Share News

వృద్ధాశ్రమంలో దారుణం.. వృద్ధ మహిళలపై 14 ఏళ్ల బాలుడి దాడి

ABN , Publish Date - Jul 30 , 2026 | 04:44 PM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వృద్ధాశ్రమంలో చోటుచేసుకున్న దాడి కలకలం రేపింది. 14 ఏళ్ల బాలుడు వృద్ధ మహిళలను కర్రతో కొట్టిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వృద్ధాశ్రమంలో దారుణం.. వృద్ధ మహిళలపై 14 ఏళ్ల బాలుడి దాడి
Elderly Women Assault

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వృద్ధాశ్రమంలో చోటుచేసుకున్న దాడి ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల బాలుడు వృద్ధ మహిళలను కర్రతో కొట్టిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇండోర్‌లోని మేరిమాత నీటి ట్యాంక్ సమీపంలోని మహారాణా ప్రతాప్ వెల్ఫేర్ సొసైటీ వృద్ధాశ్రమంలో ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధ మహిళలపై బాలుడు కర్రతో దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియో వెలుగులోకి రావడంతో బాణగంగ పోలీసులు కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధాశ్రమం నిర్వాహకురాలిని విచారించి సూచనలు ఇచ్చిన అనంతరం విడుదల చేశారు.


ఈ ఘటనపై స్పందించిన ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ..‘వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసేందుకు ఎస్‌డిఎం, తహసీల్దార్‌ వెళ్లారు. అక్కడ నివసిస్తున్న 30 మంది వృద్ధుల్లో ఆరోగ్యంగా ఉన్నవారిని గాంధీనగర్ నిరాశ్రిత్ ఆశ్రమం, గణేష్ వృద్ధాశ్రమాలకు తరలించారు. అనారోగ్యంతో ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తాం. వృద్ధాశ్రమాన్ని సీల్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.’ అని అన్నారు. మరోవైపు పోలీసుల విచారణలో బాలుడి మానసిక పరిస్థితి స్థిరంగా లేదని తేలింది. ఐదు నెలల క్రితం తల్లితో కలిసి వృద్ధాశ్రమానికి వచ్చిన బాలుడి తల్లి.. కాలిన గాయాలతో కొద్ది రోజులకే మృతి చెందింది. బుధవారం ఒక వృద్ధురాలితో వాగ్వాదం అనంతరం ఆమెపై కర్రతో దాడి చేశాడని, అడ్డుకునేందుకు వచ్చిన ఓ మహిళపై దూకుడుగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం బాలుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

Read Latest Telangana News And National News

Updated Date - Jul 30 , 2026 | 06:19 PM