తుపాకీ వదిలి.. రాఖీలతో కొత్త జీవితం.!
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:54 PM
ఏళ్ల తరబడి దట్టమైన అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన చేతులు.. నేడు రంగురంగుల దారాలు, మెరిసే పూసలతో రాఖీలను అల్లుతున్నాయి. ఒకప్పుడు హింసాత్మక జీవితాన్ని గడిపిన వారు.. ఇప్పుడు శాంతి, గౌరవం, స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రం లొంగిపోయిన మావోయిస్టులకు కొత్త జీవితాన్ని చూపుతోంది. వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్న ఈ కేంద్రంలో రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేకంగా రాఖీల తయారీ చేపట్టారు. వెయ్యికి పైగా రాఖీలను ఎంతో అందంగా రూపొందించారు. రంగురంగుల దారాలు, పూసలు, ఆకర్షణీయమైన అలంకరణలతో రూపొందించిన ఈ రాఖీలు మార్కెట్లోకి విస్తృతంగా అమ్ముడుపోయాయి. దీంతో తమ శ్రమకు తగిన ఫలితం దక్కుతోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాంకేర్ జిల్లా చౌగేల్ గ్రామంలోని పునరావాస కేంద్రం కేవలం శిక్షణ కేంద్రంగానే కాకుండా.. లొంగిపోయిన మావోలకు కొత్త జీవన మార్గాన్ని చూపించే వేదికగా నిలుస్తోంది. రాఖీల తయారీతో పాటు వివిధ వృత్తుల్లో వారికి శిక్షణ ఇస్తున్నారు. గతంలో హోలీ సందర్భంగా గులాల్‌ను కూడా వీరితోనే తయారు చేయించారు. ఈ సందర్భంగా అక్కడి ఏఎస్పీ ఆకాశ్ శ్రీశ్రీమాల్ మాట్లాడుతూ.. 'వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నాం. రాఖీల తయారీ సహా ఈ ఏడాది హోలీ సందర్భంగా గులాల్ కూడా తయారు చేయించారు' అని అన్నారు.
ఈ రక్షాబంధన్ తనకు ప్రత్యేకంగా నిలుస్తోందని అక్కడ శిక్షణ పొందుతున్న ఓ మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. 'అడవుల్లో జీవించేటప్పుడు రక్షాబంధన్ గురించి వినడమే కానీ, ఏనాడూ చేసుకోలేదు. ఈ ఏడాది ఇక్కడున్న భద్రతా సిబ్బందికి, తోటి శిక్షణార్థులకు రాఖీలు కట్టి పండుగ నిర్వహించుకుంటున్నాం' అని చెప్పుకొచ్చారు. తుపాకీని వదిలి.. చేతివృత్తిని అందిపుచ్చుకున్న ఈ మహిళలు, యువతులు తయారు చేస్తున్న రాఖీలు వారికి ఆదాయ వనరుగానే కాకుండా.. గౌరవప్రదమైన జీవితాన్ని నిర్మించుకుంటున్నామనే నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
ఇవీ చదవండి:
థరూర్‌కు Vs నేపాల్ ‘శశి థరూర్’.. ‘గ్రాండ్ లార్సెనీ’ నుంచి ‘ఎపికారికసీ’ వరకు
11 రోజుల్లో 30 లక్షల అభ్యంతరకర కంటెంట్! 'గ్రోక్'పై కేసు నమోదు