China Student Unique Business: వావ్.. సైకిల్ తొక్కడం నేర్పిస్తూ లక్షల్లో సంపాదన! భలే ఐడియా బ్రో..
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:06 PM
జనాలకు సైకిల్ తొక్కడం నేర్పిస్తూ లక్షలు ఆర్జిస్తున్న ఓ చైనా స్టూడెంట్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అసలు అతడికి ఈ ఐడియా ఎలా వచ్చిందో, ఇప్పటివరకూ ఎంత సంపాదించాడో తెలుసుకుందాం పదండి!
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది చిన్నతనంలో సైకిళ్లపై దూసుకుపోతూ తెగ ఎంజాయ్ చేసే ఉంటారు. బాల్యం మిగిల్చే అనేక తీపి గుర్తుల్లో ఇదీ ఒకటి. కానీ అందరికీ ఈ అదృష్టం ఉండదు. చివరకు ఇదో వెలితిగా మారి, పెద్దయ్యాక కూడా వేధిస్తుంటుంది. సరిగ్గా ఇలాంటి వారిని టార్గెట్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నాడో చైనా యువకుడు (China Student Gives Bicycle riding lessons, Earns in Lakhs).
చైనా మీడియా కథనాల ప్రకారం, లీ అనే విద్యార్థి జనాలకు సైకిళ్లు తొక్కడాన్ని నేర్పిస్తూ లక్షలు ఆర్జిస్తున్నాడు. అతడు ప్రస్తుతం షాంఘాయ్ యూనివర్సిటీ ఆఫ్ స్పోర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. తన చుట్టూ ఉండే అనేక మందికి సైకిల్ తొక్కడం రాదన్న విషయాన్ని చాలా ఏళ్ల క్రితమే లీ తోపాటు అతడి స్నేహితుడు గుర్తించారు. దీన్ని ఓ వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు. అయితే, వారి భాగస్వామ్యం మాత్రం ఎక్కువ కాలం నిలవలేదు. లీ స్నేహితుడికి మరో మంచి ఉద్యోగం రావడంతో అతడు తప్పుకున్నాడు. లీ మాత్రం యథాప్రకారం ఈ వ్యాపారాన్ని కొనసాగించాడు.
మొదట్లో పరిచయస్తుల ద్వారా లీ వద్దకు కస్టమర్లు వచ్చే వారు. లీ అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో కూడా యాడ్స్ ఇస్తూ తన బిజినెస్‌ను విస్తరించాడు. దీంతో, సైకిల్ నేర్చుకునేందుకు వచ్చే వారి సంఖ్య ఊహించనంతగా పెరిగింది. రాబడి కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందింది.
కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి అతడు సైకిల్ తొక్కడాన్ని నేర్పిస్తాడు. ఇందుకోసం అతడు రూ.10 వేల (మనకరెన్సీలో చెప్పుకోవాలంటే..) వరకూ కస్టమర్ల నుంచి తీసుకుంటాడు. ఇంత మొత్తం ఇచ్చే వారికి సైకిల్ వచ్చే దాకా వెంటే ఉండి నేర్పిస్తాడు. ఇలాంటి కస్టమర్ల సంఖ్య ఎక్కువగానే ఉండటంతో అతడి ఆదాయానికి ఢోకా లేకుండా పోయింది. గత రెండేళ్లల్లో సుమారు 700 మందికి సైకిల్ తొక్కడాన్ని నేర్పించినట్టు అతడు చెప్పుకొచ్చాడు. వీరిలో టీనేజర్ల నుంచి 68 ఏళ్ల వయసున్న వారి వరకూ ఉన్నారని చెప్పాడు. తన కస్టమర్లలో 70 శాతం మంది 20 ఏళ్లు, 30 ఏళ్లల్లో ఉన్న మహిళలే అని కూడా తెలిపాడు. అసలు సైకిల్ తొక్కడం నేర్చుకునేందుకు ఇంత మంది ఆసక్తి చూపిస్తారని కూడా తాను మొదట్లో ఊహించలేదని అన్నాడు. ఈ రెండేళ్లల్లో లీ దాదాపు రూ.35 లక్షలు సంపాదించాడు.
ఈ జూన్‌లో అతడి చదువు పూర్తవుతుంది. ఆ తరువాత కూడా ఈ సర్వీసును కొనసాగిస్తానని, మరింతగా విస్తరిస్తానని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో, లీ ప్రస్తుతం చైనాతో పాటు సోషల్ మీడియాలో కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు.
ఇవీ చదవండి:
అర్ధరాత్రి మహిళకు షాకింగ్ అనుభవం! ఛాతిపై ఏదో ఉన్నట్టు అనిపించి చూస్తే..
హనుమాన్ విగ్రహం చుట్టూ శునకం ప్రదక్షిణలు! 36 గంటల పాటు..