Child Silent Boycott: నా బిడ్డను వెలేశారు.. ఓ తండ్రి పోస్టు నెట్టింట వైరల్
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:50 AM
తన బిడ్డను సాటి చిన్నారులే వెలివేశారంటూ ఓ సంస్థ సీఈఓ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తన బిడ్డను తోటి చిన్నారులు వెలేశారంటూ ఓ తండ్రి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో తెలిసి జనాలు షాకయిపోతున్నారు. చిన్నతనంలోనే మనసులు కలుషితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు (Child Silent Boycott Incident Goes Viral).
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ సంస్థకు సీఈఓగా ఉన్న గౌరవ్ క్షేత్రపాల్ ఈ పోస్టును పెట్టారు. తన కొడుకును వీధిలోని ఇతర చిన్నారులు సడన్‌గా దూరం పెట్టారని చెప్పారు. ఆటలు ఆడుకునేందుకు పిలవడం మానేశారని అన్నారు. పని మనిషి కొడుకుతో తన బిడ్డ ఆటలు ఆడటం చూశాక వారి ధోరణి ఒక్కసారిగా మారిపోయిందని అన్నారు. ఆ బాలుడి తండ్రి నేపాలీ అని చెప్పారు. అతడు తమ ప్రాంతంలోనే ఓ ఇంట్లో సహాయకుడిగా పని చేస్తున్నాడని అన్నారు. అతడి కొడుకుతో తన బిడ్ద ఫుట్‌బాల్ ఆడటం చూశాక ఇతర బాలురు సైలెంట్ బాయ్‌కాట్‌కు తెరతీశారని చెప్పారు.
బయటకు ఎవరూ ఏమీ అనకుండానే ఇదంతా జరుగుతోందని చెప్పారు. తన వీధిలోని వారంతా బడా వ్యాపారస్తులని, లగ్జరీ కార్లు, భవనాల్లో ఉంటారని అన్నారు. పనిమనుషుల పిల్లలతో ఆడుకోవడం తమ స్థాయికి తగదనే భావన వారిలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ అంతరాలు చిన్నారుల మనసులనూ కలుషితం చేస్తున్నాయని, ఎవరూ ఏమీ చెప్పకుండానే పెద్దలను చూసి చిన్నారులు తప్పుడు మార్గాల్లో వెళుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కుల వివక్షను అధిగమించినా ఈ అల్ప స్వభావాలను అధిగమించగలమా? అని ప్రశ్నించారు.
ఈ ఉదంతంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సామాజిక అంతరాల గురించి ఎవరూ చెప్పకుండానే పెద్దల నుంచి చిన్నారులకు చేరుతున్నాయని జనాలు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దలు కొందరితో కలుపుగోలుగా, మరికొందరితో అంటీముట్టనట్టుగా ఉండటం చూసిన పిల్లలు కూడా పేద-ధనిక తారతమ్యాలను తలకెక్కించుకుని తప్పుదారి పడుతున్నారని చెప్పారు. కుల వివక్ష గురించి చర్చ జరుగుతున్నా ఆర్థిక స్థితిగతుల కారణంగా ఎదుర్కునే వర్గ వివక్ష గురించి మాత్రం ఆశించిన స్థాయిలో చర్చ జరగట్లేదని తెలిపారు. ఫలితంగా ఈ అసమానతలు, వెలివేతలు చడీచప్పుడు లేకుండా చిన్నారుల మనసులను కలుషితం చేస్తున్నాయని అన్నారు. విద్య వల్ల అసమానతలు తొలగిపోతాయన్న భావన పూర్తిగా సరికాదన్న విషయం ఈ ఉదంతం రుజువు చేసిందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
వందే భారత్ స్లీపర్‌లో షాకింగ్ సీన్.. మీరెందుకు మారరు బ్రో?
వావ్.. సైకిల్ తొక్కడం నేర్పిస్తూ లక్షల్లో సంపాదన! భలే ఐడియా బ్రో..