Share News

సింగిల్స్‌కు ఫిన్లాండ్ బంపర్ ఆఫర్.. ప్రేమలో పడేందుకు ఫ్రీ ట్రిప్ ఆహ్వానం

ABN , Publish Date - Nov 01 , 2026 | 07:48 PM

మీరు సింగిలా..? అయితే తమ దేశానికి రావాలని ఫిన్లాండ్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. అదీ కూడా ఫ్రీగా. ఎందుకంటే..

సింగిల్స్‌కు ఫిన్లాండ్ బంపర్ ఆఫర్.. ప్రేమలో పడేందుకు ఫ్రీ ట్రిప్ ఆహ్వానం

ఇంటర్నెట్ డెస్క్: సింగిల్ జీవితంతో విసిగిపోయామని భావిస్తున్న వారికి ఫిన్లాండ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. తమ దేశానికి ఉచితంగా రావాలంటూ ఆహ్వానిస్తోంది. అక్కడ బ్లైండ్ డేట్‌లో పాల్గొని ప్రేమలో పడొచ్చని ఊరిస్తోంది. అంతేకాకుండా ఫ్రీగా ఫిన్లాండ్ అందాలన్నీ తనివితీరా చూడొచ్చని అంటోంది. పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఆ దేశం సరికొత్త కార్యక్రమానికి తెరతీసింది. దీని పేరే ‘ఫిన్నిష్ డిన్నర్ డేట్’. ఇందులో భాగంగా 16 మంది సింగిల్స్‌ను ఫిన్లాండ్ సెలెక్ట్ చేయనుంది. వీరి కోసం ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఫ్రీ ట్రిప్‌ను నిర్వహించనుంది. తమ దేశంలోని పర్యాటక ప్రాంతాలకు ఈ పదహారు మందిని తీసుకువెళ్లనుంది. ఆ తరువాత అక్కడ ప్రాచుర్యం పొందిన ప్రత్యేక, అరుదైన వంటకాలను వీరికి రుచిచూపించనుంది. అంతేనా.. ఈ సింగిల్స్ కోసం ఓ బ్లైండ్ డేట్‌నూ ఏర్పాటు చేయనుంది.


ఈ బ్లైండ్ డేట్‌లో ఫిన్లాండ్‌లో సింగిల్స్ పాల్గొంటారు. సెలెక్ట్ అయిన పదహారు మందికీ ఈ ఫిన్లాండ్ సింగిల్స్‌తో పరిచయం ఏర్పడుతుందని ‘ఫిన్నిష్ డిన్నర్ డేట్’ కార్యక్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పరిచయం నుంచి ప్రేమ చిగురించవచ్చని అంటున్నారు. కాబట్టి సింగిల్స్‌కు ఇది మంచి అవకాశమని వివరిస్తున్నారు. ఫిన్లాండ్ ఈ కార్యక్రమం గురించి అలా చెప్పగానే.. ఇలా వైరల్ అయింది. పైగా ఇది పూర్తి ఉచితం కావడంతో సింగిల్స్ చూపు దీనిపై వాలింది. దీంతో ఈ ‘ఫిన్నిష్ డిన్నర్ డేట్’కు ఎలా దరఖాస్తు చేసుకోవాలని వారు ఆరా తీయటం మొదలెట్టారు. ఇంతకీ ఎలా దరఖాస్తు చేసుకోవాలో మీకు తెలుసా..?


ఇలా ఆప్లై చేయండి బాసు..!

దీనికి అర్హులెవరంటే.. 18 ఏళ్లు నిండిన సింగిల్స్ మాత్రమే ఈ ‘ఫిన్నిష్ డిన్నర్ డేట్’కు అర్హులు. మీది ఏ దేశమైనా పర్వాలేదు ఆప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 10, 2026.

దరఖాస్తు విధానం.. ఓ వీడియో ద్వారా ఈ కార్యక్రమానికి ఆప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరే ఒకవేళ డిన్నర్ డేట్ నిర్వహిస్తే.. అందులో మీరు ఏం వంటకాలను వడ్డిస్తారు..? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ వీడియో రికార్డ్ చేయాలి. తరువాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అయితే ఈ పోస్ట్‌లో #FinnishDinnerDate అని ట్యాగ్ చేయటం మర్చిపోకండి.

డిసెంబర్ 1న ‘ఫిన్నిష్ డిన్నర్ డేట్’కు ఎంపికైన 16 మంది వివరాలను ఫిన్లాండ్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటిస్తుంది. విమానం టికెట్ మొదలు అన్ని ఖర్చులూ ఆ దేశమే భరిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే చేసుకోండి మరి.


ఇవీ చదవండి

ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..

5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్

Updated Date - Nov 01 , 2026 | 07:55 PM