Litter in Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్‌లో షాకింగ్ సీన్.. మీరెందుకు మారరు బ్రో?
ABN , Publish Date - Jan 20 , 2026 | 08:44 AM
వందేభారత్ స్లీపర్ సర్వీసు ప్రారంభమైన మొదటి రోజునే ప్రయాణికులు కొందరు రైల్లో చెత్త పారేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఉదంతంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అత్యాధునిక హంగులతో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమై ఒక్క రోజు కూడా గడవక ముందే జనాలు తమ పాత బుద్ధిని బయటపెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రైల్లోని దృశ్యం చూసి నెట్టింట జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు (Litter in VandeBharat Sleeper).
Indianinfoguide అనే ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియో కలకలం రేపుతోంది. వందే భారత్ స్లీపర్ రైల్లో బెర్తుల కింద వాడిపారేసిన ప్లాస్టిక్ కప్స్, స్పూన్స్ ఉండటాన్ని రికార్డు చేసిన ఓ ప్యాసెంజర్ నెట్టింట పంచుకున్నారు. కొత్త రైలని కూడా చూడకుండా ఇష్టారీతిన వ్యవహరించిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కనీస పౌర స్పృహ లేనప్పుడు ఎంతటి ప్రపంచస్థాయి మౌలిక వసతుల నిర్వహణ అయినా కష్టంగా మారుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎలా ఉండాలో తెలియడమే సివిక్ సెన్స్. పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి పిల్లలకు పౌర స్పృహను నేర్పించాలి. లేకపోతే ఈ సమస్య తరతరాలుగా పట్టి పీడిస్తూనే ఉంటుంది’ అని సదరు ప్యాసెంజర్ పోస్టు పెట్టారు.
కాగా, ఈ వీడియోపై రైల్వే శాఖ కూడా దృష్టిసారించింది. రైళ్లు, రైల్వే పరిసరాలు శుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, అది పౌరుల సమిష్టి బాధ్యత అని గుర్తు చేసింది. ఇలాంటిది జరిగే అవకాశం ఉందని రైల్వే శాఖ ముందే ఊహించింది. కనీస మర్యాదలు తెలిసిన వారే ఈ రైలు ఎక్కాలంటూ రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు వందేభారత్ స్లీపర్ ప్రారంభానికి ముందే సెటైరికల్‌గా హెచ్చరించారు. ప్రజల ఆస్తులను గౌరవించాలని అన్నారు. కానీ, అందరూ ఊహించినట్టుగానే జరగడంతో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
వావ్.. సైకిల్ తొక్కడం నేర్పిస్తూ లక్షల్లో సంపాదన! భలే ఐడియా బ్రో..
విమానంలో అంకుల్ చేసిన పని.. నెట్టింట వైరల్