Share News

ఆఫర్లున్నా కదలరు...ఉద్యోగం వదలరు!

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:41 AM

‘జాబ్‌ హాపింగ్‌’... అంటే శాలరీ హైక్‌ కోసం తరచూ ఉద్యోగాలు మారడం... ‘జాబ్‌ హగ్గింగ్‌’... అంటే చేస్తున్న ఉద్యోగమే సేఫ్‌ అని, దాన్నే అంటిపెట్టుకొని ఉండటం... శాలరీ హైక్‌ కోసం తరచూ ఉద్యోగాలు మారే అలవాటుకు నవతరం తాత్కాలిక విరామం ప్రకటించేసింది.

ఆఫర్లున్నా కదలరు...ఉద్యోగం వదలరు!

‘జాబ్‌ హాపింగ్‌’... అంటే శాలరీ హైక్‌ కోసం తరచూ ఉద్యోగాలు మారడం...

‘జాబ్‌ హగ్గింగ్‌’... అంటే చేస్తున్న ఉద్యోగమే సేఫ్‌

అని, దాన్నే అంటిపెట్టుకొని ఉండటం...

శాలరీ హైక్‌ కోసం తరచూ ఉద్యోగాలు మారే అలవాటుకు నవతరం తాత్కాలిక విరామం ప్రకటించేసింది. బెంగళూరు ఐటీ క్యూబికల్స్‌ నుంచి హైదరాబాద్‌ పార్టీషన్‌ డెస్కుల దాకా... చెన్నై ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ నుంచి కేరళ ప్రభుత్వ సంస్థల సౌధాలదాకా ఇదే ఽధోరణి. కృత్రిమ మేధ (ఏఐ) ఆటోమేషన్‌, గిగ్‌ ఎకానమీ బర్నవుట్‌, కరోనా అనంతర లేఆఫ్‌ల మధ్య... అందరూ ‘సేఫ్‌గేమ్‌’ ఎంచుకుంటున్నారు. ఈ నయా ధోరణిపైనే ఈవారం కవర్‌స్టోరీ.

పాతికేళ్ల సాఫ్ట్‌వేర్‌ టెస్టర్‌ ప్రియంవదకు ఓ స్టార్టప్‌ సంస్థలో ఆఫర్‌ వచ్చింది. అందులో చేరడం రిస్కు అనుకుని, ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. ‘ఎంట్రీ లెవెల్‌ జాబ్స్‌ అన్నింటినీ ఏఐ మింగేస్తోంది. యూనికార్న్‌ (బిలియన్‌ డాలర్ల విలువ కలిగి, ఇంకా స్టాక్‌మార్కెట్లో లిస్టవ్వని ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ)ల వెంటబడటం కన్నా... ఉన్న జాబ్‌తోనే తృప్తిపడటం బెటర్‌’ అని భావించి మిడ్‌ లెవెల్‌ క్వాలిటీ అనలిస్ట్‌గా తన ఐటీ కంపెనీని వదలిపోలేదు.

- - - -


29 ఏళ్ల రాజీవ్‌ ఓ ఐటీ ఉద్యోగి. జీతం తక్కువ, పని ఒత్తిడి ఎక్కువ. అసంతృప్తితో గతేడాదే ఉద్యోగం వదిలెయ్యాలని అనుకున్నాడు. ఇంతలో ప్రపంచవ్యాప్తంగా టెక్‌ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం మొదలైంది. చూస్తుండగానే మిత్రులిద్దరు పింక్‌ స్లిప్‌లు అందుకున్నారు. ‘ఉన్న ఉద్యోగం వదలడం రిస్క్‌. కొంతకాలం ఇక్కడే కొనసాగడం మంచిది’ అని గ్రహించి తన నిర్ణయం మార్చుకున్నాడు.

- - - -

వీళ్లిద్దరే కాదు.. నవతరం ఇప్పుడు పాటిస్తున్నది ‘స్టే సేఫ్‌’ వ్యూహం. ‘చేతిలో ఉన్న ఒక పక్షి... పొదలో ఉన్న రెండు పక్షుల కన్నా విలువైనది’ అనే ఎరుక!

అంటే.. తన ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్నా, జీతం పెరగకపోయినా... చేస్తున్న ఉద్యోగాన్ని వదలకుండా ఉండటం. ప్రత్యేకంగా దక్షిణాదిలో... అంటే బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, కొచ్చి లాంటి నగరాల్లో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.


book6.2.jpgఆఫర్‌ లెటర్లు... హైక్‌ డిమాండ్లు...

కొన్నేళ్ల క్రితం ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఉద్యోగులు తరచూ కంపెనీ మారేవారు. నాలుగైదు ఆఫర్‌ లెటర్స్‌లో ఏది ఎంచుకోవాలన్న సందేహం... ‘ప్రస్తుత జీతానికి 100 శాతం హైక్‌ ఇస్తేనే చేరతా’ననే డిమాండ్‌! ఒక సంస్థను వదిలేసి, మరో దగ్గర ఇట్టే చేరిపోవడం మామూలు విషయంలా ఉండేది. ‘గ్రేట్‌ రిజిగ్నేషన్‌’, ‘క్వయట్‌ క్విట్టింగ్‌’ లాంటి మాటలు జాబ్‌ మార్కెట్లో, టెకీస్‌ సంభాషణల్లో తరచూ వినిపించేవి. టాప్‌ టైర్‌ ఐటీ సంస్థల్లో ఉద్యోగుల అట్రిషన్‌ (ఉద్యోగుల సంఖ్యలో క్షీణత) రేటు 25 శాతం దగ్గర కొట్టుమిట్టాడేది. అయితే ఇప్పుడా సంఖ్య 15 కన్నా తక్కువకు పడిపోయింది. విచిత్రం ఏమిటంటే...ఈ దశాబ్దంలోనే అతి కనిష్ఠం ఇది.


ఏఐ విజృంభణ

అన్ని రంగాల్లోకీ చొచ్చుకువస్తున్న ‘ఏఐ’ మూలంగా 2030 నాటికి దేశంలోని 1.20 కోట్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడబోతోందని ‘మెకిన్సే’ అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ‘వైట్‌ కాలర్‌’ కొలువుల ఉనికికి ప్రమాదం ఏర్పడవచ్చు. అందుకే ‘జాబ్‌ హగ్గింగ్‌ అనేది మనుగడ వ్యూహం’ అంటారు కెరీర్‌ కోచ్‌ అర్జున్‌ మీనన్‌. ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సా్‌ఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌’ (నాస్‌కామ్‌) 2026 అంచనా ప్రకారం... 45 శాతం ఉద్యోగాలను ఏఐ సమూలంగా మార్చేస్తుంది. అధిక ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుతున్నాయి. మరోపక్క చివరిగా చేరినవారిని మొదట తొలగించే పరిస్థితి (‘లాస్ట్‌ ఇన్‌- ఫస్ట్‌ ఔట్‌’- లిఫో) వస్తుందనే భయం వల్ల రాజీనామా కన్నా రాజీపడి ఉండటమే సురక్షితమని ఉద్యోగులు భావిస్తున్నారు.


book6.3.jpgవివిధ రంగాల్లో..

- బెంగళూరు టెక్‌: ‘టీమ్‌ లీజ్‌’ సర్వే ప్రకారం... 2025లో 40 శాతం ఐటీ ప్రొఫెషనల్స్‌ ఉద్యోగం మారే ఆలోచనలు పక్కనపెట్టారు. ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం’ అంచనా వేసినట్లు... గిట్‌హబ్‌ కోపైలట్‌ లాంటి ఏఐ టూల్స్‌ మూస కోడింగ్‌ను 30 శాతం వరకూ ఆటోమేట్‌ చేస్తాయనే ఆందోళన వీరిని వేధిస్తోంది.

  • చెన్నై మాన్యుఫాక్చరింగ్‌: హ్యుందాయ్‌ లాంటి ఆటో దిగ్గజ సంస్థలు కనిష్ఠ అట్రిషన్‌ రేటును నమోదు చేశాయి. నీతి ఆయోగ్‌ అంచనా ప్రకారం... ఎలకా్ట్రనిక్‌ వెహికల్స్‌ (ఈవీలు) వల్ల 2027కల్లా 2 లక్షల ఉద్యోగాలు కనుమరుగవుతాయి. ఈ భయంతోనే ఉద్యోగులు ఇతర అవకాశాలవైపు చూడటం లేదు.


  • హైదరాబాద్‌ ఫార్మా: ఎంప్లాయీ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ (ఈఎస్‌ఓపీ), పింఛన్ల లాంటి ప్రయోజనాల నిమిత్తం 25 శాతం వేతన వృద్ధిని వదులుకుంటున్నందున ‘హగ్గర్లు’ తమ స్థానాల్లోనే ఉండిపోతారని లైఫ్‌ సైన్సెస్‌ సంస్థలు భావిస్తున్నాయి.

  • కేరళ పీఎస్‌యూలు: కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు సాధించడానికి, కేరళలోని పట్టభద్రుల్లో 70 శాతం మంది ప్రయత్నిస్తున్నారు. అస్థిరమైన కెరీర్‌తో ప్రైవేటు రంగంలో ఇబ్బందిపడేకన్నా జీవిత కాలపు ఉద్యోగ భద్రతనిచ్చే ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం వివేకమనేది వీరి ఆలోచన.


book6.4.jpgఎందుకని పెరుగుతోంది?

ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం, అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, కొత్త అవకాశాలపై జాగ్రత్త.. అనేవి జాబ్‌ హగ్గింగ్‌కు ప్రధానంగా కారణమవుతున్నాయి.

  • టెక్‌ లే ఆఫ్స్‌ ప్రభావం: 2023-25 సంవత్సరాల మధ్య టెక్‌ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యోగాలను తగ్గించాయి. హైదరాబాద్‌, బెంగళూరు లాంటి ఐటీ నగరాల్లో యువత ఈ పరిణామాలను చాలా దగ్గరగా చూసింది. ‘లింక్డిన్‌’ ఓపెన్‌ చేస్తే అన్నీ లేఆఫ్‌ కథనాలే ఉంటాయి. జాబ్‌ మారాలనే ఉత్సాహమే తగ్గిపోయింది’ అంటూ ఓ ఐటీ ప్రొఫెషనల్‌ నిరుత్సాహంగా చెప్పాడు.

  • ఈఎంఐ జీవితం: దేశవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాల్లో చేరగానే గృహరుణం, కారు లోను తీసుకుంటున్నారు. పిల్లల స్కూలు ఫీజు, కుటుంబ అవసరాల వల్ల వ్యక్తిగత రుణమూ తీసుకోవాల్సి వస్తోంది. దీంతో నెల వేతనంలో పెద్ద మొత్తం ‘ఈఎంఐ’లకే సరిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం మారటం అంటే రిస్క్‌ అవుతుంది.


  • స్టార్టప్‌ కల్చర్‌లో మార్పు: కొన్నేళ్ల క్రితం ఔత్సాహికులు స్టార్టప్‌ సంస్థల్లో చేరటానికి ఆసక్తి చూపేవారు. కొత్త సాంకేతికత, బహుళ విభాగాల్లో పని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని భావించేవారు. కానీ ప్రస్తుతం స్టార్టప్‌లలో స్థిరత్వం తక్కువనే భావనకు వస్తున్నారు. పనిచేస్తున్న కంపెనీల్లోనే కొనసాగాలనుకుంటున్నారు.


book6.jpgకరోనా సంక్షోభం... ఒక కారణం...

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనాతో ఆఫీసుల మూత, సుదీర్ఘ లాక్‌డౌన్లు... ఉద్యోగుల ఆలోచనా ఽధోరణిలో మార్పు తెచ్చాయి. స్థిరత్వం చాలా ముఖ్యమైనదనే పాఠం నేర్పించింది. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయిన చేదు అనుభవం చాలామందిని మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేసింది. ‘జాబ్‌ హగ్గింగ్‌’లో ఆర్థిక భద్రత, కుటుంబానికి భరోసా, రిస్క్‌ తక్కువ. అయితే మరో కోణంలో ఈ ఆలోచన కెరీర్‌ ఎదుగుదల మందగించేలా చేస్తుంది. ఉద్యోగ సంతృప్తి, సృజనాత్మకత, ప్రేరణలు తగ్గిపోవచ్చు. కొత్త అవకాశాలను కోల్పోవచ్చు. ఇవి ప్రతికూల అంశాలుగా చెప్పవచ్చు. జాబ్‌ హగ్గింగ్‌ ఎక్కువకాలం కొనసాగితే వృత్తిపరమైన ఎదుగుదల మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా.


కంపెనీలు కూడా ఈ అనూహ్య మార్పును గమనిస్తున్నాయి. అట్రిషన్‌ రేటు తగ్గటం వాటికి సంతోషకరమైన అంశమే అయినప్పటికీ... జాబ్‌ హగ్గింగ్‌ వల్ల పూర్తిస్థాయిలో పనిచేసే ఉత్సాహం ఉద్యోగుల్లో ఉండదేమోననే ఆందోళన లేకపోలేదు. అందుకే ఉద్యోగుల సంక్షేమంపై, నైపుణ్యాభివృద్ధిపై, ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ కల్చర్‌పై వివిధ సంస్థలు దృష్టి పెడుతున్నాయి.

తల్లిదండ్రుల ఆకాంక్షలు

ఉద్యోగంలో దీర్ఘకాలం కొనసాగే విధేయతకు మన కుటుంబ వ్యవస్థ మూలాలతో సంబంధం ఉందంటున్నారు సామాజికవేత్తలు. మన యువతకు బంధుగణం నుంచీ, పరిచితుల నుంచీ తరచూ ఎదురయ్యే ప్రశ్న ‘సెటిలయ్యావా?’ అని. అంటే... ఫ్లాటూ, కారూ లాంటివే కాకుండా పెళ్లిళ్లు, లాంఛనాలు, పెద్దల సంరక్షణ లాంటివి నెరవేర్చే స్థిరమైన ‘ఫ్యాట్‌ పే ప్యాక్‌’ ఉద్యోగంలో ఉండటమన్నమాట. ఐఐటీ మద్రాస్‌ 2025 అధ్యయనం ప్రకారం... దేశంలో 35 శాతం యువత తమ ఉద్యోగాలను అంటిపెట్టుకుని ఉండటానికి తల్లిదండ్రుల ఆకాంక్షలే ప్రధాన కారణమని తెలుస్తోంది.


  • గల్ఫ్‌దేశాల్లో ఉద్యోగాలు ముగించుకుని, తిరిగివస్తున్న కేరళం వలస కార్మికులు తాము గతంలో పనిచేసిన స్థానిక నర్సు, టీచర్‌ ఉద్యోగాల్లోనే తిరిగి చేరిపోతున్నారు.

  • కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ర్టీ (సీఐఐ) గణాంకాల ప్రకారం... హైదరాబాద్‌లో మధ్యతరగతి యువత భారీ ప్రాజెక్టులు చేపట్టే స్టార్టప్‌ల కన్నా సురక్షితమైన బహుళజాతి సంస్థల వైపే మొగ్గుచూపుతోంది.

  • 62 శాతం మంది మహిళా వృత్తి నిపుణులు ఉద్యోగ మార్పుల కన్నా... పని, జీవిత సమతుల్యతకే ప్రాధాన్యం ఇస్తున్నారని ‘మాన్‌స్టర్‌ ఇండియా పోల్‌’ తెలిపింది. కెరీర్‌తో పాటు ఇంటి బాధ్యతలను కూడా వారు సమన్వయం చేసుకుంటున్నారు.


స్తబ్ధతా? చురుకైన వ్యూహమా??

‘అశోక్‌ లేలాండ్‌’ సంస్థలో మిడ్‌ మేనేజర్‌ హోదాలో ఉన్న వెంకటేష్‌ తన ఉద్యోగం వదిలేయలేదు. ఈవీ ఆర్‌ అండ్‌ డీకి దారితీసేలా అంతర్గతంగా తన స్కిల్స్‌ పెంచుకున్నాడు. ‘కెరీర్‌లో నా వ్యూహం మార్చుకోవడానికి జాబ్‌ హగ్గింగ్‌ తగిన సమయాన్ని ఇచ్చింది’ అంటారాయన. ‘జాబ్‌ హగ్గింగ్‌’లో ప్రతికూల అంశాలూ లేకపోలేదు. నైపుణ్యాలు తగ్గిపోవడం వల్ల దీర్ఘకాలంలో చూస్తే... 18 శాతం తక్కువ సంపాదిస్తున్నారు (లింక్డిన్‌ ఎకనామిక్‌ గ్రాఫ్‌- 2025). ‘వాళ్లు జాబ్స్‌ను వదిలెయ్యడం లేదు సరే, తమకిష్టమైన కెరీర్‌ కలలూ, ఆకాంక్షలను మాత్రం వదిలేస్తున్నారు. ఫలితంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు’ అంటూ థెరపిస్టులు చెప్తున్నారు.


భవిష్యత్తులో ఏమవుతుంది?

విశ్లేషకుల అంచనా ప్రకారం... ఆర్థిక వ్యవస్థ మెరుగైతే ‘జాబ్‌ హగ్గింగ్‌’ క్రమంగా తగ్గిపోవచ్చు. కానీ ఉద్యోగ భద్రతపై అవగాహన, అప్రమత్తత అలాగే కొనసాగుతాయి. అంటే రాబోయే రోజుల్లో ఉద్యోగులు మరింత సమతుల్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని పట్టుకుని ఉండటం తప్పేమీ కాదు. అయితే ఎదుగుదలను వదిలేస్తేనే ప్రమాదకరం. ఈ సూక్ష్మాన్ని గ్రహించిన నవతరం ఉద్యోగుల్లో కొత్త భావన కనిపిస్తోంది. అది జాబ్‌ ఛేంజ్‌ కాదు... స్కిల్‌ ఛేంజ్‌. అంటే ఉద్యోగం వదిలెయ్యకుండా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సైడ్‌ ప్రాజెక్టులు చేయడం, ఫ్రీలాన్సింగ్‌ ప్రారంభించడం. ఈ విధంగా కెరీర్‌ను విస్తరించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు.


ఉద్యోగ మార్కెట్లోని అనిశ్చిత పరిస్థితులకు ఉద్యోగుల నుంచి వస్తున్న ప్రతిస్పందనే ఈ ‘జాబ్‌ హగ్గింగ్‌’. ఇది ఒకరకంగా సురక్షితమైన మనుగడ తంత్రం కావొచ్చు. దానికి భిన్నంగా కుతూహలాన్నీ, నవ కల్పనల ఉత్సాహాన్నీ చంపి... యథాతథ స్థితిలో ఉంచే ఉచ్చు (స్టేటస్‌ కో ట్రాప్‌ ) కూడా కావొచ్చు. అందుకే ఉన్న కొలువులో కొనసాగాలా? వేరే కొత్త అవకాశాన్ని ఒడిసిపట్టాలా? అనేది ఎవరికి వారు తమ వ్యక్తిగత, వృత్తిగత పరిస్థితులను బట్టి తేల్చుకోవాల్సిన విషయం. కేవలం భయంతో కాకుండా... అనుకూల ప్రతికూలతలను బేరీజు వేసుకున్నాకే నిర్ణయం తీసుకోవడం సముచితం!

- సండే డెస్క్‌


సమూల మార్పులకు సిద్ధమా?

book6.7.jpg‘‘ఉద్యోగ మార్కెట్‌ను ఏఐ పునర్నిర్మిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్‌ నిపుణులు సమూల మార్పులకు సిద్ధంగా ఉండాలి. ఏఐ నుంచి ఏ ఉద్యోగమూ (నా పోస్టు కూడా) పూర్తిగా సురక్షితం కాదు. దీనికి అనుగుణంగా మారలేనివారే మొదట దెబ్బతింటారు. కలలను అనుసరించడం, ఉత్సుకతను ఇచ్చే పని చేయడం చాలా ముఖ్యమని భావిస్తున్నా. మనసుకు నచ్చినది చేస్తే ఎల్లప్పుడూ మరింత మెరుగ్గా రాణిస్తారు’’

- సుందర్‌ పిచాయ్‌, గూగుల్‌ సీఈఓ


‘జాబ్‌ హగ్గర్స్‌’ ఏమంటున్నారు?

‘ఓ స్టార్టప్‌ సంస్థలో నాకు చక్కని ఆఫర్‌ వచ్చింది. జీతం ఎక్కువే. కొత్త సహచరులతో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. కానీ లే ఆఫ్స్‌ తీరు చూశాక ఇక జాబ్‌ మారదామనిపించలేదు’

- రాకేష్‌, బెంగళూర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌


‘ప్రమోషన్‌ ఆలస్యం అవుతోంది. ఫీల్డ్‌ మారితే బెటర్‌ అనుకున్నా. కానీ బ్యాంకు ఉద్యోగంలో ఎంత కాదనుకున్నా స్థిరత్వం ఉంది. అందుకే ఈ ఉద్యోగం, రంగం మారే ఆలోచనలు వదులుకున్నా’.

- సుస్మిత, బ్యాంకు ఉద్యోగిని, చెన్నై

మరో కంపెనీకి వెళ్దామనుకున్నా. కానీ కట్టాల్సిన ఈఎంఐలు నన్ను పునరాలోచనలో పడేశాయి. ఈ పరిస్థితుల్లో రిస్కు తీసుకోవడం కష్టం’

- శశిధర్‌, మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌, హైదరాబాద్‌


ఈ వార్తలు కూడా చదవండి:

మావిగన్‌.. మారీచ!

సీఎస్ఆర్‌ ఫండ్‌ పెరగాలి!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 05 , 2026 | 11:45 AM