గిరిజనంలోకి ... ‘సంజీవని’
ABN , Publish Date - Apr 05 , 2026 | 10:03 AM
‘చిత్రకొండ’ను ప్రకృతి వరం పొందిన ప్రాంతం అంటారు. కొండల మధ్య పచ్చల హారంలా మెరిసే ఈ ప్రాంతంలో ఒక సమస్య ఉంది.
‘చిత్రకొండ’ను ప్రకృతి వరం పొందిన ప్రాంతం అంటారు. కొండల మధ్య పచ్చల హారంలా మెరిసే ఈ ప్రాంతంలో ఒక సమస్య ఉంది. ‘అడవి మాకు అన్నీ ఇచ్చింది కానీ, ఒక్క ప్రాథమిక వైద్యకేంద్రం కూడా లేదు. రోగాలు వస్తే చూసే దిక్కు లేదు..’ అంటారు ఇక్కడి గిరిజనులు ఆందోళనగా.
మంచానికే పరిమితమైన నారీ మజి అనే వృద్ధురాలు బీపీ, షుగర్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే సమీపంలో చిన్న క్లినిక్ కూడా లేదు. ఇంకోచోట పదేళ్ల బాలిక తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ బడి మానేసింది. రతానీ జానీ అనే మహిళ కూలీకి వెళ్తేనే పూట గడుస్తుంది. ఆమె అనారోగ్యం బారిన పడటంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇలా అనేకమంది గిరిజనులు సరైన వైద్యం అందక, ఆసుపత్రికి వెళ్లలేక అవస్థలు పడేవారు. అయితే అది గతం. ప్రస్తుతం వాళ్ల ఇబ్బందులన్నింటికీ చెక్ పెడుతూ, ఇళ్ల దగ్గరకే మొబైల్ ఆసుపత్రి కదిలి వస్తోంది. ఒడిశాలోని 80 గిరిజన గ్రామాల్లో ఈ మార్పు ఎలా సాధ్యం అయ్యిందంటే...
క్లినిక్ ఆన్ వీల్స్...
అడవులు, లోయలు, గుట్టల మధ్య, దారి కూడా సరిగ్గా లేని మారుమూల మన్యంలో ఎవరికైనా జబ్బు చేస్తే... చూసే ఆసుపత్రి లేని చోట, డాక్టర్ అంటే ఒక కలలా అనిపించే ప్రజలున్న చోటుకు ఒక వాహనం వెళ్తోంది, సైరన్ లేకుండా. ఆ వాహనంలో కేవలం మందులు మాత్రమే కాదు... ఆరోగ్యం మీద నమ్మకాన్ని పెంచే సిబ్బంది కూడా ఉన్నారు. దానిపేరు ‘సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్’.
‘మాకు జ్వరం వస్తే కనీసం మాత్ర కూడా దొరకదు. నాటు వైద్యం, ఆకుపసర్లు వేసుకుంటాం. తాయత్తులు కట్టుకుంటాం. ఆసుపత్రికి వెళ్లాలంటే ఘాట్ రోడ్‌లో 70 కిలోమీటర్లు ప్రయాణించి మల్కన్‌గిరి వెళ్లాలి. అంతదూరం వెళ్లే ఓపిక ఇక్కడి వృద్ధులకు, మహిళలకు లేదు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు’ అన్నాడు ఒడిశా రాష్ట్రం చిత్రకొండ గ్రామవాసి మైకేల్. మల్కన్‌గిరి జిల్లాలోని ఈ గ్రామానికి వెళ్లాలంటే కొండల మధ్య అడవుల్లో వెళ్లాలి. తీవ్రవాద ప్రభావం ఎక్కువ. రవాణా సౌకర్యాలు ఉండవు. భారత దేశంలో ఇలా అడవుల మధ్య వైద్యం లేని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అలాంటి చోట వైద్యాన్ని పేదల గుమ్మం వద్దకు తీసుకెళ్లే ఒక వినూత్న ప్రయత్నమే ఎస్‌బీఐ ఫౌండేషన్ ‘సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్’.
‘‘ఇది ఒక మొబైల్ ఆసుపత్రి. దేశంలోని అత్యంత వెనుకబడిన గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ఈ మొబైల్ మెడికల్ వాహనాలు చేరుకొని, ఉచిత ప్రాథమిక వైద్యసేవలను అందిస్తున్నాయి. ప్రతీ ‘సంజీవని’ వాహనంలో... ఒక డాక్టర్, ఒక నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఉంటారు. వైద్య పరీక్షలు చేసి, మందుల్ని కూడా ఇస్తాం. వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైన చికిత్సల కోసం పెద్ద ఆసుపత్రులకీ పంపిస్తాం. అంతేకాదు, అసలు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతాం’ అన్నారు రోగులను పరీక్షిస్తున్న డాక్టర్ బిమల్ చరన్ సారంగి.
ఆయన ఒడిశాలో రామ్‌కీ ఫౌండేషన్ తరఫున వైద్యసేవలు అందిస్తున్నారు. ఇదంతా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక సేవా విభాగంలోని ఎస్‌బీఐ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ ఫౌండేషన్, రీ సస్టెయినబుల్ లిమిటెడ్, రామ్‌కీ గ్రూపుల సీఎస్సార్ నిధులతో దేశవ్యాప్తంగా 20 మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా 7 రాష్ట్రాలలో 7499 గ్రామాల్లో ఇప్పటి దాకా సుమారు 1.70 లక్షల మందికి వైద్య సేవలు అందించటానికి కృషి చేస్తున్నారు. ‘సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్’ ఉదయం నుంచి సాయంత్రం వరకూ రోజుకు రెండు ఊళ్లకు వెళుతుంది..
వైద్యం, మందులు ఉచితం...
బీపీ, షుగర్, డయాబెటీస్‌తో పాటు దాదాపు అన్ని రకాల రక్తపరీక్షలు ఈ వాహనంలో చేస్తారు. వారానికి సరిపడా మందులు ఉచి తంగా ఇస్తారు. అలాగే కంటి పరీక్షలు, దంత పరీక్షల వరకు సంపూర్ణ ప్రాథమిక వైద్య సేవ లందిస్తారు. వైద్యంతో పాటు పోషణ, శుభ్రత గురించి చెప్తారు. చేతులు కడుక్కోవడం, శుభ్రమైన నీరు వాడటం ఎంత ముఖ్యమో డాక్టర్లు కౌన్సెలింగ్ ఇస్తారు. ‘‘మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతో ‘క్లినిక్ ఆన్ వీల్స్’ ప్రాజెక్ట్ మొదట ఒడిశాలో 4 జిల్లాల్లోని 80 గ్రామాలలో అమలు చేశాం. సుమారు 70 వేల మందికి పైగా ఆరోగ్య సేవలు పొందారు. ఇదే ప్రాజెక్ట్‌ని గత ఏడాది నుంచి తెలంగాణలోని అసిఫాబాద్, భూపాల పల్లి, ఖమ్మం జిల్లాలతో పాటు, త్రిపురలో కూడా అమలు చేస్తున్నాం’’ అన్నారు ‘రామ్‌కీ ఫౌండేషన్’ హెడ్ ఎమ్వీ రామిరెడ్డి. ఇప్పటికీ వైద్యం చాలామందికి అందని ద్రాక్షగానే ఉంది. అయితే ‘సంజీవని’ లాంటి ప్రయత్నాలు ప్రతీ మారుమూల గిరిజన గ్రామానికి చేరితే... ఆరోగ్యం పట్ల భరోసా లభిస్తుంది.
- శ్యాంమోహన్, 94405 95858