స్ అయ్యారు. అయితే ఫాలోవర్లు మిఠాయిలకు బదులు ఖరీదైన వస్తువులను ఆయన ఇంటికి ఆర్డర్ పెట్టారు. కాకపోతే పేమెంట్ చేయలేదు. ఆ ఆర్డర్లన్నీ క్యాష్-ఆన్ డైలివరీపై పెట్టారు. అంటే వాటికి డబ్బులు వీరమణే కట్టాల్సి ఉంటుంది.


ఒకటీ రెండూ అయితే పర్వాలేదు. అరగంటకు పదిహేను ఆర్డర్ల చొప్పున ఆయన ఇంటికి రావటం మొదలయ్యాయి. పోనీ అవి చిన్నా చితకా వస్తువులూ కాదు. టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఇలా అన్నీ ఖరీదైనవే. ఓ ఫాలోవర్ ఏకంగా రూ.లక్షన్నర విలువైన టీవీని వీరమణి కోసం క్యాష్ ఆన్ డెలవరీ పెట్టేశారు. పాపం వీరమణి ఇంటి ముందుకు పదుల్లో డెలవరీ వాహనాలు వచ్చి వాలుతున్నాయి. వారందరికీ సమాధానం చెప్పలేక ఆయన ముప్పుతిప్పలు పడుతున్నారు.


ఆపండ్రా బాబోయ్..

తన నివాసానికి ఆన్‌లైన్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని వీరమణి గగ్గోలు పెడుతున్నారు. అరగంటకు పదిహేను డెలివరీలు వస్తున్నాయంటూ ఆయన బావురుమంటున్నారు. ఈ ఆర్డర్ల వల్ల తానొక్కడే కాకుండా డెలివరీ బాయ్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. పోని వాటిని తీసుకుందామంటే అంత డబ్బు లేదని చెబుతున్నారు. అందువల్ల ఫాలోవర్లు వెంటనే ఈ ఆర్డర్లు పెట్టటం ఆపాలని వేడుకున్నారు. అయినా ఫాలోవర్లు ఆపకపోవడంతో వీరమణి ఊరు వదిలి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో అడ్రస్ షేర్ చేయటమే ఆయన కొంపముంచిందన్నమాట.


ఈ వార్తలూ చదవండి

క్షణాల్లో చేతులతోనే ఇనుప పెనాన్ని చుట్టేశాడు.. వీడియో వైరల్

అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో

Updated Date - Oct 14 , 2026 | 11:11 AM