Share News

జొనాథన్‌ @ 194

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:01 PM

మనిషి జీవితకాలం వందేళ్లు. అది ఒకప్పటి మాట. వందేళ్లు జీవించిన జంతువుల గురించి వినడం కూడా అరుదు.

జొనాథన్‌ @ 194
Jonathan the tortoise,

మనిషి జీవితకాలం వందేళ్లు. అది ఒకప్పటి మాట. వందేళ్లు జీవించిన జంతువుల గురించి వినడం కూడా అరుదు. అయితే ఒక తాబేలు మాత్రం ఏకంగా 194 ఏళ్లుగా జీవించి ఉందంటే ఎవరైనా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. అంతేకాదండోయ్‌... ఈ తాబేలు భూమిపై అత్యంత ఎక్కువ కాలం జీవించి ఉన్న జంతువుగా గుర్తింపు పొందింది. దాని పేరు జొనాథన్‌. సెయింట్‌ హెలెనా దీవిలో వున్న జొనాథన్‌ స్థానికులకు ఒక సెలబ్రిటీ.

మిగతా జంతువులో పోలిస్తే... తాబేళ్ల జీవితకాలం కాస్త ఎక్కువే. అవి సాధారణంగా 50 నుంచి 100 ఏళ్లు జీవిస్తాయి. కానీ జొనాథన్‌ అని ముద్దుగా పిలుచుకునే తాబేలు వయసు ఆశ్చర్యంగా 194 ఏళ్లయినా ఇంకా ఆరోగ్యంగానే ఉంది. దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉన్న దీవుల్లో ఒకటైన సెయింట్‌ హెలెనాలో జొనాథన్‌ ఉంది. 1832లో జన్మించినట్టు స్థానికంగా ఆధారాలున్నాయి. అప్పట్లో సీషెల్స్‌ దీవుల్లో పుట్టిన జొనాథన్‌ను సెయింట్‌ హెలెనాకు తీసుకొచ్చి, అప్పటి గవర్నర్‌ విలియం గ్రే విల్సన్‌కు బహుమతిగా అందించారు. అప్పటి నుంచి ఎందరో గవర్నర్లు మారారు. జొనాథన్‌ మాత్రం ఆ అతిథి గృహంలోనే ప్రశాంతంగా జీవిస్తోంది.


book8.2.jpgవినికిడి శక్తి సూపర్‌...

రెండు శతాబ్దాల కాలంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. రెండు ప్రపంచయుద్ధాలు కూడా జరిగాయి. ఇంటర్నెట్‌ వచ్చింది. సెల్‌ఫోన్‌ ప్రపంచాన్ని మార్చేసింది. మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టాడు. భూమిపై ఇలాంటి ఎన్నో మార్పులు జరిగినా జొనాథన్‌ జీవితంలో మాత్రం పెద్దగా మార్పు లేదు. తినడం, జతకట్టడం, నిద్రపోవడం... దీని దినచర్య ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. అయుతే వయసు పెరగడంతో ఈ భారీ తాబేలుకు కంటి చూపు పోయింది. అలాగే ఘ్రాణశక్తి తగ్గిపోయింది. ఆహారాన్ని తీసుకెళ్లి జొనాథన్‌ దగ్గర పెట్టినా గుర్తించదు. అందుకే సంరక్షకులు స్వయంగా ఆహారం తినిపిస్తారు. ఆశ్చర్యకరంగా వినికిడి శక్తి మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా వెటర్నరీ డాక్టర్‌ హాలిన్స్‌ స్వరం వినగానే వెంటనే స్పందిస్తుంది.


book8.3.jpgవాతావరణం వెచ్చగా ఉన్న రోజుల్లో తన మెడ, కాళ్లను పూర్తిగా చాపుకుని ఎండలో పడుకుంటుంది. చలికాలంలో మాత్రం ఆకులు, గడ్డి కుప్పల్లో చిన్న గుంత తవ్వుకుని రోజంతా అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది. అతిథి గృహంలో జొనాథన్‌తో పాటు డేవిడ్‌, ఎమ్మా, ఫ్రెడ్‌ అనే మరో మూడు భారీ తాబేళ్లు కూడా జీవిస్తున్నాయి. క్యాబేజీ, దోసకాయ, క్యారెట్‌, యాపిల్‌, సీజనల్‌ పండ్లు ఇష్టంగా తింటుంది. ‘‘సుమారుగా రెండు శతాబ్దాల వయస్సు వచ్చినా జొనాథన్‌లో లైంగిక చురుకుదనం (లిబిడో) ఇంకా బాగానే ఉంది. అది తరచూ ఎమ్మాతో, కొన్నిసార్లు ఫ్రెడ్‌తో కూడా జతకడుతుంది’’ అని డాక్టర్‌ హాలిన్స్‌ అంటారు.


book8.4.jpgస్థానికులకు సెలబ్రిటీ

దక్షిణ అట్లాంటిక్‌ మహాసముద్రంలోని సెయింట్‌ హెలెనా ద్వీపంలో జొనాథన్‌ ఒక సెలబ్రిటీ. ఇక్కడ తరతరాలుగా నివసిస్తున్న స్థానికుల ఇళ్లలో చిన్నప్పుడు జొనాథన్‌తో కలిసి దిగిన వారి అమ్మమ్మల ఫొటోలు కనిపిస్తాయి. అందుకే దానిని అందరూ కుటుంబ సభ్యుడిలా ప్రేమిస్తారు. దాని ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఆరా తీస్తుంటారు. గతంలో అత్యంత వృద్ధ తాబేలు రికార్డు ‘టుయి మలిలా’ అనే తాబేలు పేరిట ఉండేది. ఆ తాబేలు 188 ఏళ్లు జీవించింది. జేమ్స్‌ కుక్‌ 1777లో టోంగా రాజకుటుంబానికి ‘టుయి మలిలా’ను బహుమతిగా అందించారని చెబుతారు. అయితే అది 1965లో మరణించింది. జొనాథన్‌ ఆ రికార్డును బద్దలు కొట్టి నూతన చరిత్రకు సాక్షిగా నిలుస్తోంది. ఈ వృద్ధ, అరుదైన తాబేలు రెండు శతాబ్దాల రికార్డుకు చేరుకోవాలని ఆశిద్దాం!


ఈ వార్తలు కూడా చదవండి:

వాన నీటి కచేరీ

స్కూలు పుస్తకంలో తన కథే ఓ పాఠంగా..!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 26 , 2026 | 12:25 PM