Share News

'దయచేసి నన్ను మన్నించండి'.. ఆ కాలేజీ గోడలపై ఓ ప్రేమికుడి పోస్టర్లు

ABN , Publish Date - Apr 10 , 2026 | 09:08 AM

ప్రేమను వ్యక్తపరచడం అనేది మాటల్లోనే కాదు.. అది ప్రవర్తనలో, గౌరవంలో, బాధ్యతలో ప్రతిఫలించాలి. నిజమైన ప్రేమలో పరస్పర గౌరవం, విశ్వాసం, పరిమితులను అర్థం చేసుకోవడం కీలకం. అయితే.. ప్రేమ పేరుతో ఇతరులకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం సరికాదు. తాజాగా.. అలాంటి ఘటన ఒకటి జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే...

'దయచేసి నన్ను మన్నించండి'.. ఆ కాలేజీ గోడలపై ఓ ప్రేమికుడి పోస్టర్లు
Apology Posters on Women’s College walls

ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమలో మునిగిపోయిన ఓ యువకుడు.. కాలేజీని వ్యక్తిగత వేదికగా మార్చుకున్నాడు. అతడు తన ప్రియురాలిని క్షమాపణ కోరే ప్రయత్నంలో భాగంగా బీఎస్ఎస్ మహిళా కళాశాల గేట్లు, గోడలపై వరుసగా క్షమాపణ పోస్టర్లను అంటించాడు. ఇది గమనించిన అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఒకరు ఆ పోస్టర్లను తొలగించేందుకు యత్నించగా.. అతడిని బెదిరించినట్లు సమాచారం.


సదరు యువకుడు కాలేజీ గోడలను తన క్షమాపణలతో కూడిన పోస్టర్లతో నింపేసినట్టు తెలుస్తోంది. 'నన్ను క్షమించు డింపీ. నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించు. ఇలాంటివి మరలా జరగకుండా చూసుకుంటాను. నువ్వు నాకు చాలా ముఖ్యం' అనే సందేశంతో పోస్టర్లు అతికించినట్టు సమాచారం. మహిళా కళాశాల గోడలపై ఈ పోస్టర్లు వెలుగుచూడటంతో.. అక్కడి విద్యార్థినిల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. ఈ ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత, విస్తృత చర్చకు దారితీసింది.


సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టర్ల ఫొటోలలో.. ఆ వ్యక్తి తన తప్పును బహిరంగంగా అంగీకరిస్తూ, తన ప్రియురాలిని క్షమించమని కోరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సదరు కళాశాల ప్రిన్సిపాల్ డా.కరుణ స్పందించారు. 'పోస్టర్ల విషయం మా దృష్టికి రాగానే వాటిని తొలగించేందుకు సెక్యూరిటీ గార్డును పంపాం. కానీ ఆ వ్యక్తి అతడిని బెదిరించినట్టు తెలిసింది. వెంటనే మేము అక్కడికి వెళ్లాం. అప్పటికే ఆ వ్యక్తి పారిపోయాడు. తర్వాత వెంటనే ఆ పోస్టర్లను తొలగించాం' అని చెప్పారు. అనంతరం.. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని స్థానిక డీసీపీని కోరినట్టు ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.


ఇవీ చదవండి:

ఇలాంటి వింతలు కూడా ఉంటాయా.. ఈ రైలు వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

హెల్మెట్‌ను ఇలాక్కూడా వాడొచ్చు.. ఇతడి తెలివి చూస్తే..

Updated Date - Apr 10 , 2026 | 09:27 AM